Telugu Global
Telangana

ఫామ్ హౌస్ నిందితుల విడుదల..

లంచం సొమ్ము దొరక్క‌పోవడంతో ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం వర్తించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిందితుల రిమాండ్ కుదరదని, వారిని విడుదల చేయాలని ఆదేశించారు.

ఫామ్ హౌస్ నిందితుల విడుదల..
X

మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనలో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించాలంటూ పోలీసులు చేసిన విజ్ఞప్తిని ఏసీబీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. వారిని తక్షణమే విడుదల చేయాలని, 41 సీఆర్పీసీ కింద నోటీసులివ్వాలని, ఆ తర్వాతే విచారణ చేపట్టాలని తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకు వారిని విడుదల చేసినట్టు శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌ రెడ్డి వెల్లడించారు.

నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌ లపై ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 120-బి (నేరపూరిత కుట్ర), 171-బి రెడ్‌ విత్‌ 171-ఇ 506 (నేరపూరిత బెదిరింపు) రెడ్‌ విత్‌ 34 ఐపీసీ, సెక్షన్‌ 8 ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌-1988 (ప్రభుత్వ ప్రతినిధికి లంచం ఎరవేయడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి సరూర్‌ నగర్‌ లో న్యాయమూర్తి జి.రాజగోపాల్‌ నివాసానికి నిందితులను తీసుకెళ్లి హాజరు పరిచారు పోలీసులు. లంచం సొమ్ము దొరకకపోవడంతో ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం వర్తించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిందితుల రిమాండ్ కుదరదని, వారిని విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో ఆ ముగ్గురిని పోలీసులు విడుదల చేశారు. 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి 100 కోట్ల రూపాయలు బేరం పెట్టి, ఆయనతో వచ్చే వారికి 50కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారనేది ప్రధాన అభియోగం. అయితే ఇక్కడ అడ్వాన్స్ కింద తెచ్చారంటూ ప్రచారం జరుగుతున్న నగదుని పోలీసులు కోర్టుకి చూపించలేకపోయారు. కానీ జాతీయస్థాయిలో ఒక కీలక నాయకుడి సెక్రటరీ ఆ ముగ్గురితో డీల్ గురించి మాట్లాడిన ఆడియో రికార్డ్ లు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఆడియో ఎవిడెన్స్ కూడా న్యాయమూర్తి ముందు పెట్టలేదు. దీంతో సరైన ఆధారాలు లేవంటూ న్యాయమూర్తి వారి రిమాండ్ తిరస్కరించారు.

First Published:  28 Oct 2022 1:47 AM GMT
Next Story