Telugu Global
Telangana

2022-23లో సుమారు 200 రైలు ప్రమాదాలు.. రికార్డులకు ఎక్కినవి నామమాత్రమే!

ఇండియన్ రైల్వే నెట్‌వర్క్‌లో 2022-23కు సంబంధించి కాన్‌సీక్వెన్షియల్ (తీవ్రమైన నష్టం కలిగించేవి) ప్రమాదాలు 48 చోటు చేసుకున్నాయి.

2022-23లో సుమారు 200 రైలు ప్రమాదాలు.. రికార్డులకు ఎక్కినవి నామమాత్రమే!
X

దేశంలో రైల్వే ప్రమాదాలు పెరిగిపోతున్నాయని.. వీటిపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఒడిషాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి.. మూడు రోజుల ముందే రైల్వే బోర్డు కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రైల్వే బోర్డు చైర్మన్, అన్ని జోనల్స్ జనరల్ మేనేజర్లు, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. దేశంలోని రైల్వే నెట్‌వర్క్‌ బలోపేతం చేయాలని, ఏడాదికేడాది పెరుగుతున్న ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తోందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.

ఇండియన్ రైల్వే నెట్‌వర్క్‌లో 2022-23కు సంబంధించి కాన్‌సీక్వెన్షియల్ (తీవ్రమైన నష్టం కలిగించేవి) ప్రమాదాలు 48 చోటు చేసుకున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే ఇవి 11 ఎక్కువ. ఇక నాన్‌కాన్‌సీక్వెన్షియల్ (నష్టం తక్కువగా ఉన్నవి) ప్రమాదాలు 162 చోటు చేసుకున్నాయి. ఇందులో రైల్వేలో అతిపెద్ద నిర్లక్ష్యంగా భావించే సిగ్నల్ పాస్‌డ్ ఎట్ డేంజర్ (ఎస్‌పీఏడీ) ప్రమాదాలు 35 వరకు ఉన్నాయి. మొత్తంగా చూస్తే 2022-23లో సూమారు 200 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే, వీటిలో చాలా వరకు రికార్డులకు ఎక్కలేదని తెలుస్తున్నది.

రైల్వేలో కీలకంగా భావించే లోకో పైలెట్ల కొరత, వారిపై పడుతున్న అదనపు భారం కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. ముఖ్యంగా ఎస్‌పీఏడీ ప్రమాదాలకు వీరి అలసటే కారణం అని కూడా సమావేశంలో చర్చించారు. వీలైనంత త్వరగా లోకో పైలెట్ల కొరతను తగ్గించాలని.. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కూడా నిర్ణయించారు. అయితే దానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కావల్సి ఉన్నది.

ఈస్ట్ కోస్ట్ రైల్వేపై ఆందోళన..

రైల్వేల సెఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా రైల్వే బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఆయా జోన్ల పరిధిలోని అత్యధిక సమయం పని చేస్తున్న వారి వివరాలు కూడా తీసుకోవాలని జోనల్ జనరల్ మేనేజర్లకు సూచించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో లోకో పైలెట్లు ఎక్కువ గంటలు పని చేస్తున్నట్లు రైల్వే బోర్డులో చర్చకు వచ్చింది. కాగా, కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోనే చోటు చేసుకున్నది. ఈ ప్రమాదానికి రెండు రోజుల ముందే రైల్వే బోర్డు ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.

లోకో పైలెట్లు ఎస్‌పీఏడీ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కూడా బోర్డు సమావేశంలో చర్చ జరిగింది. ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న చోట్ల ట్రాక్‌కు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోకో పైలెట్ల పని గంటలు 12కు మించకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పూర్తి స్థాయి సిబ్బంది నియమించిన తర్వాత 8 గంటలకే వారి పనిని పరిమితం చేయాలని సూచించారు.

సదరన్ రైల్వే పరిధిలో 392 లోకో పైలెట్ల ఖాళీలు ఉన్నాయని.. వాటిని వెంటనే భర్తీ చేయాలని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ డిమాండ్ కూడా చేసింది. కరోనా మహమ్మరి తర్వాత ఇప్పుడు రైల్వేలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయని.. కాబట్టి దీనికి అనుగుణంగా అన్ని డిపార్ట్‌మెంట్లలో స్టాఫ్ బర్తీ జరగాలని కార్మిక, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైల్వేలో సిబ్బంది కొరత వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని పేర్కొన్నాయి. కాగా, ఈ మీటింగ్ జరిగిన మూడో రోజే కోరమండల్ ప్రమాదం చోటు చేసుకున్నది. మరి ఇప్పటికైనా రైల్వేల్లో ఉన్న ఖాళీలను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందో లేదో వేచి చూడాలి.

First Published:  3 Jun 2023 10:44 AM GMT
Next Story