Telugu Global
Telangana

'సర్వే' సర్వత్రా 'ఆరా' !

రేవంత్ రెడ్డి తన పేరు ప్రస్తావించినందున ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టు మస్తాన్ చెప్పుకున్నారు.

సర్వే సర్వత్రా ఆరా !
X

తెలంగాణలో ఏర్పడిన 'ముందస్తు' అల్పపీడనం.. 'ఆరా' సర్వేతో వాయుగుండంగా మారనున్నది.ఈ సర్వే 'కొంచెం ఇష్టం - కొంచెంకష్టం 'గా కనిపిస్తోంది.బీజేపీ అగ్రనాయకత్వంలో 'నెంబర్ టూ' అమిత్ షాతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న గుంటూరు నివాసి మస్తాన్ 'ఆరా' కు అధిపతి.ఆయనకు తెలంగాణ రాజకీయాలతో దశాబ్దకాలంగా అనుబంధం ఉన్నది.టిఆర్ఎస్ తరపున సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి హరీశ్ రావు తదితర నాయకులతో నేరుగా పరిచయాలున్నాయి.బుధవారం హైదరాబాద్ లో మీడియా సమావేశం పెట్టి సంచలన వివరాలు వెల్లడించారు.ఉరుములు,మెరుపులు లేకుండా పిడుగు పడినట్టు తమ సర్వే ఫలితాలు ఇప్పుడు ఎందుకు బయటపెట్టారో ఎవరికీ అంతు చిక్కడం లేదు.రేవంత్ రెడ్డి తన పేరు ప్రస్తావించినందున ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టు మస్తాన్ చెప్పుకున్నారు.

తెలంగాణలో ఎన్నికలకు కనీసం 17 నెలల దాకా వ్యవధి ఉన్నది.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేసీఆర్‌ కు మళ్ళీ అధికారం లభిస్తుందని చెప్పడమేమిటి? 2022 జూలైలో ఉన్న ప్రజాభిప్రాయం నిలకడగా కొనసాగుతుందా? అనే అంశంపై పలు సందేహాలున్నవి. ఈసారి తమదే ప్రభుత్వమని బీజేపీ,కాంగ్రెస్ పోటాపోటీగా ప్రకటనలు గుప్పిస్తున్నాయి.'ఇప్పటికిప్పుడు ఎన్నికలు' అంటే ఏమిటి? ముందస్తుకు సంకేతాలు ఉన్నాయా? ఉంటే ఆ సంకేతాలు ఎక్కడి నుంచి మస్తాన్ కు అందుతున్నాయి?టీఆర్‌ఎస్‌కు 38.88 శాతం, బీజేపీకి 30.48, కాంగ్రెస్‌కు 23.71,ఇతరులకు 6.93 శాతం ఓట్లు వస్తాయని 'ఆరా'లో తేలింది.మస్తాన్‌ సర్వే విశ్వసనీయతపై నీలి నీడలున్నాయి.ఆంధ్రప్రదేశ్ లో 130 నుంచి 150 సీట్ల వరకు జగన్ గెల్చుకుంటారని,హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలుపు తధ్యమని తాము ముందే చెప్పామని 'ఆరా' సంస్థ క్రెడిబులిటీని సమర్ధించుకునేందుకు మస్తాన్ ప్రయత్నించారు.పరిస్థితి ఇలాగే ఉంటే టీఆర్‌ఎస్‌కు 8 శాతం ఓట్లు తగ్గుతాయన్నది మస్తాన్ కథనం.

ఉమ్మడి ఖమ్మం,నల్గగొండ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ మధ్య పోటీ కేంద్రీకృతం కానున్నట్టు అన్ని పార్టీలకు తెలుసు.అయితే వరంగల్ ను కూడా ఆ జిల్లాలతో ముడిపెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇక మెదక్‌, మహబూబ్‌నగర్‌లో త్రిముఖ పోటీ జరిగే అంచనాలపై కూడా అనుమానాలున్నాయి.ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ కు గణనీయమైన సంప్రదాయ ఓటు బ్యాంకు ఉన్నది.అయితే తెలంగాణ ఆవిర్భావానికి ముందున్న పరిస్థితి అది.తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2018 లో సంగారెడ్డిని మాత్రమే కాంగ్రెస్ గెల్చుకోగలిగింది.ఉమ్మడి ఆదిలాబాద్‌,నిజామాబాద్‌,కరీంనగర్‌ లలో టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్యనే పోటీ ఉందనడం వాస్తవానికి చాలా దూరంగా ఉన్నట్టు ఆ ప్రాంతాలకు చెందిన మీడియా ప్రతినిథులు,రాజకీయ నాయకులు చెబుతున్నారు.హైదరాబాద్‌,రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్న అంచనాల వెనుక జిహెచ్ఎంసి ఫలితాలను ఆధారం చేసుకున్నారని కొందరు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.ఆయా నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పటిష్ఠంగా ఉన్నది. కాంగ్రెస్ మరీ బలహీనంగా ఉన్నట్టు ఇంత ముందస్తుగా అంచనాకు రావడం సరైనది కాదేమో! ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వైఎస్సార్‌టీపీ బలమైన పార్టీగా ఎదుగుతుందన్నది 'ఆరా' భావన.షర్మిల పార్టీ ప్రభావం ఉమ్మడి ఖమ్మంకు మాత్రమే పరిమితం కావచ్చునన్న అభిప్రాయం ఆ జిల్లాలోని రాజకీయ కార్యకర్తలలో వ్యక్తమవుతోంది.

మస్తాన్ వెల్లడించిన వివరాల్లో 'అభ్యర్థుల బలాబలాల' అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి.అధికారపార్టీ టీఆర్‌ఎస్ లో బలమైన అభ్యర్థులు ఉండడం సహజం.అధికారపార్టీలో ఉన్నంత వరకే వాళ్ళు 'బలంగా' కనిపిస్తారు.అదీ సహజమే! 103 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలలో 87 మంది బలమైన అభ్యర్ధులున్నట్టు ''ఆరా'' తెలిపింది.వివిధ మార్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారాన్ని క్రోడీకరిస్తే ఆ ఎమ్మెల్యేలలో కనీసం పాతికమంది ప్రజల నుంచి 'వ్యతిరేకత'ను,లేదా అసంతృప్తిని ఎదుర్కుంటున్నారు.ప్రజల్లో ఆదరణను కోల్పోతున్న ఎమ్మెల్యేలు 'బలమైన' అభ్యర్థుల జాబితాలోకి ఎట్లా చేరతారు? అంగబలం,అర్ధబలం పుష్కలంగా ఉన్నా ప్రజాభిమానానికి దూరమైతే దేవుడు కూడా వాళ్ళను ఎన్నికల్లో గట్టెక్కించలేడు.

బీజేపీకి 29, కాంగ్రెస్‌కు53 స్థానాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారని చెబుతూనే,మరోవైపు బీజేపీకి ఈ సర్వేలో రెండవ స్థానం ఇవ్వడం అనుమానాస్పదంగా ఉన్నది.కేసీఆర్ కు బీజేపీకి మధ్య 8 శాతం ఓట్ల తేడా ఉంటుందని చూపారు.స్థూలంగా కాంగ్రెస్ ను మూడో స్థానానికి నెట్టివేశారు.ఆ రెండు జాతీయపార్టీలకు 'అభ్యర్థుల కొరత' ఉన్నట్టు చాలాకాలంగా వార్తాకథనాలు వస్తున్నాయి.అందుకే 'చేరికల కమిటీ'లను రెండు పార్టీలు ఏర్పాటు చేసుకున్నాయి.బీజేపీలో ఈటల రాజేందర్,కొండా విశ్వేశ్వరరెడ్డి,ఇంద్రసేనారెడ్డి వంటి వారు 'మానిటర్' చేస్తున్నారు.కాంగ్రెస్ లో దిగ్గజ నాయకుడు జానారెడ్డి మానిటర్ చేస్తున్నారు.

'బలమైన అభ్యర్థుల'పేరిట సూపర్ మార్కెట్ లో రెడీమేడ్ గా దొరకరు.''పాత వాళ్ళకే టికెట్టు ఇవ్వాలీ.కొత్తగా చేరే వాళ్లకు టికెట్టు హామీ ఇవ్వకూడద''ని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే పార్టీ హైకమాండ్ కు తేల్చి చెప్పారు.కోమటిరెడ్డి వ్యవహారం పట్ల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ భగ్గుమంటున్నారు.రేవంత్ 'టికెట్టు హామీ' మేరకే పలువురు చేరుతున్నారు.కోమటిరెడ్డి వ్యాఖ్యలతో చేరికలకు కొంత బ్రేకు పడే అవకాశాలున్నాయి.''ఒక్కరితోనే పార్టీ అధికారంలోకి రాదు''అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎంపీ అన్నారు.సమష్టిగా కేసీఆర్ పై పోరాడాలన్నది కోమటిరెడ్డి కాన్సెప్టు.ఇక భారతీయ జనతాపార్టీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను 'ఆకర్షించడానికి' తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ప్రస్తుతానికి ఫలితాలు ఆశాజనకంగా లేవు.మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మినహా 'పొటెన్షియల్'నాయకులెవరూ ఆ పార్టీలో చేరలేదు.అధికారపార్టీ ఎమ్మెల్యేలను 'లాగివేయడం'అంత సులభం కాదు.వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్టు 'నిరాకరిస్తే చూద్దాం' అనే ధోరణిలో ఉన్నారు.ఈ సంగతిని ఆయా ఎమ్మెల్యేలు స్థానిక విలేకరులతో 'ఆఫ్ ది రికార్డు'గా చెబుతున్నారు.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ చివరి నిముషం దాకా ఎవరికి టికెట్టు వస్తుందో,ఎవర్ని తిరస్కరిస్తారో ఎవరూ ఊహించలేకపొతున్నారు.కేసీఆర్ స్టయిలు అలాంటిది.2018 కన్నా కాంగ్రెస్,బీజేపీలు దూకుడుగా కనిపిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి మరింత అప్రమత్తంగా ఉంటారు.బలమైన అభ్యర్థులను కేసీఆర్ పోగొట్టుకోరు.చేతులారా కాంగ్రెస్ కో,బీజేపీకో 'బలమైన'అభ్యర్థులను ఎందుకు అప్పజెపుతారు?

వచ్చే ఎన్నికలను ఈ అంశాలు ప్రభావితం చేయనున్నవి.

1.కేసీఆర్ ఇమేజ్ గ్రాఫ్ తగ్గలేదు.పార్టీకి బలమైన అభ్యర్ధులు ఉన్నారు.సమర్ధ నాయకత్వం ఉన్నది.ఆర్ధిక వనరులు పుష్కలంగా ఉన్నాయి.టిఆర్ఎస్ కు హైకమాండ్ హైదరాబాద్ లో ఉంది.విధాన నిర్ణయాలు ఇక్కడే జరుగుతాయి.

2. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఢిల్లీలో బలహీనంగా ఉన్నందున రాష్ట్రాల్లో దాని ప్రభావం ఉంటుంది.టిఆర్ఎస్ నుంచి అభ్యర్థుల్ని లాక్కోవడం తేలిక కాదు.ఆర్ధిక వనరులు స్వల్పం.సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరన్న అభిప్రాయం సాధారణ ఓటర్లలో ఉన్నది.పైగా గెలిచాక టిఆర్ఎస్ లోకి ఫిరాయిస్తారన్న ట్రాక్ రికార్డు కూడా కాంగ్రెస్ కు ప్రతికూల అంశం.అలాగే కేసీఆర్ వలె రాజరికపు జిత్తులు,రణతంత్రపుటెత్తులు రేవంత్ లో లేవు.విధానం నిర్ణయాలు స్థానికంగా జరుగుతాయన్న హామీ ఇవ్వలేరు.

3.బీజేపీ హైకమాండ్ బలంగా ఉంది.కానీ తెలంగాణలో కాంగ్రెస్ లాగా సంస్థాగత నిర్మాణం లేదు.మోడీ జనాకర్షణ,హిందుత్వ వాదం,మతపరమైన వివాదాలు తమను గట్టెంకించగలవన్నది బండి సంజయ్ ధీమా. కేసీఆర్ వ్యూహాలకు దీటుగా వ్యూహాలు రచించే నాయకుల కొరత తీవ్రంగా ఉన్నది.

4. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలలో కొంత వ్యతిరేకత ఉన్నా,ఆయనను తిరస్కరించేంత స్థాయిలో వాళ్లలో ఆగ్రహం లేదు.పాలనా దక్షునిగా ఆయనకున్న గుర్తింపు ఎమ్మెల్యేలపై ఉండే వ్యతిరేకతను అధిగమించడానికి ఉపయోగపడుతుంది.

Next Story