Telugu Global
Telangana

ఆధార్ భద్రత సరిగా లేదు.. మూడీస్ రేటింగ్ సంస్థ నివేదిక

ఆధార్ సిస్టమ్స్‌ను పౌరులతో పాటు ప్రైవేట్ సర్వీస్ సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి. ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్‌తో పాటు ఓటీపీ వంటి సెక్యూరిటీ ద్వారా ఆధార్ వివరాలు తెలుసుకునే అవకాశం ఉన్నది.

ఆధార్ భద్రత సరిగా లేదు.. మూడీస్ రేటింగ్ సంస్థ నివేదిక
X

ఇండియాలో ధ్రువీకరణ పత్రంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న ఆధార్ భద్రతపై గ్లోబల్ రేటింగ్ సంస్థ మూడీస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియాలో ఉపయోగిస్తున్న సెంట్రలైజ్డ్ ఐడెటిఫికేషన్ సిస్టమ్‌లో పలు లోపాలు ఉన్నట్లు మూడీస్ తెలిపింది. ఆధార్ సిస్టమ్స్ చాలా సార్లు సర్వీస్‌ను అందించలేక ఆగిపోతున్నట్లు పేర్కొన్నది. ఇక ఇండియా వంటి అధిక ఉష్ణోగ్రత, చెమటలు ఎక్కువగా పట్టే దేశంలో బయోమెట్రిక్ టెక్నాలజీని నమ్ముకోవడం తప్పని చెప్పింది.

ఆధార్ సిస్టమ్స్‌ను పౌరులతో పాటు ప్రైవేట్ సర్వీస్ సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి. ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్‌తో పాటు ఓటీపీ వంటి సెక్యూరిటీ ద్వారా ఆధార్ వివరాలు తెలుసుకునే అవకాశం ఉన్నది. అయితే చాలా సార్లు ఆధార్ సిస్టమ్స్‌తో కనెక్షన్ ఫెయిల్ అవడం, సర్వర్లు డౌన్ అవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. సరైన సర్వర్ కనెక్షన్ లేకపోవడం వల్ల బయోమెట్రిక్ విధానం అప్పుడప్పుడు ఫెయిల్ అవుతోందని.. ఇది ఆందోళనకరమైన విషయమని మూడీస్ పేర్కొన్నది.

దేశంలో అనేక సంక్షేమ పథకాలకు ఆధార్‌ను లింక్ చేశారు. లబ్ధిదారులను గుర్తించడానికి బయోమెట్రిక్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే చాలా సార్లు ఆధార్ సిస్టమ్స్ సర్వీస్‌ను తిరస్కరిస్తోంది. బయోమెట్రిక్ అనేది చాలా సున్నితమైన టెక్నాలజీ. ఇండియాలో చేతి పని చేసే కూలీలు, కార్మికులు ఎక్కువగా ఉంటారు. చాలా సార్లు వీళ్లు అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత పరిస్థితుల్లో పని చేస్తుంటారు. అలాంటి వాళ్లు బయోమెట్రిక్‌ను ఉపయోగించినప్పుడు సర్వర్లు తిరస్కరిస్తున్నాయి. భారత్‌లోని వాతావరణ పరిస్థితుల బట్టి ఇక్కడ బయోమెట్రిక్ ఉపయోగించడం సరైనది కాదని మూడీస్ అభిప్రాయపడింది.

వరుసగా బయోమెట్రిక్‌ను తిరస్కరించడం ద్వారా అసలైన వ్యక్తులు కూడా నకిలీలుగా పొరపడే అవకాశాలు ఉంటాయి. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లే అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేశాయి. ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ఆధార్ బేస్డ్ పేమెంట్లు ఇస్తున్నారు. వీళ్లు కఠినమైన పరిస్థితుల్లో పని చేసే కూలీలు. చాలా సార్లు వీరి ఆధార్ బయోమెట్రిక్స్ తిరస్కరణకు గురవుతున్నాయి.

ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు తప్పని సరిగా ఆధార్ బేస్డ్ పేమెంట్లు చేయాలని.. అందరు కూలీల వివరాలు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని గత నెల కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే దీని వల్ల ఏర్పడే ఇబ్బందులను 'డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అండ్ డిజిటల్ అసెట్స్' పేరుతో వెలువరించిన సంచికలో మూడీస్ ఒక నివేదికను ప్రచురించింది. ఇందులో ఆధార్‌ను ప్రపంచంలోనే అత్యధిక మంది ఉపయోగించే డిజిటల్ ఐడీగా పేర్కొన్నది. ఇండియాలో 120 కోట్ల మందికి ఆధార్‌ను జారీ చేసినట్లు పేర్కొన్నది.

మరోవైపు ఆధార్ ప్రైవసీ కూడా సరిగా లేదని తెలిపింది. ఆధార్ వివరాలన్నీ ఒకే వ్యక్తి, ఒకే ప్రదేశంలో ఆన్‌లైన్ చేస్తున్నారు. ఆ వ్యక్తికి సదరు ఆధార్ వివరాలన్నీ తెలిసిపోతున్నాయి. ఇది ప్రైవసీని దెబ్బతీస్తోందని.. కొన్ని సార్లు ఆ వివరాలు ఇతరుల చేతికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని మూడీస్ పేర్కొన్నది. ఆధార్ వివరాలు అనేవి చాలా సున్నితమైన అంశం. వీటిని సెంట్రలైడ్జ్ సిస్టమ్స్‌లో సేవ్ చేయడం కూడా భద్రత పరంగా సరైనది కాదని పేర్కొన్నది.

డిజిటల్ వ్యాలెట్స్, క్రిప్టో కరెన్సీ వంటివి బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించుకొని డీసెంట్రలైడ్జ్ ఐడీ(డీఐడీ)పై ఆధారపడతాయి. అందుకే అవి భద్రతాపరంగా అత్యున్నతంగా ఉంటాయి. ఆధార్‌ను కూడా ఇదే టెక్నాలజీకి మార్చి, డీసెంట్రలైజ్డ్ చేస్తే అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పింది. డీఐడీ టెక్నాలజీ వల్ల బయోమెట్రిక్స్ అత్యంత వేగంగా గుర్తించే వీలుంటుంది. మన ఫోన్‌ను అన్‌లాక్ చేసినంత సులభంగా.. డీఐడీ పద్దతిలో వేగంగా అథంటికేషన్ చేయవచ్చని చెప్పింది. ఆధార్ అన్‌లైన్ ఫ్రాడ్ కూడా జరగకుండా ఈ టెక్నాలజీ నిరోధిస్తుందని పేర్కొన్నది.

ఇటీవల కాటలోనియా, అజర్‌బైజాన్, ఈస్టోనియా వంటి దేశాలు బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఉపయోగించి అత్యంత విజయవంతంగా డిజిటల్ ఐడీలను పౌరులకు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ టెక్నాలజీ వల్ల పౌరులతో తమ ఐడీలపై పూర్తి కంట్రోల్ ఉంటుందని.. ఒక సారి ఐడీ జారీ చేసిన తర్వాత ఇతరులు దాన్ని మార్చలేరని పేర్కొన్నది.

సెంట్రలైడ్జ్ సిస్టమ్స్ వల్ల ఆధార్ వివరాలు తెలిసిన బ్యాంకు ఎంప్లాయో, సోషల్ మీడియా సంస్థనో, ప్రభుత్వ ఉద్యోగో మరొకరో వాటిని మార్చేసే అవకాశం ఉంటుంది. యూజర్‌కు చెందిన అడ్రస్ లేదా పేరు లేదా ఇతర వివరాలు మార్చేసి వాటిని దుర్వినియోగం చేయడానికి వీలుంటుంది. అదే బ్లాక్‌చైన్ టెక్నాలజీలో అలాంటి అవకాశమే ఉండదు. కేవలం ఆధార్ హోల్డర్ మాత్రమే మార్పులు చేర్పులకు అవకాశం కల్పించగలడని నివేదికలో స్పష్టం చేసింది.

First Published:  25 Sep 2023 4:18 AM GMT
Next Story