Telugu Global
Telangana

పట్టపగలు నడిరోడ్డుపై యువతి హత్య.. - ప్రియుడే హంతకుడు

రెండు కుటుంబాలనూ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు వారితో మాట్లాడి.. యువతిని ఇబ్బంది పెట్టొద్దని యువకుడిని హెచ్చరించారు. దీంతో అలేఖ్యపై కక్ష పెంచుకున్న శ్రీకాంత్‌ ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.

పట్టపగలు నడిరోడ్డుపై యువతి హత్య.. - ప్రియుడే హంతకుడు
X

నిర్మల్‌ జిల్లాలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ యువతిని దారుణంగా హతమార్చాడో యువకుడు. గతంలో ఒకరినొకరు ఇష్టపడిన వీరిద్దరూ యువతి కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించడంతో దూరమయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వీరి పంచాయితీ పోలీస్‌స్టేషన్‌ వరకూ వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమెపై కక్ష పెంచుకున్న యువకుడు దాడి చేసి హతమార్చినట్టు తెలుస్తోంది. నిర్మల్‌ జిల్లాలోని ఖానాపూర్‌ పరిధి శివాజీనగర్‌లో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఖానాపూర్‌ పరిధిలోని శివాజీనగర్‌కు చెందిన అలేఖ్య (22), హత్యకు పాల్పడిన యువకుడు శ్రీకాంత్‌ గతంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు. అలేఖ్య కుటుంబ సభ్యులు వారి పెళ్లికి నిరాకరించారు. నాలుగు నెలల క్రితం ఆమెకు వేరే వ్యక్తితో వివాహం కూడా నిశ్చయించారు. ఈ విషయం తెలిసిన శ్రీకాంత్‌ పెళ్లి నిశ్చయించుకున్న వారికి ఫోన్‌ చేసి అమ్మాయి, తాను ప్రేమించుకుంటున్నామని చెప్పి వివాహం జరగకుండా చేశాడు.

దీంతో యువతి కుటుంబసభ్యులు శ్రీకాంత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు కుటుంబాలనూ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు వారితో మాట్లాడి.. యువతిని ఇబ్బంది పెట్టొద్దని యువకుడిని హెచ్చరించారు. దీంతో అలేఖ్యపై కక్ష పెంచుకున్న శ్రీకాంత్‌ ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. గురువారం మధ్యాహ్నం అలేఖ్య టైలరింగ్‌ శిక్షణ తీసుకుని ఇంటికి వెళ్తుండగా, ఒక్కసారిగా వెనకనుంచి కత్తితో దాడి చేశాడు. అడ్డువచ్చిన ఆమె వదిన, రెండేళ్ల చిన్నారి పైనా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి రియాన్షి తలకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను స్థానికి ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో నిర్మల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. హత్య చేసిన అనంతరం నిందితుడు శ్రీకాంత్‌ అక్కడినుంచి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సీఐ మోహన్, ఎస్‌ఐ లింబాద్రి ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  9 Feb 2024 3:34 AM GMT
Next Story