Telugu Global
Telangana

'మెట్రో రైలు' పై కేసు వేసిన‌ మహిళ... కోటి 70 లక్షల నష్టపరిహారానికై డిమాండ్

హైదరాబాద్ మెట్రో రైలు వల్ల తన జీవితం నాశనమై పోయిందని ఆరోపిస్తూ ఓ మహిళ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ సంస్థ నుండి తనకు కోటి 70 లక్షల నష్టపరిహారం ఇప్పించాలని ఆ మహిళ కోరారు.

మెట్రో రైలు పై కేసు వేసిన‌ మహిళ...  కోటి 70 లక్షల నష్టపరిహారానికై డిమాండ్
X

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్ నుంచి తనకు కోటి 70 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలని ఓ మహిళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ సంస్థ వల్ల తాను సర్వస్వం కోల్పోయానని రెయిన్‌ బజా ర్‌కు చెందిన ఉజ్మా హఫీజ్ అనే మహిళ పిటిషన్‌ వేశారు.

2017లో తాను నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద నుంచి వెళ్తుండగా పై నుంచి తన తలపై భారీ ఇనుప రాడ్డు పడిందని, దాంతో తన జీవితం మొత్తం నాశన‌మై పోయిందని ఉజ్మా హఫీజ్ కోర్టుకు తెలిపారు. ఆమె తరపున వాదనలు వినిపించిన న్యాయవాది శ్రీపాద ప్రభాకర్, ఆమెకు జరిగిన ప్రమాదం వార్తలు అన్ని పత్రికల్లో వచ్చాయని తెలిపారు. ఆమెకు ఉస్మానియా , అపోలో ఆస్పత్రుల్లో చికిత్స జరిగిందని, అయినప్పటికీ ఆమె కోలుకోలేదని లాయర్ తెలిపారు. ఆ ప్రమాదం వల్ల ఆమె ప్రస్తుతం జ్ఞాపక శక్తి కోల్పోయిందని, చూపు మందగించిందని, నడక అదుపు తప్పిందని, ఇంకా అనేక అనారోగ్య సమస్యలతో ఆమె బాధపడుతున్నట్లు తెలిపారు.

ఈ కారణంగా ఆమె వైద్యం, కుటుంబ పోషణ కోసం 1 కోటి 70 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ లిమిటెడ్ ను ఆదేశించాలని లాయర్ కోర్టును కోరారు. ఈ అంశంపై ఇప్పటికే అనేక సార్లు మెట్రో రైల్‌ లిమిటెడ్ ను సంప్రదించినప్పటికీ వాళ్ళు స్పందించలేదని లాయర్ పేర్కొన్నారు. బాధితురాలి తరపు వాదనలు విన్న జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ ధర్మాసనం ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ లిమిటెడ్ తో సహా మున్సిపల్‌ శాఖ, హైదరాబాద్ మెట్రో రైల్‌ లిమిటెడ్ (HMRL) కు నోటీసులు జారీచేసింది. విచారణ అక్టోబరు 13కు వాయిదా వేసింది.

First Published:  18 Sep 2022 7:28 AM GMT
Next Story