Telugu Global
Telangana

టమాటా పంట వేసి ఒక్క నెలలో రూ.1.8 కోట్లు సంపాదించిన తెలంగాణ రైతు

తెలంగాణలోని మెదక్‌ జిల్లా కౌడిపల్లికి చెందిన బి.మహిపాల్ రెడ్డి అనే రైతు ఒక్క నెలలోనే టమాటా సాగు ద్వారా రూ.1.8 కోట్ల ఆదాయాన్ని పొందారు.

టమాటా పంట వేసి ఒక్క నెలలో రూ.1.8 కోట్లు సంపాదించిన తెలంగాణ రైతు
X

ఇప్పుడు టమాటా అనే పేరు వినగానే కొనేవారికి ఆందోళన, అమ్మే వారికి ఆనందాన్ని ఇస్తోంది. గత కొన్ని వారాలుగా టమాటా ధరలు ఆకాశాన్ని దాటి అంతరిక్షంలోకి దూసుకొని పోతున్నాయి. ఒకప్పుడు కేజి రూ.10 నుంచి రూ.20 పలికిన ధర.. ఇప్పుడు రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. ఒకానొక దశలో కేజి రూ.200 కూడా దాటిపోయింది. ఈ సారి టమాటా వేసిన రైతుల పంట కూడా పండింది. ఎప్పుడూ అరకొర లాభాలతో చేతులు దులుపుకునే టమాటా రైతుల్లో కొందరు.. ఈ సారి కోటీశ్వరులుగా మారిపోయారు.

తెలంగాణలోని మెదక్‌ జిల్లా కౌడిపల్లికి చెందిన బి.మహిపాల్ రెడ్డి అనే రైతు ఒక్క నెలలోనే టమాటా సాగు ద్వారా రూ.1.8 కోట్ల ఆదాయాన్ని పొందారు. మరో 40 శాతం పంట ఇంకా పొలంలోనే ఉన్నదని.. అది కూడా అమ్మితే మరింత ఆదాయం వస్తుందని మహిపాల్ చెబుతున్నారు. కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదివిన మహిపాల్.. తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. తనకు ఉన్న 20 ఎకరాలతో పాటు మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. గతంలో వరి ధాన్యాన్ని వేసినా.. చాలా వరకు నష్టాలే వచ్చాయి. దీంతో కూరగాయల సాగు వైపు మొగ్గు చూపారు.

ఆధునిక వ్యవసాయ పద్దతులను అనుసరిస్తూ.. కొన్నాళ్లుగా టమాటాను సాగు చేస్తున్నారు. టమాటా, ఇతర కూరగాయల సాగు వల్ల పెద్దగా లాభాలు రాకపోయినా.. నష్టం లేకపోవడంతో వాటినే కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే ఆయనకు అదృష్టం తెచ్చిపెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 20 ఎకరాల్లో టమాటా పంట వేశారు. రెండు నెలల తర్వాత పంట చేతికి వచ్చింది. మహిపాల్ వేసింది ఏ1 గ్రేడ్ రకం కావడం, అప్పటికే టమాటాకు చాలా డిమాండ్ ఉండటంతో.. భారీ ధర పలికింది.

ఏపీ నుంచి హైదరాబాద్‌కు టమాటా దిగుమతి తగ్గడం.. భారీగా డిమాండ్ పెరగడంతో కేజి రూ.100కు అమ్మినట్లు మహిపాల్ చెప్పారు. ఈ సీజన్‌లో పంట నష్టం కాకుండా గ్రీన్ నెట్లు పెట్టి సాగు చేశారు. అయినా అకాల వర్షాలకు కొంత నష్టం ఏర్పడింది. లేకపోతే రూ.2 కోట్ల వరకు ఆదాయం వచ్చేదని మహిపాల్ చెప్పారు. ఇంకా సగం పంట పొలంలో ఉందని.. దాన్ని కూడా త్వరలోనే అమ్ముతానని అన్నారు. ఈ సీజన్‌లో దాదాపు 7వేల బాక్సుల టమాటాలను మహిపాల్ అమ్మారు.

మిగిలిన 20 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నానని.. డ్రోన్ల సాయంతో పొలాల్లో ఫెర్టిలైజర్స్ చల్లుతున్నట్లు మహిపాల్ వివరించారు. ఆధునిక వ్యవసాయ పద్దతులు ఉపయోగించడం వల్ల అనవసరమైన ఖర్చులు తగ్గి.. ఆదాయం పెరిగిందని మహిపాల్ చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో 100 ఎకరాల మేర వ్యవసాయం చేస్తానని ఆయన తెలిపారు.

First Published:  22 July 2023 5:14 AM GMT
Next Story