Telugu Global
Telangana

హున్సాలో వింత ఆచారం.. - గ్రామమంతా రెండు వర్గాలుగా విడిపోయి పిడిగుద్దులు

పిడిగుద్దులతో రక్తం కారినా గ్రామస్తులు కార్యక్రమాన్ని కొనసాగించారు. కొందరు రక్తం కారుతుంటే కాముని బూడిదతో తుడుచుకున్నారు. అలా ఈ పిడి గుద్దుల ఆట సుమారు 8 నిమిషాలపాటు సాగింది.

హున్సాలో వింత ఆచారం.. - గ్రామమంతా రెండు వర్గాలుగా విడిపోయి పిడిగుద్దులు
X

మన దేశం విభిన్న సంస్కృతులకు, ఆచారాలకు నిలయం. ఒక్కో జిల్లా, ఒక్కో ప్రాంతం మారితే చాలు కొత్త కొత్త ఆచారాలు, సంస్కృతులు కనిపిస్తుంటాయి. పక్కపక్కనే ఉండే తెలంగాణ, రాయలసీమలలో కూడా భిన్నమైన ఆచారాలు కనిపిస్తుంటాయి. కర్నూలు జిల్లాలోని కొన్ని మండలాల్లో ఇప్పటికీ ఏటా సంక్రాంతి సమయంలో కర్రల సమరం జరుగుతూ ఉంటుంది. తలలు పగిలి రక్తం చిందుతున్నా కూడా ఈ సమరం ఆగదు. పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషించాల్సిందే.

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో కూడా ఇంచుమించు ఇటువంటి సాంప్రదాయమే ఉంది. సాలూర మండలం హున్సా గ్రామంలో ఏటా హోలీ సందర్భంగా గ్రామస్తులంతా రెండు వర్గాలుగా విడిపోయి పిడిగుద్దులు గుద్దుకుంటారు. ఈ ఏడాది కూడా ఈ ఆచారాన్ని గ్రామస్తులు పాటించారు. మంగళవారం ఉదయం గ్రామస్తులంతా హోలీ ఆడిన తర్వాత సాయంత్రం ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ గ్రామస్తులంతా రెండు వర్గాలుగా విడిపోయారు. వారు చెరొక వైపు నిల్చుని మధ్యలో భారీతాడు అడ్డుగా కట్టుకొని ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.

పిడిగుద్దులతో రక్తం కారినా గ్రామస్తులు కార్యక్రమాన్ని కొనసాగించారు. కొందరు రక్తం కారుతుంటే కాముని బూడిదతో తుడుచుకున్నారు. అలా ఈ పిడి గుద్దుల ఆట సుమారు 8 నిమిషాలపాటు సాగింది. కార్యక్రమం ముగిసిన తర్వాత గ్రామస్తులంతా పరస్పరం ఆలింగనం చేసుకొని హోలీ శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.

ఈ ఆటను నిర్వహించకపోతే గ్రామానికి అరిష్టం జరుగుతుందని గ్రామస్తుల నమ్మకం. అందుకే ఈ ఆచారాన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఈ పిడిగుద్దుల ఆటను చూసేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

First Published:  8 March 2023 2:31 PM GMT
Next Story