Telugu Global
Telangana

ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఫార్ములా కూడా తెలియదు.. ఏఈ పరీక్షలో టాప్ ర్యాంక్ కొట్టాడు

ఏఈ పరీక్షలో టాపర్‌గా నిలిచిన అభ్యర్థిని ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ సూత్రం అడగ్గా పోలీసుల ముందు తెల్లమొఖం వేశాడు. స్కూల్ విద్యార్థులు కూడా ఠక్కున చెప్పే సమాధానాన్ని కూడా చెప్పలేక నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది.

ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఫార్ములా కూడా తెలియదు.. ఏఈ పరీక్షలో టాప్ ర్యాంక్ కొట్టాడు
X

టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ఏఈ రిక్రూట్‌మెంట్ పరీక్షలో టాపర్‌గా నిలిచాడు. కానీ, ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ సూత్రం చెప్పమంటే తెల్లమొఖం వేశాడు. ఇతనొక్కడే కాదు.. పరీక్ష పత్రాలు కొనుక్కొన్న ప్రతీ ఒక్కరి పరిస్థితి అలాగే ఉంది. గ్రూప్-1, ఏఈ, ఏఈఈ, డీఏఓ పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాల లీక్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది. ఇప్పటి వరకు ప్రధాన నిందితులను పలు మార్లు విచారించిన సిట్ పోలీసులు.. ఇప్పుడు వారి దగ్గర నుంచి ప్రశ్న పత్రాలు కొనుక్కొని ర్యాంకులు సాధించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.

ఏఈ పరీక్షలో టాపర్‌గా నిలిచిన అభ్యర్థిని ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ సూత్రం అడగ్గా పోలీసుల ముందు తెల్లమొఖం వేశాడు. స్కూల్ విద్యార్థులు కూడా ఠక్కున చెప్పే సమాధానాన్ని కూడా చెప్పలేక నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. మ్యాథ్స్, సైన్స్, జనరల్ నాలెడ్జీ, హిస్టరీ, పాలిటీ వంటి అంశాలపై పట్టు లేకున్నా.. ఎంతో మంది అడ్డదారిలో ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసి.. పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించినట్లు గుర్తించారు. గ్రూప్-1, డీఏవో, ఏఈఈ, ఏఈ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన వారిలో అత్యధిక శాతం.. ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసి పరీక్ష రాసిన వారిగా గుర్తించారు.

ఇక మరో అభ్యర్థి సిట్ విచారణకు.. ప్రశ్నపత్రానికి సంబంధించిన జవాబులన్నీ వరుసగా రాసుకొని వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు. మార్చి 5న ఏఈ పరీక్ష నిర్వహించారు. తాము పరీక్ష రాసి రెండు నెలలు అయ్యిందని.. ఇప్పుడు జవాబులన్నీ మర్చిపోయామంటూ కొంత మంది సిట్ అధికారులకు చెప్పడం గమనార్హం.

ఏఈ పరీక్షకు సంబంధించి సురేశ్, రవికుశోర్, దివ్య, విక్రమ్ అనే వ్యక్తులకు ప్రశ్నపత్రాలు అందగా.. వాటిని అభ్యర్థులకు మూడు రోజుల ముందుగానే చేరవేసినట్లు తెలుస్తున్నది. కొంత మంది నిపుణుల వద్ద డౌట్స్ పేరుతో ప్రశ్నల జవాబులు తెలుసుకున్నారని.. మరి కొంత మంది టెస్ట్ పేపర్స్ నుంచి జవాబులు రాసుకొని.. వాటినే బట్టీ పట్టినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ నుంచే ఏఈ ప్రశ్నపత్రాలు మిగిలిన వారికి వెళ్లినట్లు సిట్ అధికారులు గుర్తించారు.

ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన ర్యాంకులు సాధించిన అందరి పైనా సిట్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. ఎవరి వద్ద నుంచి ఎలా ప్రశ్నపత్రాలు అందాయనే విషయాలను పూర్తిగా నమోదు చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసులో ఏ ఒక్క నిందితుడు కూడా తప్పించుకోకుండా కట్టుదిట్టంగా రిపోర్టు తయారు చేస్తున్నట్లు తెలిసింది.

First Published:  29 May 2023 9:18 AM GMT
Next Story