Telugu Global
Telangana

టీఎస్ఆర్టీసీలో సరికొత్త విధానం.. డైనమిక్ ప్రైసింగ్ అమలుకు రంగం సిద్ధం

ప్రైవేట్ బస్ ఆపరేటర్లతో పాటు హోటల్స్, ఫ్లైట్ బుకింగ్స్, తత్కాల్ రైల్ టికెట్ల రిజర్వేషన్ల విషయంలో ఇలా డైనమిక్ రిజర్వేషన్ అమలు చేస్తుంటారు.

టీఎస్ఆర్టీసీలో సరికొత్త విధానం.. డైనమిక్ ప్రైసింగ్ అమలుకు రంగం సిద్ధం
X

ప్రైవేటు ఆపరేటర్లకు ధీటుగా టీఎస్ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంతో పాటు అంతర్‌రాష్ట్ర సర్వీసులను కూడా పెంచి ప్రయాణికులను ఆకట్టుకుంటున్నారు. కొత్త బస్సులు, సరి కొత్త హంగులతో టీఎస్‌ఆర్టీసీ ముందుకు దూసుకొని పోతోంది. తాజాగా ఆన్‌లైన్ టికెటింగ్‌లో 'డైనమిక్ ప్రైసింగ్' విధానాన్ని అమలు చేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బెంగళూరు వెళ్తున్న 46 సర్వీసులకు ఈ పద్దతిని అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్వీసీ సజ్జనార్ గురువారం తెలియజేశారు.

ప్రైవేట్ బస్ ఆపరేటర్లతో పాటు హోటల్స్, ఫ్లైట్ బుకింగ్స్, తత్కాల్ రైల్ టికెట్ల రిజర్వేషన్ల విషయంలో ఇలా డైనమిక్ రిజర్వేషన్ అమలు చేస్తుంటారు. ప్రయాణికుల సంఖ్య, ట్రాఫిక్, డిమాండ్ వంటి విషయాలపై ఆధారపడి టికెట్ ధరను నిర్ణయిస్తుంటారు. రద్దీ తక్కువగా ఉన్న సమయంలో, అన్ సీజన్‌లో టికెట్ల ధర తగ్గడం.. ట్రాఫిక్ ఎక్కువగా, పండుగలు, వీకెండ్ సమయాల్లో దానికి అనుగుణంగా ధరలు పెరగడం డైనమిక్ ప్రైసింగ్‌లో జరుగుతుంది. మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా.. అధునాతన డేటా అనాలసిస్, మెషన్ లెర్నింగ్ వంటి అల్గారిథమ్స్ ఉపయోగించి టికెట్ల ధరలు నిర్ణయిస్తుంటారు.

దీని వల్ల ప్రయాణికులు తమకు ఎక్కడ తక్కువ ధర, ఏ సర్వీసుకు డిస్కౌంట్ ధర లభిస్తే దాన్ని ఎంచుకునే వీలుంటుంది. ప్రైవేట్ ఆపరేటర్లు సాధారణ రోజుల్లో కూడా డిమాండ్ లేకపోయినా అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. ఒక్కోసారి టీఎస్ఆర్టీసీ ధరలు చూపించి ఒక రూ.20-రూ30 తక్కువకే ప్రయాణికులకు టికెట్ల అందిస్తున్నారు. డైనమిక్ ప్రైసింగ్ అమలులోకి వస్తే ఇకపై టీఎస్ఆర్టీలో కూడా సాధారణ రోజుల్లో తక్కువ ధరకే టికెట్ల లభిస్తాయి. అన్‌సీజన్‌లో 20 నుంచి 30 శాతం ధరలు తగ్గే వీలుంటుంది. పీక్ సీజన్‌లో మాత్రం డిమాండ్‌కు అనుగుణంగా ధరలు పెరుగుతాయి.

మార్చి 27 నుంచి ఈ డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ అందుబాటులోకి రానున్నది. రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నుంచి బెంగళూరు వెళ్లే సర్వీసులకు ఈ పద్దతి అమలు చేయనున్నారు. పైలెట్ ప్రాజెక్టు విజయవంతం అయితే ఇతర సర్వీసులకు కూడా దీన్ని అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, సజ్జనార్ తెలిపారు.


First Published:  23 March 2023 1:59 PM GMT
Next Story