Telugu Global
Telangana

అమరుల స్మారకం.. దారి చూపే దీప స్తంభం : మంత్రి కేటీఆర్

తెలంగాణ సాధన కోసం చేపట్టిన ఉద్యమం.. ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రలోనే సమున్నతమని, ప్రజాస్వామ్య పోరాటాలకు తలమానీకం అని పేర్కొన్నారు.

అమరుల స్మారకం.. దారి చూపే దీప స్తంభం : మంత్రి కేటీఆర్
X

హైదరాబాద్ నడిబొడ్డున కొలువు తీరిన అమరుల స్మారకం స్థూపం.. భారత దేశానికే దారి చూపే ఒక దీప స్తంభంగా మారనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. త్యాగధనులను ఎప్పుడూ మా గుండెల్లో పెట్టుకుంటామని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సేవలో పునరంకితం అవుతామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల చివరి రోజున రాష్ట్ర వ్యాప్తంగా అమరులకు నివాళి అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అమరుల త్యాగాలను మరో సారి గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ సాధన కోసం చేపట్టిన ఉద్యమం.. ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రలోనే సమున్నతమని, ప్రజాస్వామ్య పోరాటాలకు తలమానీకం అని పేర్కొన్నారు. మన అమరుల ఆశయం కేవలం స్వపరి పాలన మాత్రమే కాదని.. సుపరిపాలన ఫలాలను సమస్త ప్రజలకు అందించడం అని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ట్వీట్ చేశారు.

దశాబ్దాలుగా పట్టి పీడించిన సకల దరిద్రాలను శాశ్వతంగా దూరం చేసి.. తెలంగాణ కష్టాల కడలి నుంచి గట్టెక్కించడమే అమరుల ఆశయమని వెల్లడించారు. అమరుల ఆశయాలే స్పూర్తిగా, ప్రజల ఆత్మ గౌరవ ఆకాంక్షలే ఊపిరిగా, తెలంగాణ ఉద్యమ నినాదాలే మైలు రాళ్లుగా, దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చి దిద్దే మహాయజ్ఞం మహోద్యమంగా సాగిందనడానికి.. తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానమే నిలువెత్తు నిదర్శనం అన్నారు. భారత స్వాతంత్ర పోరాట యోధుల కలలు 75 ఏళ్లు నిండినా నెరవేరలేదని.. కానీ అమరులు ఆశయాలు తొమ్మిదేళ్లలోనే నెరవేర్చి.. రాబోయే వందేళ్లకు బలమైన పునాది వేసింది సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.

కేటీఆర్ ట్వీట్ పూర్తిగా..

ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రలోనే సమున్నతం..

ప్రజాస్వామిక పోరాటాలకు తలమానికం..

తెలంగాణ సాధనోద్యమం

మన అమరుల ఆశయం..

కేవలం స్వపరిపాలన మాత్రమే కాదు...

సుపరిపాలన ఫలాలను సమస్త ప్రజలకు అందించడం..

దశాబ్దాలుగా పట్టిపీడించిన..

సకల దరిద్రాలను శాశ్వతంగా దూరంచేసి...

తెలంగాణ సమాజాన్ని కష్టాల కడలి నుంచి గట్టెక్కించడం..

అమరుల ఆశయాలే స్ఫూర్తిగా...

ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలే ఊపిరిగా..

తెలంగాణ ఉద్యమ నినాదాలే మైలురాళ్లుగా..

దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దే..

మహాయజ్ఞం మహోద్యమంగా సాగిందనడానికి

తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానమే నిలువెత్తు నిదర్శనం.

భారత స్వాతంత్ర్య పోరాటయోధుల కలలు

75 ఏళ్లు దాటినా నెరవేరని సందర్భమిది..

కానీ

తొమ్మిదేళ్ల స్వల్పకాలంలోనే

తెలంగాణ అమరుల ఆకాంక్షలు నెరవేర్చి

వచ్చే వందేళ్లకు బలమైన పునాది వేసిన సంకల్పమే

యావత్ దేశానికి.. తెలంగాణ నేర్పుతున్న పరిపాలనా పాఠం

ప్రతిజ్ఞచేస్తున్నం...

హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరిన

అమరుల స్మారకస్థూపం – జ్వలించే దీపం సాక్షిగా

త్యాగధనులను ఎప్పుడూ మా గుండెల్లో పెట్టుకుంటాం

నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల సేవలో

పునరంకితం అవుతాం..

మాటిస్తున్నం...

లక్ష్యం కోల్పోయిన భారత దేశానికి

దారిచూపే ఒక దీపస్తంభంగా

తెలంగాణను నిలుపుతాం

జోహార్..

తెలంగాణ అమరవీరులకు..

జై తెలంగాణ

జై భారత్

First Published:  22 Jun 2023 5:55 AM GMT
Next Story