Telugu Global
Telangana

రేవంత్ టార్గెట్ గా సీనియర్ కాంగ్రెస్ నేతల సమావేశం... తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయం

భట్టి విక్రమార్క ఇంట్లో ఈ రోజు కాంగ్రెస్ సీనియర్ల సమావేశం జరిగింది. ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, జగ్గారెడ్డి, కోదండరెడ్డి తదితరులు ఈ సమావేశంలో ఉన్నారు. మరోవైపు సీనియర్లంతా సమావేశంలో ఉండగానే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్ చేసి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంటే నడుస్తానని ప్రకటించారు.

రేవంత్ టార్గెట్ గా సీనియర్ కాంగ్రెస్ నేతల సమావేశం... తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయం
X

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైనప్పటి నుంచీ తెలంగాణలో ఆ పార్టీ సీనియర్లందరూ గుర్రుమీదున్నారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ ను నమ్ముకొని ఉన్నవాళ్ళను పక్కనపెట్టి టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ ను పీసీసీ అధ్యక్షుడిగా చేయడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మరో వైపు రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఒ‍ంటెద్దు పోకడలు కూడా అందరినీ ఆయనకు దూరం చేస్తున్నాయి.

ఇక ఈ మధ్య పీసీసీ కార్యవర్గం ప్రకటించిన తర్వాత సీనియర్లు, రేవంత్ రెడ్డికి మధ్య విభేదాలు పెరిగిపోయాయి. మొదటగా మాజీ మంత్రి కొండా సురేఖ అసమ్మతి గళం వినిపించగా.. ఆ తర్వాత బెల్లయ్య నాయక్.. వెనువెంట దామోదర్ రాజనర్సింహ అసమ్మతి స్వరాన్ని వినిపించారు. వీరు ముగ్గురు బహిరంగంగా మాట్లాడినప్పటికీ బైటికి మాట్లాడకుండా లోలోన రగిలిపోతున్నవాళ్ళు చాలా మందే ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడు భట్టి విక్రమార్క కూడా దీనిపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ కమిటీల గురించి తనకేమీ సమాచారం లేదని బహిరంగంగానే వ్యాల్హ్యానించారు.

Advertisement

ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క ఇంట్లో ఈ రోజు కాంగ్రెస్ సీనియర్ల సమావేశం జరిగింది. ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, జగ్గారెడ్డి,దామోదర రాజనర్సింహ, మహేశ్వర్ రెడ్డి, కోదండరెడ్డి తదితరులు ఈ సమావేశంలో ఉన్నారు. మరోవైపు సీనియర్లంతా సమావేశంలో ఉండగానే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్ చేసి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంటే నడుస్తానని ప్రకటించారు. వేరే పార్టీల నుంచి వచ్చినవారితో తెలంగాణ కాంగ్రెస్ బాగుపడదని ఈ సమావేశంలో సీనియర్లు అభిప్రాయపడ్డారు. అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులం తామేనంటూ సీనియర్లు ప్రకటించారు. ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌తోనే తేల్చుకుంటామని తేల్చిచెప్పారు.

Advertisement

సమావేశం తర్వాత వారంతా మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.

సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న సోషల్ మీడియా ప్రచారం కాంగ్రెస్ కోసమా లేక ఒక వ్యక్తి కోసమా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. తన మీద కూడా అసభ్య పోస్టులు పెట్టారనే విషయం పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారని ఉత్తమ్ అన్నారు. సీనియర్ నాయకులపై కోవర్టులుగా ముద్రలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచే అవకాశం ఉన్న చోట డీసీసీల నియామకం ఆపేశారు. కావాలనే ఇలా చేశారు. ఏడు డీసీసీలు కావాలనే ఆపారు. 180 పోస్టుల్లో 50, 60 మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే. ఇది మంచిది పద్ధతి కాదు. త్వరలో అధిష్టానాన్ని కలుస్తాం. పైన ఉన్నవాళ్లకు అవగాహన లేకపోవచ్చు. అధిష్టానం దగ్గర ఫైట్ చేస్తాం. కాంగ్రెస్‌లో ఇంటర్నల్ డేమోక్రసి ఉంది అని ఉత్తమ్ కుమార్ అన్నారు.

కాంగ్రెస్‌ను రక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే సీనియర్లమంతా ఏకమయ్యాం అని భట్టి విక్రమార్క తెలిపారు. కావాలనే కొందరు నేతలను నష్టపరిచేలా సోషల్ మీడియాలో క్యారెక్టర్‌ను దెబ్బ తీస్తున్నారని, ఏడాదిన్నర నుంచి ఈ తతాంగమంతా కుట్ర పూరితంగానే జరుగుతోందని భట్టి ఆరోపించారు. కాంగ్రెస్‌ను హస్తగతం చేసుకోవాలనే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలైన కాంగ్రెస్ వాదులకు వలస‌దారులకు తేడా ఉంటుందని భట్టి విమర్శించారు.

వలస నాయకులు అసలైన కాంగ్రెస్ వాదులను బద్నాం చేస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. పార్టీ ఉనికిని కాపాడిన మమ్మల్ని కోవర్టలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికార పార్టీ నేతలతో కుమ్మక్కైనోళ్లు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని మధుయాష్కీ మండిపడ్డారు. ఇలాంటి క్యారెక్టర్ లేనివాళ్ళు కాంగ్రెస్‌ను నాశనం చేసే కుట్ర చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మొత్తానికి ఈ వ్యవహారం రేవ‍ంత్ రెడ్డికి పదవికి ఎసరు తెస్తుందా అనే చర్చ జరుగుతోంది. రేవంత్ కు మద్దతుగా నిలుస్తున్న ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ను కూడా ఆ పదవి నుంచి తప్పించాలని సీనియర్ల ప్రయత్నం. వీరంతా కలిసి త్వరలోనే ఢిల్లీకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. మరి అధిష్టానం ఏమంటుందో వేచి చూడాలి.

Next Story