Telugu Global
Telangana

ఆడ బిడ్డను కన్న కోడలికి పూలబాటతో అత్తమామల స్వాగతం

కోడలు, మనవరాలు రాక కోసం ఎదురుచూస్తున్న అత్తమామలు శ్రీనివాసాచారి, భద్రకాళి కోడలికి ఊహించని విధంగా స్వాగతం పలికారు. రకరకాల పూలను తెప్పించి బయటి నుంచి ఇంట్లోకి పూల బాటపరిచి అందంగా అలంకరించారు.

ఆడ బిడ్డను కన్న కోడలికి పూలబాటతో అత్తమామల స్వాగతం
X

ఆడ బిడ్డను కన్న కోడలికి పూలబాటతో అత్తమామల స్వాగతం

ఆడబిడ్డ పుడితే చాలు.. ఆడపిల్ల పుట్టిందా.. అయ్యో అన్నట్లు మాట్లాడేవారు అప్పట్లో. అబార్షన్లు వచ్చిన తర్వాత కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలుసుకుని తీయించుకున్న వారు ఎందరో. వరుసగా ఆడబిడ్డల్ని కన్న తల్లిని తరిమేసిన మగవాళ్ళు, మగ బిడ్డ కోసం మరో పెళ్లి చేసుకున్న మగవాళ్ళు కూడా ఎందరో కనిపిస్తారు. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు కాలం కొంత మారిందనే చెప్పాలి. అందరూ అని చెప్పలేం కానీ.. చాలా మంది పుట్టేది ఆడబిడ్డ అయినా, మగ బిడ్డ అని ఒక్కటే అని అనేవారు కనిపిస్తున్నారు.

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఆడబిడ్డను కని మొదటిసారి అత్తవారింట అడుగుపెట్టిన కోడలికి అత్తమామలు పూల బాటపరచి స్వాగతం పలికారు. కే.సముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన సాయి కిరణ్, సంహిత దంపతులకు మూడు నెలల క్రితం తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. సంహిత పుట్టిల్లు సిరిసిల్ల కాగా కాన్పు కోసం ఆమె అమ్మవారి ఇంటికి వెళ్లి అక్కడే ఉంది. మూడు నెలల తర్వాత సోమవారం ఆమె పుట్టింటి నుంచి బిడ్డతో కలిసి తాళ్లపూసపల్లిలోని మెట్టినింటికి వచ్చింది.

అయితే కోడలు, మనవరాలు రాక కోసం ఎదురుచూస్తున్న అత్తమామలు శ్రీనివాసాచారి, భద్రకాళి కోడలికి ఊహించని విధంగా స్వాగతం పలికారు. రకరకాల పూలను తెప్పించి బయటి నుంచి ఇంట్లోకి పూల బాటపరిచి అందంగా అలంకరించారు. ఆ పూల బాటగుండా కోడలిని నడిపించి స్వాగతం పలికారు.

తొలిసారిగా పాప ఇంట్లోకి అడుగు పెడుతుండడంతో ఆ చిన్నారి పాద ముద్రలను తీసుకొని భద్రపరిచారు. ఆ విధంగా మనవరాలిపై శ్రీనివాసాచారి దంపతులు తమ అభిమానాన్ని చూపించారు. కాగా, శ్రీనివాసాచారి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇప్పుడు మొదటిసారి తమ ఇంట ఆడబిడ్డ పుట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆడబిడ్డ పుడితే ముళ్ళపొదల్లో పడేసే ఎంతోమంది ఉన్న ఈ కాలంలో ఆడబిడ్డ పుట్టిందని సంబరాలు చేసిన శ్రీనివాసాచారి దంపతులను పలువురు అభినందిస్తున్నారు.

First Published:  14 March 2023 8:02 AM GMT
Next Story