Telugu Global
Telangana

బ్యాంకింగ్ రంగంలో 9,000 ఉద్యోగాలు.. తెలంగాణ ప్రభుత్వంతో ఏలియంట్ గ్రూప్ ఒప్పందం

బీఎఫ్ఎస్ఐ సెక్టార్‌లోని కన్సల్టింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్‌లో దిగ్గజ కంపెనీ అయిన ఏలియంట్ గ్రూప్.. హైదరాబాద్‌లో 9,000 కొత్త ఉద్యోగాలను కల్పించనున్నది.

బ్యాంకింగ్ రంగంలో 9,000 ఉద్యోగాలు.. తెలంగాణ ప్రభుత్వంతో ఏలియంట్ గ్రూప్ ఒప్పందం
X

తెలంగాణ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగానికి ఊతమిచ్చేలా.. దిగ్గజ కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. బీఎఫ్ఎస్ఐ సెక్టార్‌లో ప్రముఖ కంపెనీ అయిన ఏలియంట్ గ్రూప్ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. తన అమెరికా పర్యటనలో భాగంగా హూస్టన్‌లోని ఏలియంట్ గ్రూప్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. కంపెనీ సీఈవో ధావళ్ జాదవ్‌తో తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు.

బీఎఫ్ఎస్ఐ సెక్టార్‌లోని కన్సల్టింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్‌లో దిగ్గజ కంపెనీ అయిన ఏలియంట్ గ్రూప్.. హైదరాబాద్‌లో 9,000 కొత్త ఉద్యోగాలను కల్పించనున్నది. ఇది తెలంగాణ బీఎఫ్ఎస్ఐ సెక్టార్‌కే కాకుండా ఇండియాకు కూడా ఊతమివ్వనున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. అంతకు ముందు హూస్టన్‌లోని ఏలియంట్ గ్రూప్‌ ప్రధాన కార్యాలయానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌కు అక్కడి ఉద్యోగులు, యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. తనకు ఇచ్చిన గ్రాండ్ వెల్కమ్‌కు మంత్రి కేటీఆర్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

టాక్స్, అకౌంటింగ్, ఆడిట్, కోర్ ఐటీ టెక్నాలజీస్‌లో యువతకు ఏలియంట్ గ్రూప్ ద్వారా మరిన్ని అవకాశాలు వస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది బీఎఫ్ఎస్ఐ రంగానికి మరింత విశ్వాసాన్ని కలిగించే అంశమని ఆయన చెప్పారు. హైదరాబాద్‌కు ఏలియంట్ గ్రూప్ రావడం చాలా గర్వకారణమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.



First Published:  20 May 2023 4:03 AM GMT
Next Story