Telugu Global
Telangana

ఖరీఫ్ సీజన్ : ఇప్పటి వరకు 8.93లక్షల టన్నుల వడ్లు సేకరించిన తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్రంలో వానాకాలం సీజన్ వరి ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల నుండి ఇప్పటి వరకు 8.93లక్షల టన్నులు సేకరించింది. మిగతా ధాన్యాన్ని వేగంగా సేకరించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

ఖరీఫ్ సీజన్ : ఇప్పటి వరకు 8.93లక్షల టన్నుల వడ్లు సేకరించిన తెలంగాణ ప్రభుత్వం
X

తెల‍ంగాణలో వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు సృష్టిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తోంది. వానాకాలం (ఖరీఫ్ సీజన్) పంటను ఇప్పటి వరకు 8.93 లక్షల టన్నులు సేకరించింది ప్రభుత్వం. గత ఏడాది ఇదే సమయంలో 8.1 లక్షల టన్నులు సేకరించింది.ఈ సారి గత సంవత్సరంకన్నా ఎక్కువగా ధాన్యం సేకరించింది తెలంగాణ ప్రభుత్వం.

మిగతా వరి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయడం కోసం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

అన్ని కొనుగోలు కేంద్రాల్లో లావాదేవీలు సజావుగా జరిగేలా తేమ యంత్రాలు, పాడి క్లీనర్లు, గోనె సంచులు తదితర అన్ని ఏర్పాట్లు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.

ఇప్పటి వరకు సేకరించిన వరి ధాన్యాన్ని నిల్వ చేసేందుకు దాదాపు 2.23 కోట్ల గన్నీ బ్యాగులను వినియోగించారు.ఈ సీజన్‌లో ఉత్పత్తి అయ్యే మొత్తం వరిని నవంబర్, డిసెంబర్ కల్లా పూర్తిగా కొనుగోలు చేస్తారు.

ఇంకా, త్వరితగతిన కొనుగోళ్లు జరిగేలా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సగటు నాణ్యతతో కూడిన వరి ధాన్యాన్ని తీసుకురావాలని మంత్రి రైతులకు సూచించారు. ఎ గ్రేడ్ వరి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.2,060, సాధారణ గ్రేడ్ వరి క్వింటాల్‌కు రూ.2,040 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.

దాదాపు 4,579 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, వరి కోతలు పెరిగే కొద్దీ మరిన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నామని గంగుల కమలాకర్ చెప్పారు.

First Published:  16 Nov 2022 3:19 AM GMT
Next Story