Telugu Global
Telangana

మునుగోడు బరిలో 83 మంది.. కోమటిరెడ్డి, పాల్వాయి ఇంటి పేరుతో ఐదుగురు

భూములు కోల్పోయిన బాధితులు, ఇతర సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవాలనుకుంటున్న చాలా మంది తమ నిరసనలో భాగంగా నామినేషన్లు వేసినట్లు తెలుస్తున్నది.

మునుగోడు బరిలో 83 మంది.. కోమటిరెడ్డి, పాల్వాయి ఇంటి పేరుతో ఐదుగురు
X

మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన శనివారంతో ముగిసింది. ఉపఎన్నిక కోసం 130 మంది నామినేషన్లు వేయగా.. అందులో 83 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి గుర్తించారు. భారీగా నామినేషన్లు రావడంతో శనివారం పొద్దు పోయే వరకు వాటిని పరిశీలిస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వంటి ప్రధాన పార్టీలతో పాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. బీఎస్పీ, ఆప్ వంటి పార్టీలు కూడా నామినేషన్లు వేశాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బరిలోకి దిగాలని భావిస్తున్న ఆప్ కూడా మునుగోడులో నామినేషన్ వేయడం గమనార్హం.

భూములు కోల్పోయిన బాధితులు, ఇతర సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవాలనుకుంటున్న చాలా మంది తమ నిరసనలో భాగంగా నామినేషన్లు వేసినట్లు తెలుస్తున్నది. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అదే ఇంటి పేరుతో ఉన్న వ్యక్తులు నామినేషన్లు వేయడం ఇబ్బందికరంగా మారింది. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉండగా.. అదే ఇంటి పేరు కలిగిన కోమటిరెడ్డి సాయి తేజ రెడ్డి కూడా నామినేషన్ వేయడం గమనార్హం. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన యువ డాక్టర్ సాయితేజ రెడ్డి చివరి రోజు నామినేషన్ వేశాడు.

ఇక మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కుంటున్న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి కూడా ఈ బెడద తప్పలేదు. పాల్వాయి ఇంటి పేరు కలిగిన మరో ఇద్దరు కూడా నామినేషన్లు వేశారు. పాల్వాయి లక్ష్మీ నారాయణ, పాల్వాయి వేణు అనే వ్యక్తులు నామినేషన్ వేశారు. ప్రధాన పార్టీల్లో కేవలం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మాత్రమే ఇలా ఒకే ఇంటి పేరు ఉన్న అభ్యర్థి నామినేషన్ వేయలేదు. ఆయనకు మాత్రం ఈ ఇబ్బంది తప్పింది. కాగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు దూరపు చుట్టమని కోమటిరెడ్డి సాయి తేజ రెడ్డి చెబుతున్నాడు. తాను గెలుస్తాననే నమ్మకం లేదు. కానీ, తాను చెప్పదలచుకున్న విషయాలు సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లాలనే ఈ నామినేషన్ వేశానని సాయితేజ రెడ్డి అంటున్నాడు.

పాల్వాయి వేణు సూర్యపేట జిల్లాకు చెందిన వ్యక్తి. నామినేషన్‌లో ఆయన సోషల్ వర్కర్‌గా పేర్కొన్నారు. కాగా, ఆయనను సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా నామినేట్ చేసింది. అంటే వేణు స్వతంత్ర అభ్యర్థిగా కాకుండా ఓ పార్టీ తరపున బరిలో ఉన్నారు. ఇక పాల్వాయి లక్ష్మీనారాయణది ములుగు జిల్లా. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ తరపున నామినేషన్ వేశారు. మొత్తానికి కోమటిరెడ్డి, పాల్వాయి ఇంటి పేర్లతో మొత్తం ఐదుగురు బరిలో ఉన్నారు. ప్రధాన అభ్యర్థులు కాకుండా.. ఇద్దరు పాల్వాయిలు, ఒక కోమటిరెడ్డి చివరి వరకు బరిలో ఉంటారా లేదా అనేది నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన సోమవారం తేలుతుంది.

First Published:  16 Oct 2022 3:25 AM GMT
Next Story