Telugu Global
Telangana

తెలంగాణలో అవయవదాతల్లో 80 శాతం మహిళలే

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నాళ్ల నుంచో 'జీవన్‌దాన్' పేరుతో అవయవ మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ సంస్థ డేటా విశ్లేషణలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

తెలంగాణలో అవయవదాతల్లో 80 శాతం మహిళలే
X

వాతావరణంలో వస్తున్న మార్పులు, ఆహారపు అలవాట్లు, చెడు వ్యసనాల కారణంగా ప్రతీ ఏటా ఎంతో మంది తీవ్రమైన రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా లివర్, కిడ్నీలు చెడిపోయి, మెడిసిన్స్‌కు కూడా బాగుకాని స్థితికి చేరుకుంటున్నారు. ఇలాంటి వారికి అవయవ మార్పిడి చేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నాళ్ల నుంచో 'జీవన్‌దాన్' పేరుతో అవయవ మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ సంస్థ డేటా విశ్లేషణలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

రాష్ట్రంలో కిడ్నీ, లివర్ దాతల్లో 87 శాతం మంది మహిళలే ఉంటున్నట్లు గ్లోబల్ హాస్పిటల్ అంచనా వేసింది. సామాజిక, శారీరక కారణాలతో మహిళలే ఎక్కువగా దాతలుగా ఉంటున్నారని సదరు హాస్పిటల్ చెబుతోంది. ఆర్గాన్స్ డొనేట్ చేయమని మహిళలపై ఒత్తిడి కూడా పెరుగుతోందని ఓ నివేదికలో తేల్చింది. జీవన్‌దాన్ ద్వారా గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో వెయిటింగ్‌లో ఉన్న, అవయవాలు పొందిన వారి లిస్టును పరిశీలించగా.. 80 శాతం మంది మహిళలు అవయవ దానం చేసినట్లు స్పష్టమైందని జీవన్‌దాన్ ప్రోగ్రామ్ ఇంచార్జి డాక్టర్ స్వర్ణలత తెలిపారు. అదే సమయంలో కేవలం 20 శాతం మంది మహిళలు మాత్రమే అవయవాలను పొందారని స్పష్టం చేశారు.

ఏదైనా కుటుంబంలోని పురుషుడికి అవయవం కావల్సి వస్తే.. కచ్చితంగా ఆ ఇంటి ఆడవాళ్లపైనే ఒత్తిడి ఉంటోందని అన్నారు. పురుషుడికి అవసరమైతే మహిళల చేత బలవంతంగా అవయవదానం చేయిస్తున్నట్లు సదరు డాక్టర్ పేర్కొన్నారు. అదే మహిళలకు అవయవం అవసరం అయితే కుటుంబంలోని మగవాళ్లు ముందుకు రావడం లేదని చెప్పారు. చాలా కుటుంబాల్లో పురుషులే సంపాదిస్తున్నారు. అలాంటి వాళ్లు అవయవాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని ఆమె అన్నారు.

రాష్ట్రంలో నమోదవుతున్న అవయవదానం కేసుల్లో 20 శాతం భార్యల చేత బలవంతంగా అవయవదానం చేయిస్తున్నట్లు తేలిందన్నారు. భార్య అవయవం ఇవ్వడానికి సుముఖంగా లేనప్పుడు కౌన్సెలింగ్ చేస్తున్నామని, సదరు మహిళ అవయవం ఇవ్వడానికి మెడికల్‌గా ఫిట్ లేదని చెప్పి తప్పిస్తున్నట్లు ఆమె వివరించారు. స్వచ్ఛందంగా వచ్చే మహిళల వద్ద నుంచి మాత్రమే అవయవాలు తీసుకుంటున్నామని.. ఒత్తిడిలో దానం చేయవద్దని ముందు చెప్తున్నామని ఆమె అన్నారు.

అవయవ మార్పిడికి మహిళల శరీరాలు అంత అనుకూలమైనవి కావని డాక్టర్ స్వర్ణలత చెప్పారు. ఆడవాళ్ల శరీరం ఎంతో కాంప్లికేటెడ్ అని.. పెగ్రెన్సీ వల్ల ఎన్నో మార్పులకు గురవుతుందని.. అందుకే మహిళలు ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్‌కు దూరంగా ఉండటమే మేలని అన్నారు. ఇక ఆర్గాన్ డోనేషన్‌లో భావోద్వేగాలు కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయని గ్లోబల్ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ చందన్ కుమార్ అన్నారు. ఆయన పలు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలకు ముఖ్య భూమిక పోషించారు.

మగవాళ్లు సంపాదిస్తారేమో కానీ కుటుంబాన్ని నడపడంలో ముఖ్యమైన పాత్ర స్త్రీలదే అన్నారు. ఎలాంటి త్యాగానికైనా వాళ్లు సిద్దంగా ఉంటారు. అంతే కాకుండా వారికి ధైర్యం కూడా ఎక్కువ. మగవాళ్ల కంటే ఎక్కువ భావోద్వేగాలు కలిగి ఉండటం వల్లే స్త్రీలు అవయవదానం చేయడానికి ఎక్కువగా ముందుకు వస్తున్నట్లు డాక్టర్ చందన్ కుమార్ చెప్పారు.

Next Story