Telugu Global
Telangana

హైదరాబాద్ టు విజయవాడ.. ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు రెడీ..

ఒలెక్ట్రా సంస్థ తయారు చేసిన వాహనాల్లో ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకబిగిన 325 కిలోమీటర్లు వెళ్లగలిగే బస్సులు కూడా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఇంటర్ సిటీ సర్వీసుల కింద ఈ బస్సుల్ని నడపబోతున్నారు.

హైదరాబాద్ టు విజయవాడ.. ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు రెడీ..
X

మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ లిమిటెడ్‌.. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో దూసుకెళ్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల విభాగంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి భారీ ఆర్డర్‌ దక్కించుకుంది. 550 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరాకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నుంచి ఒలెక్ట్రా సంస్థకు ఆర్డర్‌ లభించింది. దక్షిణాది నుంచి ఇంత భారీ స్థాయిలో ఒలెక్ట్రాకు ఆర్డర్‌ దక్కడం ఇదే తొలిసారి అని ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

500 లో ఫ్లోర్ బస్సులు, 50 స్టాండర్డ్ ఫ్లోర్ బస్సులను త్వరలో TSRTCకి ఒలెక్ట్రా సంస్థ సరఫరా చేస్తుంది. వీటిలో 50 బస్సులను విజయవాడకు ఇంటర్ సిటీ సర్వీసుల పేరుతో నడపాలని భావిస్తోంది TSRTC. దశలవారీగా వీటిని ఆ సంస్థ అందిస్తుంది. వీటి వల్ల హైదరాబాద్‌ లో వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం సైతం భారీగా తగ్గుతుందని అంచనా.

సింగిల్ చార్జ్ తో 325 కిలోమీటర్లు..

ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో చార్జింగ్ పెద్ద సమస్య. సింగిల్ చార్జింగ్ తో ఎక్కువ దూరం వెళ్లగలిగే వాహనాలకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఒలెక్ట్రా సంస్థ తయారు చేసిన వాహనాల్లో ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకబిగిన 325 కిలోమీటర్లు వెళ్లగలిగే బస్సులు కూడా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఇంటర్ సిటీ సర్వీసుల కింద ఈ బస్సుల్ని నడపబోతున్నారు. ఈ ఏసీ బస్సులు ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే 325 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.

హైదరాబాద్ లో నడిపే బస్సులు ఒక్కసారి చార్జింగ్ పూర్తయితే 225 కిలోమీటర్లు నడుస్తాయి. వీటిని ఇంట్రా సిటీ పేరుతో సిటీ బస్సులుగా నడుపుతారు. ప్రస్తుతం ఒలెక్ట్రా గ్రీన్‌ కు చెందిన 40 బస్సులు వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్ కి వెళ్తున్నాయి. వీటిని కూడా TSRTC నడుపుతోంది. రాబోయే రెండేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 3400 ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అధికారులు. 2025 నాటికి హైదరాబాద్‌ నగరమంతా విద్యుత్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు TSRTC ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. బస్సులే కాదు ఒలెక్ట్రా సంస్థ ఎలక్ట్రిక్ ట్రక్కులు, టిప్పర్ల తయారీలో కూడా ముందుంది.

First Published:  6 March 2023 4:16 PM GMT
Next Story