Telugu Global
Telangana

ఒకే ఇంటి నంబర్‌పై 5,024 ఓట్లు.. కలెక్టర్ విచారణలో ఏం తేలిందంటే..

హఫీజ్‌పేటలోని ఒక ఇంటి నంబర్‌పై 5,156 మంది ఓటర్లు ఉన్నారన్న ఫిర్యాదుపై కూడా విచారణ చేపట్టారు.

ఒకే ఇంటి నంబర్‌పై 5,024 ఓట్లు.. కలెక్టర్ విచారణలో ఏం తేలిందంటే..
X

1-10 అనే నంబర్‌పై పదుల సంఖ్యలో ఇళ్లు.. ఒకే నంబర్ మీద 5,024 మంది ఓటర్లు.. ఎన్నికల కమిషన్ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపగా తెలిసిన విచిత్రమైన విషయాలు. ఇది జీహెచ్ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బయటపడిన నిజాలు. కొన్నాళ్ల క్రితం ఒక జాతీయ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని.. నాలుగైదు ఇంటి నంబర్లలో ఏకంగా 2.80 లక్షల మంది ఓటర్లు ఉన్నారని ఆరోపించింది. ఈ విషయం ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేసింది.

భారీగా ఓటర్లు ఉండటంపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ హరీశ్‌ను వివరణ కోరింది. వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆగమేఘాల మీద క్షేత్ర స్థాయిలో పరిశీలిన జరపగా పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్లు పేర్కొన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామ పంచాయతీలు జీహెచ్ఎంసీలో కలవక ముందు.. ఆయా పంచాయతీల పరిధిలోని ఇళ్లకు స్థానిక అధికారులు ఇంటి నంబర్లు కేటాయించారు. చందానగర్‌ పంచాయతీ పరిధిలో 1 నుంచి ఇంటి నంబర్లు కేటాయించగా.. నల్లగండ్ల, నానక్‌రామ్‌గూడలో కూడా అక్కడి పంచాయతీ అధికారులు 1 నుంచి నంబర్లు కేటాయించారు. అంటే చందానగర్‌లో 1-10 అనే ఇల్లు ఉంటే.. నానక్‌రామ్‌గూడ, నల్లగండ్లలో కూడా 1-10 అనే పంచాయతీ నంబర్లు ఉన్నాయి. వాస్తవానికి ఈ ప్రాంతాలన్నీ జీహెచ్ఎంసీలో విలీనం అయ్యాక కొత్తగా నంబర్లు కేటాయించాల్సి ఉన్నది. కానీ ఏళ్లు గడుస్తున్నా పాత పంచాయతీ నంబర్లే కొనసాగుతున్నాయి.

ఇపుడు ఈ ప్రాంతాలన్నీ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. ఓటరు కార్డుపై 1-10 అనే నంబరు గల ఇళ్లు నాలుగైదు.. అలాగే ఇతర నంబర్లు గల ఇళ్లు రెండు మూడు కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే ఓటరు జాబితాలో ఇంటి నంబర్లుగా ఉండటంతో సదరు రాజకీయ పార్టీ ఫేక్ ఓటర్లుగా అనుమానించి ఫిర్యాదు చేసినట్లు గుర్తించారు. హఫీజ్‌పేటలోని ఒక ఇంటి నంబర్‌పై 5,156 మంది ఓటర్లు ఉన్నారన్న ఫిర్యాదుపై కూడా విచారణ చేపట్టారు. ఇక్కడ ఆ నంబర్‌పై ఏకంగా 5,024 మంది ఓటర్లు ఉన్నారని.. వారందరూ నిజమైన ఓటర్లే అని తేల్చారు. కొంత మంది అక్కడి నుంచి వేరే చోటికి వెళ్లడంతో ఈ 5,024 మంది మిగిలినట్లు ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.

శేరిలింగంపల్లి పరిధిలో మూడు దశల్లో ఓటర్ల గుర్తింపును పరిశీలించినట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ చెప్పారు. చిరునామా మారిన వాళ్లు తప్ప అందరూ నిజమైన ఓటర్లే అని.. ప్రస్తుతం అక్కడ వాళ్లు నివాసం ఉంటున్నట్లు గుర్తించామని అన్నారు. ఒకటే నంబర్‌పై ఇళ్లు ఉన్నాయని.. జీహెచ్ఎంసీ కొత్త నంబర్లు కేటాయించక పోవడం వల్ల వచ్చిన గందరగోళమే ఇదని స్పష్టం చేశారు. ఈ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించారు. దీంతో శేరిలింగంపల్లి ఓటర్ల జాబితాపై ఉన్న కన్ఫ్యూజన్‌కు చెక్ పెట్టినట్లు అయ్యింది.

First Published:  28 Sep 2023 2:08 AM GMT
Next Story