Telugu Global
Telangana

తెలంగాణ మారుమూల గ్రామాల వికాసానికి త్వరలో 4 జీ సర్వీసులు

దేశంలోని మారు మూల గ్రామాల్లో ఇప్పటికీ సరైన మొబైల్ సౌకర్యంలేక విద్యా, వైద్యం తదితర సేవలు ఆ గ్రామాల ప్రజలకు అందడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని 425 గ్రామాలకు 4జి మొబైల్ సర్వీసుల సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది.

తెలంగాణ మారుమూల గ్రామాల వికాసానికి త్వరలో 4 జీ సర్వీసులు
X

తెలంగాణాలో సరైన విద్య, వైద్య సౌకర్యాలు లేక వెనుకబడిన గ్రామాల వికాసానికి ప్రభుత్వం నడుం బిగించింది. దీనిపై దృష్టి పెట్టిన అధికారులు వీటికి 4 జీ మొబైల్ సర్వీసుల సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించారు.ఇందులో భాగంగా తెలంగాణాలో సుమారు 425 గ్రామాలను గుర్తించారు. ముఖ్యంగా ఇప్పటివరకు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని అనేక గ్రామాలకు ఈ సౌకర్యం లేదు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని గ్రామాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వీటిలో అనేక గ్రామాలు మారుమూల అటవీ ప్రాంతాల పరిధిలో ఉండడంతో 4 జీ మొబైల్ నెట్ వర్క్ ఫెసిలిటీ కల్పించడం కష్టతరమైంది. పాత ఆదిలాబాద్ జిల్లాతో బాటు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కొన్ని గ్రామాలు అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి.. మరీ మారుమూలల్లో ఉన్న వీటికి ఈ సౌకర్యం కల్పించడం తలకు మించిన పని అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

ఏది ఏమైనా.. లక్ష్య సాధనకు కృషి చేయాల్సిందేనన్నారు. 4 జీ సర్వీసుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యం లోని టెలికాం ఆపరేటర్.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కి 26 వేల కోట్లను కేటాయించారు. ఈ అంచనా వ్యయంతో ఈ సంస్థ పనులను చేపట్టాల్సి ఉంది. మొదట 4 జీ సర్వీసులు లేని పల్లెలు, గ్రామాల్లో టవర్లను ఏర్పాటు చేయడానికి అనువైన లొకేషన్లను గుర్తించడం ముఖ్యం.. ఇందుకు ఐటీ విభాగంతో కలిసి గిరిజన, అటవీ శాఖ అధికారులతో ఓ కమిటీ ఏర్పాటైంది. ఆయా లొకేషన్లను గుర్తించడానికి, పనులు మొదలు పెట్టేందుకు ఈ కమిటీకి సుమారు ఆరు నెలలు పడుతుందని ఓ అధికారి తెలిపారు. దేశంలోని సుమారు 29,616 గ్రామాలకు 4 జీ సర్వీసుల విస్తరణకు గాను ఓ ప్రాజెక్టును కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలెక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ఆమోదించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇందులో తెలంగాణలోని 425 గ్రామాలున్నట్టు తెలిపారు.

రాష్ట్రంలోని వెనుకబడిన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 4 జీ సర్వీసుల సదుపాయం ఎంతయినా అవసరం. ప్రభుత్వ విద్యా సంస్థలు, హెల్త్ కేర్ ..ఇలా వివిధ రంగాల్లో ప్రజలు ఈ సౌకర్యానికి నోచుకోలేకపోతున్నారని ఆ అధికారి చెప్పారు. అడ్వాన్స్డ్ మొబైల్ సర్వీస్ నెట్ వర్క్ కింద వీరికి ఇవి అవసరమని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ గ్రామీణులకు విద్య, వైద్య సౌకర్యాలు లేవని ఆయన అన్నారు. దీనికి సంబంధించి తాము డేటా సేకరించామని చెప్పారు. తెలంగాణలోని 25 జిల్లాల్లో హైస్పీడ్ 4 జీ సర్వీసులను లాంచ్ చేస్తున్నట్టు 'టెల్కో' లోగడ ప్రకటించింది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, మంచిర్యాల, పెద్దపల్లి, వైరా, కొత్తగూడెం, భువనగిరి, నాగార్జునసాగర్ తదితర జిల్లాలు వీటిలో ఉన్నాయి. తెలంగాణ లోని 409 సైట్స్ కి గాను 219 సైట్స్ కి బీఎస్ఎన్ఎల్... 4 జీ సర్వీసులను అందజేస్తున్నట్టు తెలుస్తోంది.

First Published:  29 July 2022 4:16 AM GMT
Next Story