Telugu Global
Telangana

జీహెచ్ఎంసీ పరిధిలో చెరువుల పునరుద్దరణకు రూ.345 కోట్లు

జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనేక చెరువులు 2014కు ముందే కబ్జాలకు గురయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇలాంటి వాటిని కబ్జా కోరల నుంచి విముక్తి చేసి, వాటిని పునరుద్దరించడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి చెప్పారు.

జీహెచ్ఎంసీ పరిధిలో చెరువుల పునరుద్దరణకు రూ.345 కోట్లు
X

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల రక్షణ, పునరుద్దరణకు రూ.345 కోట్లను ఖర్చు చేయనున్నారు. హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల అనేక చెరువులు, కుంటలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు కబ్జాకు గురి కావడం లేదా మురికి కూపాలుగా మారడంతో అవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెరువుల దినోత్సవం నిర్వహించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న చెరువులకు తిరిగి పూర్వ వైభవం తీసుకొని రావాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.

జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనేక చెరువులు 2014కు ముందే కబ్జాలకు గురయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇలాంటి వాటిని కబ్జా కోరల నుంచి విముక్తి చేసి, వాటిని పునరుద్దరించడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి చెప్పారు. గ్రేటర్ పరిధిలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు 185 చెరువుల బాధ్యతలను తీసుకున్నాయి. ఆయా చెరువులను రక్షించి, అవసరమైన దగ్గర పునరుద్దరణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 46,623 చెరువులు ఉన్నాయని.. అయితే నీటి కొరత కారణంగా అనేక చెరువులు, కుంటలు మాయమైనట్లు చెప్పారు. కృష్ణా, గోదావరి నీటితో చాలా చెరువులను నింపి.. వాటికి పూర్వ కళను తీసుకొని వచ్చామని.. కొన్ని చోట్ల మత్స్యసంపదను పెంచే కార్యక్రమాలు కూడా చేపట్టినట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులను రక్షించేందుకు గాను.. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. సీసీ రోడ్ల నిర్మాణం, పార్కులు, వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్స్, ఎల్ఈడీ లైట్లు, పోలీస్ ఔట్ పోస్టులు, ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇందుకోసం రూ.345 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

హైదరాబాద్ పరిధిలోని శ్రీకరికుంట, వట్టికుంట, కొత్తకుంట, బత్తుర్‌కుంట చెరువులను యుద్ద ప్రాతిపతికన పునరుద్దరించాలని నిర్ణయించినట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్పారు. ఇప్పటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టినట్లు ఆమె చెప్పారు. 36 చెరువులు, కంపెనీలను సీఎస్ఆర్ కింద పునరుద్దరిస్తామని కొన్ని నిర్మాణ సంస్థలు బాధ్యతలు తీసుకున్నట్లు చెప్పారు. ఆయా చెరువుల వద్ద స్లూయిస్ డ్యామ్ నిర్మాణం, సీవేజ్ మళ్లింపు, చెరువు శుద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. లోతట్టు ప్రాంతాలు వరదలకు ముంపునకు గురి కాకుండా చర్యలు తీసుకుంటారు.

ఆయా చెరువుల వద్ద పునరుద్దరణ కార్యక్రమాలు పూర్తి అయితే.. భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని మేయర్ పేర్కొన్నారు. ఈ 36 చెరువుల పునరుద్దరణ తర్వాత.. 144 చెరువులను రెండో దశలో చేపడతామని.. ఒక ఏడాదిలోనే అన్ని చెరువుల పునరుద్దరణ పూర్తవుతుందని ఆమె పేర్కొన్నారు.

First Published:  10 Jun 2023 3:08 AM GMT
Next Story