Telugu Global
Telangana

శిశు సంరక్షణకు రూ.10 కోట్ల బడ్జెట్‌తో 33 అత్యాధునిక అంబులెన్సులు

నీలోఫర్‌లో ఉండే సెంటర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా నవజాత శిశువులకు చికిత్స అందించనున్నట్లు చెప్పారు.

శిశు సంరక్షణకు రూ.10 కోట్ల బడ్జెట్‌తో 33 అత్యాధునిక అంబులెన్సులు
X

తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఈ క్రమంలోనే శిశు సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో నియోనాటల్ పేరిట జిల్లాకొక అంబులెన్స్ చొప్పున.. 33 అత్యాధునిక అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. హైదరాబాద్‌లోని నీలోఫర్ పిల్లల ఆసుపత్రిలో 'నీలోఫర్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్' ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..

శిశు మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతోనే నీలోఫర్‌లో ఈ సెంటర్ ప్రారంభించినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నవజాత శిశువుల ఇన్‌టెన్సీవ్ కేర్ యూనిట్ల (ఎస్ఎన్ఐసీయూ)తో ఈ సెంటర్‌ను అనుసంధానం చేసినట్లు మంత్రి తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో జన్మించిన శిశువులకు అత్యవసర పరిస్థితి తలెత్తితే హైదరాబాద్ తరలించేలోపు చనిపోతున్నారు. ఇకపై అలా జరగకుండా ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పని చేయనున్నదని మంత్రి వెల్లడించారు.

నీలోఫర్‌లో ఉండే సెంటర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా నవజాత శిశువులకు చికిత్స అందించనున్నట్లు చెప్పారు. అంతే కాకుండా నవజాత శిశువులకు సంబంధించిన చికిత్స కోసం ఇక్కడ ప్రత్యేక శిక్షణ, అవగాహన కార్యక్రమాలు రూపొందిస్తారని మంత్రి పేర్కొన్నారు. నీలోఫర్‌లో చిన్న పిల్లల గుండె శస్త్ర చికిత్సలకు ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు.

సంక్లిష్టమైన డెలివరీల కోసం గాంధీ, నిమ్స్, అల్వాల్ టిమ్స్‌లో 200 పడలక మాతా, శిశు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకొని వచ్చామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండ్ ఉషారాణితో పాటు ఇతర వైద్య బృందం పాల్గొన్నారు.


First Published:  25 Jun 2023 2:33 AM GMT
Next Story