Telugu Global
Telangana

3 పేజీలు - 30 ప్రశ్నలు.. మోదీకి తెలంగాణ నుంచి అల్టిమేట్టం

రేపు వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవం కోసం మోదీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో.. భట్టి విక్రమార్క లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

3 పేజీలు - 30 ప్రశ్నలు.. మోదీకి తెలంగాణ నుంచి అల్టిమేట్టం
X

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో టీ-కాంగ్రెస్ నుంచి ఓ బహిరంగ లేఖ విడుదలైంది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క 3 పేజీల ఈ లేఖలో ప్రధానికి 30 ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాకే ఆయన తెలంగాణ గడ్డపై అడుగు పెట్టాలన్నారు. ఎన్నికల ఏడాదిలో తెలంగాణకు వస్తున్న మోదీ.. అసలిప్పటి వరకూ రాష్ట్రానికి ఏం చేశారని నిలదీశారు భట్టి విక్రమార్క. రేపు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైల్‌ ప్రారంభోత్సవం కోసం మోదీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో.. భట్టి విక్రమార్క లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఆ 30 ప్రశ్నలు ఇవే..

1. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయించిన పథకాలు, ప్రాజెక్టుల వివరాలు చెప్పండి..?

2. విభజన చట్టంలోని హామీలలో ఇప్పటి వరకు ఎన్నింటిని నెరవేర్చారు..? దీనిపై కేంద్ర ప్రభుత్వానికి శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం ఉందా..?

3. గుజరాత్‌ లో రూ.20 వేల కోట్లతో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పట్ల ఎందుకు వివక్ష చూపుతోంది..?

4. బయ్యారంలో ఉక్కుకర్మాగారం పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు?

5. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన 450 కోట్ల రూపాయల బకాయిలు ఎప్పుడు విడుదలవుతాయి..?

6. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రంలోని ఒక్క సాగునీటి ప్రాజెక్టుకయినా జాతీయ హోదా ఇచ్చారా? పాలమూరు`రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు..? తెలంగాణ పట్ల ఎందుకంత వివక్ష..?

7. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారే కానీ, సీబీఐ ఎంక్వయిరీ ఎందుకు వేయలేదు..?

8. సహారా, ఈఎస్‌ఐ స్కామ్‌ లపై ఎందుకు విచారణ జరిపించడం లేదు? ఈ స్కామ్‌ లపై ఎందుకు మౌనం పాటిస్తున్నారు?

9. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త విద్యాసంస్థను ఎందుకు ఇవ్వలేదు. ఎన్ఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, నవోదయ.. విద్యాలయాల కేటాయింపుల్లో వివక్ష ఎందుకు..?

10. తెలంగాణ రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు ఎందుకు ఇవ్వడం లేదు? బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎందుకు ఇస్తున్నారు?

11. తెలంగాణ రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన నీటివాటా కేటాయింపుల విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు.

12. తెలంగాణ రాష్ట్రానికి చట్టబద్దంగా రావాల్సిన నిధులను కుంటి సాకులతో ఎందుకు నిలిపివేస్తున్నారు?

13. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు సంభవించినప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఈ 9 సంవత్సరాల కాలంలో ఎంత సహాయం అందించారు? తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించారు?

14. తెలంగాణకు కొత్త మెడికల్ కాలేజీలు కేంద్రం ఎందుకు ఇవ్వలేదు..?

15. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు?

16. తెలంగాణలో అనేక డిఫెన్స్‌ సంస్థలున్నాయి? డిఫెన్స్‌ కారిడార్‌ కేంద్ర ప్రభుత్వం ఎందుకు మంజూరు చేయడం లేదు?

17. నిజామాబాద్‌ పసుపు బోర్డు సంగతేంటి..?

18. ఢిల్లీ మద్యం కుంభకోణం దర్యాప్తులో ఎందుకు పురోగతి లేదు?

19. కర్నాటక ఎన్నికలు పూర్తయిన తరువాత పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచనని మీరు హామీ ఇవ్వగలరా?

20. 2014 ఎన్నికల సందర్భంగా ప్రతీ ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమచేస్తామని ఇచ్చిన హామీ ఏమైంది..?

21. 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీ ఎంతవరకు వచ్చింది..? ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు..?

22. మీకు, అదానీకి ఉన్న సంబంధం ఏంటో చెప్పండి..?

23. అదానీ పాల్పడ్డ కుంభకోణాల్లో మీ పాత్ర ఉందా? లేదా? ఈ కుంభకోణంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించడానికి మీరు ఎందుకు వెనుకాడుతున్నారు?

24. మీ విద్యార్హతల గురించి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు, తెలంగాణలో మీరు పాల్గొనే బహిరంగ సభలో మీ డిగ్రీ సర్టిఫికెట్ చూపించగలరా..?

25. 2014 లో మీరు అధికారం చేపట్టినప్పటినుంచి ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేశారు? ఎన్ని కొత్తగా ప్రారంభించారు?

26. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్‌ కు మంజూరైన ఐటిఐఆర్‌ (ఇంటిగ్రేటేడ్‌ ఇన్వెస్ట్ మెంట్‌ టెక్నాలజీ రీజియన్‌) ఎందుకు రద్దు చేశారు?

27. తెలంగాణ రాష్ట్రానికి సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్ లు ఎందుకు ఇవ్వడం లేదు?

28. తెలంగాణలో ఫార్మాసిటీలకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహాయం చేయడం లేదు?

29. ట్రెడిషనల్‌ మెడిసిన్‌ సెంటర్‌ ను హైదరాబాద్‌ నుంచి మీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌ కు ఎందుకు తరలించారు?

30. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఉన్న సంబంధం ఏంటి..? మీ కనుసన్నల్లోనే తెలంగాణలో పార్టీలు పనిచేస్తున్నాయనేది వాస్తవం కాదా..?

First Published:  7 April 2023 6:33 AM GMT
Next Story