Telugu Global
Telangana

పెండింగ్‌లో 19 స్థానాలు.. కాంగ్రెస్‌ థర్డ్‌ లిస్ట్‌పై ఉత్కంఠ..!

టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు రెబల్స్‌గా బరిలో ఉంటామని హెచ్చరించడంతో.. మూడో లిస్టు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది హస్తం పార్టీ.

పెండింగ్‌లో 19 స్థానాలు.. కాంగ్రెస్‌ థర్డ్‌ లిస్ట్‌పై ఉత్కంఠ..!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీకి.. మిగిలిన 19 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్యర్థుల ఎంపిక సవాల్‌గా మారింది. ఆయా స్థానాల్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువగా ఆశావహులు ఉండటమే ప్ర‌ధాన కారణం. ఇప్పటికే కాంగ్రెస్ సెకండ్‌ లిస్టు అగ్గి రాజేసింది. టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు రెబల్స్‌గా బరిలో ఉంటామని హెచ్చరించడంతో.. మూడో లిస్టు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది హస్తం పార్టీ.

మిగిలిన 19 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాలుగు స్థానాలను సీపీఎంకు రెండు, సీపీఐకి రెండు సీట్లు కేటాయించింది కాంగ్రెస్‌. మిగిలిన 15 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇక పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ స్థానాల జాబితాలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి, మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లతో పాటు మంత్రి జగదీశ్‌ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సూర్యాపేటతో పాటు తుంగతుర్తి, మిర్యాలగూడ, చెన్నూరు, కొత్తగూడెం, వైరా, చార్మినార్‌, స్పీకర్ పోచారం ప్రాతినిథ్యం వహిస్తున్న బాన్సువాడ, జుక్కల్, పఠాన్‌చెరు, ఇల్లందు, డోర్నకల్‌, సత్తుపల్లి, నారాయణ్‌ ఖేడ్‌, అశ్వారావుపేట ఉన్నాయి.

ఈ స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొనడంతో ఏఐసీసీ ఆయా స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేసింది. సూర్యాపేటలో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ వర్గానికి చెందిన మాజీ మంత్రి, సీనియ‌ర్ లీడ‌ర్‌ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన పటేల్ రమేష్‌ రెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒకవేళ సూర్యాపేట స్థానం పటేల్‌ రమేష్‌ రెడ్డికి ఇస్తే.. తుంగతుర్తి సీటును కేటాయించే విషయంలో దామోదర్‌ రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వాల్సి ఉంటుంది. తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్‌డ్‌. అందుకే తుంగతుర్తిని సైతం పెండింగ్‌లో ఉంచినట్లు సమాచారం. తుంగతుర్తి సీటు కోసం 23 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానంగా రేవంత్‌ వర్గానికి చెందిన అద్దంకి దయాకర్.. ఉత్తమ్‌, కోమటిరెడ్డి మద్దతున్న నగరిగారి ప్రీతమ్‌, పొంగులేటి వర్గానికి చెందిన పిడమర్తి రవి, వడ్డేపల్లి రవిల మధ్య పోటీ నెలకొంది.

ఇక పటాన్‌చెరు స్థానం కోసం కాటా శ్రీనివాస్‌ గౌడ్‌, ఇటీవల పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్‌ రేసులో ఉన్నారు. శ్రీనివాస్‌ గౌడ్‌కు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ మద్దతు ఉండగా.. నీలం మధుకు గెలిచే అవకాశాలున్నాయని పార్టీలోని ఓ వర్గం చెప్తోంది. ఇక సత్తుపల్లి ఎస్సీ రిజర్వ్‌డ్‌ సీటు కాగా.. మట్టా దయానంద్‌ లేదా ఆయన భార్య మట్టా రాగమయి టికెట్ రేసులో ఉన్నారు. ఇదే సీటు కోసం రేవంత్‌ వర్గానికి చెందిన మానవతా రాయ్‌, సుధాకర్‌, పొంగులేటి వర్గానికి చెందిన ఎస్‌.చంద్రశేఖర్‌ పోటీ పడుతున్నారు. ఇక కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్‌. సీపీఎంతో సీట్ల పంపకంపై చర్చలు ముగిశాక అధికారిక ప్రకటన వెలువడనుంది. మిర్యాలగూడ, వైరా సీట్లను సీపీఎం డిమాండ్ చేస్తోంది.

ఇక కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డిని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఉత్తమ్‌ లేదా కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి లేదా బలమైన నేతలను బరిలో దించాలని అదిష్టానం ఆలోచిస్తుంది. దీంతో ఈ రెండు స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక కామారెడ్డిలో రేవంత్ పోటీలో ఉంటే షబ్బీర్‌ అలీకి నిజామాబాద్ అర్బన్ సీటు ఇచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ రేవంత్ పోటీలో లేకుంటే కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ బరిలో ఉంటారు. అయితే కేసీఆర్‌, కేటీఆర్‌లపై బలమైన నేతలను పోటీలో ఉంచాలన్న ఆలోచనను విరమించుకోవాలని అధిష్టానాన్ని సీనియర్లు కోరుతున్నారు.

First Published:  30 Oct 2023 5:20 AM GMT
Next Story