Telugu Global
Telangana

బోధనాసుపత్రుల్లో 1,827 స్టాఫ్ నర్స్ పోస్టులు.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్దతిలో భర్తీ

రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది.

బోధనాసుపత్రుల్లో 1,827 స్టాఫ్ నర్స్ పోస్టులు.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్దతిలో భర్తీ
X

తెలంగాణలో త్వరలో సిద్ధం కానున్న 8 మెడికల్ కాలేజీల అనుబంధ ఆసుపత్రుల్లో కొత్తగా 1,827 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని టీచింగ్ హాస్పిటల్స్‌లో వీటిని భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఫైనాన్షియల్ అనుమతులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (టీఎస్ఎంహెచ్ఎస్ఆర్‌బీ) ఈ పోస్టుల కోసం అగస్టు 2న పరీక్ష నిర్వహించనున్నది. తాజాగా అనుమతి ఇచ్చిన 1,827 పోస్టులను విడిగా మరో నోటిఫికేషన్ వెలువడనున్నది. గతంలో వెలువడిన నోటిఫికేషన్‌లో 40,936 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి అగస్టు 2న ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో కూడా అత్యధిక పోస్టులు డీఎంఈ పరిధిలోనే ఉన్నాయి.

బోధనాసుపత్రుల్లో కొత్త పోస్టులు మంజూరు చేయడంపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నదని అన్నారు. పేదలకు స్పెషాలిటీ సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 5 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఇప్పుడు దాని సంఖ్య 26కు చేరిందని చెప్పారు. వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి హరీశ్ రావు అన్నారు.


First Published:  24 Jun 2023 1:34 AM GMT
Next Story