Telugu Global
Telangana

తొలిరోజే 182 ద‌ర‌ఖాస్తులు.. అప్లికేష‌న్ల పోటీలో కాంగ్రెస్‌తో సై అంటున్న బీజేపీ

బీజేపీకి 119 సీట్ల‌లో పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థులే లేర‌న్న‌ది ఆ పార్టీ నేత‌ల‌కు కూడా తెలిసిన వాస్త‌వం. అయినా అప్లికేష‌న్లు ఆహ్వానిస్తోంది. తొలిరోజే 182 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి.

తొలిరోజే 182 ద‌ర‌ఖాస్తులు.. అప్లికేష‌న్ల పోటీలో కాంగ్రెస్‌తో సై అంటున్న బీజేపీ
X

ఏ ఎన్నిక‌ల్లోనైనా త‌మ‌కు టికెటివ్వాల‌ని పార్టీకి అభ్య‌ర్థులు ద‌రఖాస్తు చేస్తారు. సాధార‌ణంగా రాజ‌కీయ పార్టీల్లో టికెట్ ఎవ‌రికో ముందే ఓ అవ‌గాహ‌న ఏర్ప‌డుతుంది. అంతే త‌ప్ప అప్లికేష‌న్స్‌లో నుంచి విద్యావంతుడ్ని, మంచివాడ్ని, ప్ర‌జ‌లకు మేలు చేసేవారిని ఎన్నుకుని పార్టీలు టికెట్లేమీ ఇవ్వ‌వు. గెలుపు గుర్రం ఎవ‌రో చూసి బీఫాం ఇస్తాయి. కానీ, ఈసారి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడా అభ్య‌ర్థుల ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌ను చాలా సీరియ‌స్‌గా తీసుకున్నాయి.

కాంగ్రెస్‌లో 1000కి పైగా అప్లికేష‌న్లు

కాంగ్రెస్ టికెట్ కావాలంటే అప్లికేష‌న్ పెట్టాల్సిందేన‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి స్ప‌ష్టం చేయ‌డంతో తొలుత సీనియ‌ర్లంతా భ‌గ్గుమ‌న్నారు. మేం కూడా అప్ల‌య్‌ చేయాలా అంటూ ఎక‌సెక్కాలాడారు. కానీ, చివ‌రికి అంద‌రూ అప్ల‌య్‌ చేశారు. 119 స్థానాల‌కు సుమారు 1025 అర్జీలొచ్చాయి. ఇందులో నుంచి ముందుగా నియోజ‌క‌వ‌ర్గానికి ముగ్గురి చొప్పున స్క్రీనింగ్ చేయ‌డానికే కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు త‌ల‌ప్రాణం తోక‌కు వ‌స్తోంది. త‌ర్వాత ఆ ముగ్గురిలో నుంచి ఒక క్యాండిడేట్‌ను సెలెక్ట్ చేయ‌డం మ‌రింత త‌ల‌నొప్పే.

బీజేపీ షురూ

బీజేపీకి 119 సీట్ల‌లో పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థులే లేర‌న్న‌ది ఆ పార్టీ నేత‌ల‌కు కూడా తెలిసిన వాస్త‌వం. అయినా అప్లికేష‌న్లు ఆహ్వానిస్తోంది. తొలిరోజే 182 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఎందుకైనా మంచిద‌ని ఒక్కొక్క‌రు రెండు, మూడు అప్లికేష‌న్లు ప‌డేస్తున్నారు. హైద‌రాబాద్‌లోని ఓ మ‌హిళా కార్పొరేట‌ర్ ఏకంగా నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల టికెట్ల కోసం అప్లికేష‌న్లు ఇచ్చారు. మ‌రోవైపు భ‌ద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా స‌త్య‌వ‌తి, ఎల్బీన‌గ‌ర్ టికెట్ కోసం సామ రంగారెడ్డి అప్ల‌య్‌ చేశారు. క‌రీంన‌గ‌ర్ జ‌డ్పీ మాజీ ఛైర్మ‌న్ తుల ఉమ కూడా అప్లికేష‌న్ పెట్టారు.

*

First Published:  5 Sep 2023 7:13 AM GMT
Next Story