Telugu Global
Telangana

బీజేపీని భయపెడుతున్న 17 మంది.. పార్టీకి భారీ నష్టమని అధిష్టానం ఆందోళన!

ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలో చాలా మంది అంతర్గత విషయంలను బయటకు చేరవేస్తున్నట్లు గుర్తించారు. అంతే కాకుండా ఎన్నికల సమయంలో వాళ్లు బయటకు జంప్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా అధిష్టానం భావిస్తున్నది.

బీజేపీని భయపెడుతున్న 17 మంది.. పార్టీకి భారీ నష్టమని అధిష్టానం ఆందోళన!
X

తెలంగాణ బీజేపీ విషయంలో అధిష్టానం ఆందోళన ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్న మొన్నటి వరకు గ్రూపు తగాదాలతో రాష్ట్ర నాయకులు మీడియా ముందు రచ్చ చేశారు. పాత, కొత్త నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం అధిష్టానానికి పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికీ ఆ సమస్య అలా కొనసాగుతుండగానే.. మరో పెద్ద షాక్ తగిలింది. ఇటీవల బీజేపీ అధిష్టానం చేయించిన అంతర్గత సర్వేలో.. 17 మంది నాయకులు పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేస్తున్నట్లు తెలిసింది.

బీజేపీకి తెలంగాణలో బలం అంతంత మాత్రమే. గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక సీటు గెలుచుకున్నది. హుజూరాబాద్, దుబ్బాకలో విజయాలు తమ బలం కాదని ఆ పార్టీకి కూడా తెలుసు. ఈ నేపథ్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపడతామని రాష్ట్ర నాయకులతో పాటు జాతీయ నాయకులు కూడా ప్రతీ మీటింగ్, మీడియా సమావేశాల్లో చెబుతున్నారు. పైకి గంభీరమైన వ్యాఖ్యలు చేస్తున్నా.. లోపల మాత్రం వారి భయం వారికి ఉన్నది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలో చాలా మంది అంతర్గత విషయంలను బయటకు చేరవేస్తున్నట్లు గుర్తించారు. అంతే కాకుండా ఎన్నికల సమయంలో వాళ్లు బయటకు జంప్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా అధిష్టానం భావిస్తున్నది.

తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన చాలా మందిని పార్టీలో చేర్చుకున్నారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కొందరు నాయకులు కర్ణాటక ఎన్నికల తర్వాత తిరిగి సొంత పార్టీలోకి వెళ్లిపోవాలని భావిస్తున్నారు. అంతే కాకుండా తమతో పాటు మరి కొంత మందిని తీసుకెళ్లే ఆలోచన కూడా చేస్తున్నారట. ఈ విషయం అధిష్టానానికి తెలియడంతో కాస్త సీరియస్ అయినట్లు సమాచారం. రాష్ట్ర నాయకత్వం అలాంటి వారి పట్ల ఉదాసీన వైఖరి ప్రదర్శించడం కూడా అధిష్టానం ఆగ్రహానికి కారణం అయ్యింది.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఎవరైతే తరచూ విమర్శిస్తూ.. విభేదిస్తున్నారో.. వాళ్లే పార్టీలో కోవర్టులుగా మారారని అధిష్టానం గుర్తించినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఆ 17 మంది లిస్టును రాష్ట్ర పార్టీలోని ఇద్దరు కీలక నేతలకు పంపినట్లు సమాచారం. ఆ 17 మందిని ఇకపై పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములు చేయవద్దని, కీలకమైన సమాచారం కూడా పంచుకోవద్దని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం.

ఆ 17 మందిలో మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నేతలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఇకపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని దూరం పెట్టడమే మంచిదని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి వారి వల్ల పార్టీకి భారీగా నష్టం కలుగవచ్చని అంచనా వేసింది. అందుకే ప్రస్తుతానికి సస్పెన్షన్ వేటు వేయకపోయినా.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరం చేస్తూ నిర్ణయం తీసుకున్నది.

First Published:  7 Jun 2023 3:23 AM GMT
Next Story