Telugu Global
Telangana

పాతబస్తీలో దారుణం.. బాలికకు మద్యం తాగించి గ్యాంగ్ రేప్

మందులను కొనుగోలు చేసేందుకు దుకాణం వద్దకు వెళ్లిన 14 ఏళ్ళ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఈనెల 4వ‌ తేదీన జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పాతబస్తీలో దారుణం.. బాలికకు మద్యం తాగించి గ్యాంగ్ రేప్
X

హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో దారుణం జరిగింది. మందులను కొనుగోలు చేసేందుకు దుకాణం వద్దకు వెళ్లిన 14 ఏళ్ళ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఈనెల 4వ‌ తేదీన జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్ రేప్ చేసిన ముగ్గురు నిందితులతో పాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

పాతబస్తీకి చెందిన ఓ బాలిక ఈనెల 4వ‌ తేదీన మందుల కొనుగోలు కోసం తనకు తెలిసిన ఒక హోల్ సేల్ దుకాణం వద్దకు వెళ్ళింది. అయితే దుకాణం వద్ద ఉన్న ఓ మహిళ తన వెంట వస్తే తక్కువ రేటుకే మందులు ఇప్పిస్తానని నమ్మబలికింది. ఆమె ట్రాప్‌లో పడ్డ బాలిక స‌ద‌రు మహిళ వెంట వెళ్ళింది.

కందికల్‌లోని బోయిగూడలో ఉన్న ఓ ఇంటికి తీసుకెళ్లి గంజాయి మత్తులో ఉన్న‌ ముగ్గురు యువకులకు అప్పగించింది. వారు బాలికకు బలవంతంగా హుక్కా తాగించి.. ఆ తర్వాత కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఇచ్చారు. దీంతో ఆమె మెల్లగా మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత ఆ ముగ్గురు యువకులు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.

బాలిక కేకలు పెట్టగా.. బయటకి వినిపించకుండా గదిలో మ్యూజిక్ పెట్టి సౌండ్ పెంచారు. వారి నుంచి తప్పించుకునేందుకు బాలిక ప్రయత్నించగా వారు దాడి చేశారు. ఆ తర్వాత బాలిక మత్తులోకి జారిపోవడంతో ముగ్గురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహలోకి వచ్చిన తర్వాత బాలిక అక్కడి నుంచి బయటపడి ఇంటికి చేరుకుంది. జరిగిన ఘటనపై కుటుంబ సభ్యులతో కలిసి ఛత్రినాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

బాలిక చెప్పిన వివరాల మేరకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు నిందితుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో నిందితులు ఉన్నట్లు గుర్తించి, అక్కడికి చేరుకొని ముగ్గురి అరెస్ట్ చేశారు. అలాగే వారికి సహకరించిన మహిళ, మరో యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు ఛత్రినాక పోలీసులు తెలిపారు. అలాగే ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉందని వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

First Published:  8 Feb 2023 3:16 PM GMT
Next Story