Telugu Global
Telangana

ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణ కాంట్రాక్టుపై ఆసక్తి చూపిస్తున్న 13 కంపెనీలు!

జూలై 5న ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించగా.. తాజాగా ప్రి బిడ్డింగ్ మీటింగ్‌ను మెట్రో ఎండీ ఎన్వీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణ కాంట్రాక్టుపై ఆసక్తి చూపిస్తున్న 13 కంపెనీలు!
X

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులకు సంబంధించిన టెండర్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు నిర్మించనున్న 31 కిలోమీటర్ల పొడవైన ఈ మెట్రో కారిడార్‌కు రూ.5,688 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దీనికి సంబంధించిన పూర్తి వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనున్నది.

జూలై 5న ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించగా.. తాజాగా ప్రి బిడ్డింగ్ మీటింగ్‌ను మెట్రో ఎండీ ఎన్వీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాధాన్యత, ఎలాంటి సౌకర్యాలు ఉండాలనే విషయాలను బిడ్డర్లకు వివరించారు. ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్ నిర్మాణం పట్ల 13 కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎల్అండ్‌టీ, ఆస్టోమ్, టాటా ప్రాజెక్ట్స్, రైల్వే శాఖకు చెందిన ఐఆర్‌సీవోఎన్, నవరత్న కంపెనీ ఆర్‌వీఎన్ఎల్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన బీఈఎంఎల్, పాండ్రోల్ రహీ టెక్నాలజీస్‌తో పాటు మరి కొన్ని కంపెనీలు ఈ ప్రీ బిడ్ సమావేశంలో పాల్గొన్నాయి.

హెచ్ఏఎంఎల్ ప్రాజెక్ట్ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించారు. ఈపీసీ కాంట్రాక్టర్‌ను నియమించడానికి పూర్తి పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే 31 కిలోమీటర్ల మెట్రో కారిడార్ మార్గంలో ప్రిలిమినరీ పనులు పూర్తయ్యాయని చెప్పారు. సర్వే, పెగ్ మార్కింగ్, అలైన్‌మెంట్ ఫిక్సింగ్ పూర్తయ్యిందని.. సాయిల్ టెస్ట్ కూడా వేగవంతంగా చేస్తున్నట్లు రెడ్డి చెప్పారు.

రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఈ మెట్రో మార్గంలో 1.7 కిలో మీటర్లు అండర్ గ్రౌండ్‌లో ఉంటుందని.. మిగిలిన 29.3 కిలోమీటర్లు ఎలివేటెడ్ మెట్రో కారిడార్ ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. అలాగే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 1 వద్ద అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నిర్మిస్తామని అన్నారు. బిడ్లు గెలిచిన కాంట్రాక్టర్ సివిల్ స్ట్రక్చర్ నిర్మాణం, సిగ్నలింగ్, ట్రెయిన్ కంట్రోల్ సిస్టమ్ వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. సెప్టెంబర్ నెలలో ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులు ప్రారంభం కానున్నట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.

First Published:  15 Jun 2023 8:07 AM GMT
Next Story