Telugu Global
Telangana

21.35 లక్షల మంది రైతులకు రూ.11,812 కోట్ల రుణ మాఫీ

బ్యాంకు ఖాతాలో క్లోజ్ అవడం, ఇతర సాంకేతిక కారణాల వల్ల కొంత మంది రుణ మాఫీ నగదు బ్యాంకుల నుంచి తిరిగి వెనక్కు వచ్చినట్లు మంత్రి చెప్పారు.

21.35 లక్షల మంది రైతులకు రూ.11,812 కోట్ల రుణ మాఫీ
X

తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణ మాఫీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అర్హులైన రైతులందరికీ తప్పకుండా రుణాలు మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 21.35 రైతులకు చెందిన రూ.11,812 కోట్ల మేర రుణాలను మాఫీ చేసినట్లు ఆయన తెలిపారు. వానాకాలం పంటల పరిస్థితి, యాసంగు సాగుకు సన్నద్ధం, రుణమాఫీ అమలు, ఆయిల్ పామ్ సాగుపై బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..

బ్యాంకు ఖాతాలో క్లోజ్ అవడం, ఇతర సాంకేతిక కారణాల వల్ల కొంత మంది రుణ మాఫీ నగదు బ్యాంకుల నుంచి తిరిగి వెనక్కు వచ్చినట్లు మంత్రి చెప్పారు. ఆయా రైతులకు సంబంధించిన సమస్యలను త్వరలోనే పరిష్కరించి.. రుణమాఫీ చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. రుణమాఫీపై ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారులను సంప్రదించాలని రైతులకు సూచించారు. రాష్ట్ర స్థాయిలో ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని.. రైతులు ఆ నంబర్‌కు కాల్ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని మంత్రి చెప్పారు. రైతులు 040-23243667 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.

రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో దాదాపు 80 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. నిరుడు 74 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.. ఈ వానాకాలంలో ఇప్పటి వరకు 65 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ చరిత్రంలోనే ఇదొక రికార్డుగా మంత్రి చెప్పారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో గతంలో కంటే 24 వేల ఎకరాల్లో వరి సాగు జరుగుతోందని అన్నారు. ఇప్పటి వరకు 1.26 కోట్ల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగు అవుతున్నాయని.. మరో 12 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు, 1.93 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతున్నట్లు మంత్రి చెప్పారు. ఈ సారి కూడా అధిక దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేసినట్లు మంత్రి పేర్కొన్నారు.


First Published:  28 Sep 2023 1:35 AM GMT
Next Story