Telugu Global
Telangana

బాసర ట్రిపుల్ ఐటి లో 100 మందికి ఫుడ్ పాయిజనింగ్ .. ఆసుపత్రి పాలైన విద్యార్ధులు

నిర్మల్ జిల్లా బాసర లోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (ఆర్ జీయుకెటి)కి చెందిన సుమారు 100 మంది విద్యార్థులు శుక్రవారం ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు.

బాసర ట్రిపుల్ ఐటి లో 100 మందికి ఫుడ్ పాయిజనింగ్ .. ఆసుపత్రి పాలైన విద్యార్ధులు
X

నిర్మల్ జిల్లా బాసర లోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (ఆర్ జీయుకెటి)కి చెందిన సుమారు 100 మంది విద్యార్థులు శుక్రవారం ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. పీయూసీ-1, పీయూసీ-2 హాస్టళ్లలో మధ్యాహ్న భోజనం తర్వాత వాంతులు, విరేచ‌నాల‌తో విద్యార్థులు బాధ‌ప‌డ్డారు. వారిలో కొందరు స్పృహతప్పి పడిపోయారు. వెంట‌నే అధికారులు స్పందించి నిర్మ‌ల్‌, భైంసా నుంచి వైద్యుల‌ను పిలిపించి ప్రాథ‌మిక చికిత్స అందించారు. అప‌స్మార‌క స్థితిలోకి వెళ్ళిన విద్యార్ధుల‌ను మెరుగైన వైద్య చికిత్స కోసం నిజామాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించారు. వారి ప‌రిస్థితి నిల‌కడగానే ఉంద‌ని తెలిసింది.

ఇన్స్టిట్యూట్‌లోని మూడు మెస్‌లలో రెండింటిలో భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ప్ర‌తినిధి చెప్పారు. ఒక మెస్‌లో 3,000 మంది విద్యార్థులకు, మరో మెస్‌లో 2,500 మంది విద్యార్థులకు ఆహారాన్నిఅందిస్తారు. ఈ రెండింటినీ ఒకే కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నారని చెప్పారు. ఒకే చోట వండిన ఆహారాన్నేఈ రెండు హాస్టళ్లలో విద్యార్థులకు అందించార‌న్నారు. మధ్యాహ్న భోజనంలో ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌ అందించారు.

"మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, విద్యార్థులకు కడుపు నొప్పిగా అనిపించడం ప్రారంభమైంది. సాయంత్రానికి, చాలామందికి కళ్లు తిరగడం మొదలయ్యాయి. హాస్టల్‌ గదుల్లోనే విద్యార్థులు పెద్ద సంఖ్యలో వాంతులు, విరేచ‌నాల‌తో స్పృహతప్పి పడిపోయారు. కొంత‌మంది శ్వాస తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బందిప‌డ్డారు."అని స్టూడెంట్స్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ వరుస ట్వీట్లలో పేర్కొంది.

"వెంటనే, సీరియస్ అయిన విద్యార్థులందరినీ ఆసుపత్రిలో చేర్చారు. కొందరిని సమీపంలోని పీహెచ్‌సీకి పంపారు. నిరంత‌రం విద్యార్థుల ఆరోగ్య ప‌రిస్థితిని ప‌రిశీలిస్తూ చెకప్ చేసి మందులు అందిస్తున్నాము " అని విద్యార్థి కౌన్సిల్ తెలిపింది. ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమేమిటో ఇంకా తెలియరాలేదని కౌన్సిల్ పేర్కొంది.

విషయం తెలుసుకున్న అదే జిల్లాకు చెందిన అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఐఐఐటీ డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌తో మాట్లాడి అస్వ‌స్థ‌త‌కు గురైన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాల‌ని ఆదేశించారు. విద్యార్థులు చికిత్స పొంది కోలుకుంటున్నారని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీ ట్వీట్ చేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు.

"ఐఐఐటీ బాస‌ర విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారు, వారి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరిస్థితి అదుపులో ఉంది. 14 వైద్య‌, పారామెడికల్ బృందాలు సేవ‌లందిస్తున్నాయి.. నేను అక్క‌డే ఉండి పరిస్థితిని స్వ‌యంగా పర్యవేక్షిస్తున్నాను. మెరుగైన చికిత్స‌కు పంపిన 20 మంది విద్యార్ధుల ఆరోగ్యం కూడా నిల‌క‌డ‌గానే ఉంది." అని క‌లెక్ట‌ర్ చెప్పారు.

First Published:  16 July 2022 9:41 AM GMT
Next Story