Telugu Global
Telangana

తెలంగాణ మెడికల్ కాలేజీల్లో 100 శాతం కన్వీనర్ కోటా సీట్లు లోకల్.. 36 కాలేజీల్లో అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ ఎత్తివేత

తెలంగాణ ఏర్పడక మునుపు 20 కాలేజీలు, 2,850 మెడికల్ సీట్లు ఉండేవి. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 56 కాలేజీలు.. వీటిలో 8,340 సీట్లు ఉన్నాయి.

తెలంగాణ మెడికల్ కాలేజీల్లో 100 శాతం కన్వీనర్ కోటా సీట్లు లోకల్.. 36 కాలేజీల్లో అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ ఎత్తివేత
X

తెలంగాణ లోకల్ విద్యార్థులకు రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో సీట్లు పెరిగాయి. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి.. అంటే 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ (కన్వీనర్) కోటాలోని 100 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే ప్రభుత్వం రిజర్వ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా తెలంగాణ విద్యార్థులకు కన్వీనర్ కోటాలో అదనంగా 520 సీట్లు లభించనున్నాయి.

తెలంగాణ ఏర్పడక మునుపు 20 కాలేజీలు, 2,850 మెడికల్ సీట్లు ఉండేవి. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 56 కాలేజీలు.. వీటిలో 8,340 సీట్లు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 36 కొత్త కాలేజీలు వచ్చాయి. ఇప్పటి వరకు ఈ కాలేజీలన్నింటిలో 15 శాతం 'అన్ రిజర్వ్‌డ్' కేటగిరీ అమలు చేస్తున్నారు. వీటిలో ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పోటీ పడటానికి అనుమతి ఇచ్చారు. అయితే, ఇకపై కొత్తగా ఏర్పడిన 36 కాలేజీల్లో ఈ 15 శాతం అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీని ఎత్తి వేశారు. ఆ సీట్లన్నీ తెలంగాణ లోకల్ విద్యార్థులకే దక్కనున్నాయి.

ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలతో సహా పాత 20 కాలేజీల్లో ఈ అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ 2024 వరకు వర్తించనున్నది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ల పాటు సదరు కేటగిరీని పాత 20 కాలేజీల్లో కొనసాగించనున్నారు. అయితే.. 2025 నుంచి మిగిలిన 20 కాలేజీల్లోని అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ కూడా తెలంగాణ విద్యార్థులకు లభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆలిండియా కోటా మాత్రం యధాతథంగా కొనసాగనున్నది.

ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. తెలంగాణలోని ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న 2,118 సీట్లలో 900 సీట్లు మన విద్యార్థులకే దక్కనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ దార్శనికతకు ఇదొక మచ్చుతునక అని చెప్పారు. వైద్య విద్యలో తెలంగాణ దూసుకొని పోతున్నదని.. రాబోయే రోజుల్లో మరిన్ని మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు.


First Published:  5 July 2023 3:06 AM GMT
Next Story