Telugu Global
Sports

హిట్ మ్యాన్ కు గత ఏడాదిగా ఫిట్ నెస్ సమస్యలు!

క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ భారత కెప్టెన్ గా రోహిత్ శర్మకు 2022 సంవత్సరం మిశ్రమఫలితాలనే ఇచ్చింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రికార్డుల మోత మోగించిన రోహిత్...భారత కెప్టెన్ గా మాత్రం అదేస్థాయిలో రాణించలేకపోయాడు.

హిట్ మ్యాన్ కు గత ఏడాదిగా ఫిట్ నెస్ సమస్యలు!
X

ప్రపంచ మేటి ఓపెనర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మకు 2022 సంవత్సరం ఓ చేదుఅనుభవంగా మిగిలిపోయింది. ఫిట్ నెస్ సమస్యలతో హిట్ మ్యాన్ రోహిత్ ఏకంగా 32 అంతర్జాతీయమ్యాచ్ లకు దూరమయ్యాడు....

క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ భారత కెప్టెన్ గా రోహిత్ శర్మకు 2022 సంవత్సరం మిశ్రమఫలితాలనే ఇచ్చింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రికార్డుల మోత మోగించిన రోహిత్...భారత కెప్టెన్ గా మాత్రం అదేస్థాయిలో రాణించలేకపోయాడు.

కెప్టెన్ గా, ఓపెనర్ గా విఫలం...

టెస్ట్ క్రికెట్, వన్డే క్రికెట్, టీ-20 క్రికెట్...ఇలా మూడుఫార్మాట్లలోనూ శతకాలు బాదిన అతికొద్దిమంది ఆటగాళ్లలో ఒకడిగా రోహిత్ శర్మకు పేరుంది. అంతేకాదు వన్డే క్రికెట్లో పలుమార్లు డబుల్ సెంచరీలు సాధించిన ప్రపంచ రికార్డు సైతం రోహిత్ పేరుతోనే ఉంది. ప్రతిష్టాత్మక ఐపీఎల్ ట్రోఫీని ముంబై ఇండియన్స్ కి ఐదుసార్లు అందించిన సారథి రోహిత్ మాత్రమే.

క్రికెట్ మూడు ఫార్మాట్లలోను కలసి 41 శతకాలు బాదిన మొనగాడు రోహిత్. తనదైన రోజున బౌలర్లను చీల్చి చెండాడే రోహిత్ కు భీకరమైన ఓపెనర్ గా పేరుంది. అయితే..ఈ ఘనతలన్నీ 2022 సీజన్లో ఎందుకూ కొరగాకుండా పోయాయి.

భారత కెప్టెన్ గా అంతంత మాత్రమే...

విరాట్ కొహ్లీ నుంచి భారత కెప్టెన్ గా పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ భారీఅంచనాలతో బరిలోకి దిగినా స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు. స్పెషలిస్ట్ ఓపెనర్ గా మాత్రమే కాదు...జట్టును ముందుండి నడిపించే నాయకుడిగా కూడా విఫలమయ్యాడు.

34 సంవత్సరాల రోహిత్ 2021 సీజన్లో భారత కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. ఆసియాకప్ టీ-20 టోర్నీలో భారత్ ను కనీసం సూపర్ -4కు చేర్చలేకపోయాడు. ఇక..ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన టీ-20 ప్రపంచకప్ సెమీస్ లోనే భారత్ దారుణంగా విఫలమయ్యింది.

ద్వైపాక్షిక సిరీస్ ల్లో భారత్ కు అత్యధిక విజయాలు అందించిన రోహిత్..అంతర్జాతీయ టోర్నీలలో మాత్రం విజేతగా నిలుపలేకపోయాడు.

వెంటాడిన ఫిట్ నెస్ సమస్యలు...

రోహిత్ శర్మను పలు రకాల ఫిట్ నెస్ సమస్యలతో పాటు దురదృష్టం సైతం వెంటాడింది. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ భారత్ కు కెప్టెన్ గా, కీలక ఓపెనర్ గా అందుబాటులో ఉండాల్సిన రోహిత్ ఏకంగా 32 మ్యాచ్ లకు దూరమయ్యాడు. రోహిత్ అందుబాటులో లేకపోడం భారతజట్టును తీవ్రంగా ప్రభావితం చేసింది. దీనికితోడు రొటేషన్ పాలసీ పేరుతో గత ఏడాదికాలంలో భారత్ కు ఏడుగురు వేర్వేరు ఆటగాళ్లు నాయకత్వం వహించడం కూడా అయోమయానికి కారణమయ్యింది.

గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్..

2020-21 సిరీస్ లో ఆస్ట్ర్రేలియాతో రెండుటెస్టులకు దూరం కావడంతో అజింక్యా రహానే నాయకత్వంలో భారత్ సంచలన విజయం సాధించగలిగింది. బంగ్లాదేశ్ తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ లో భారత్ 1-2తో పరాజయం చవిచూసిన సిరీస్ లోని ఆఖరిమ్యాచ్ లో చేతివేలి గాయంతో టెస్టు సిరీస్ కు సైతం దూరమయ్యాడు. చివరకు రాహుల్ నాయకత్వంలో భారత్ 2-0తో టెస్టు సిరీస్ విజయం సాధించింది.

డకౌట్లలో రోహిత్ టాప్...

2022 సీజన్లో రోహిత్ 40 ఇన్నింగ్స్ లో నాలుగు డౌకట్లతో 995 పరుగులు మాత్రమే సాధించాడు. ఐదుగురు భారత అత్యుత్తమ బ్యాటర్లలో రోహిత్ ఐదోస్థానంలో నిలిచాడు.

అత్యధికంగా నాలుగుసార్లు డౌకౌట్లైన భారత క్రికెటర్ గా అగ్రస్థానంలో నిలిచాడు.

తన కెరియర్ లో ఇప్పటికే 41 శతకాలుబాదిన రోహిత్ 2022 సీజన్లో కనీసం ఒక్క సెంచరీ సాధించలేకపోయాడు. ఐపీఎల్ లో ఐదుసార్లు విజేత ముంబై ఇండియ్స్ 2022 సీజన్ టోర్నీలో 10వ స్థానానికి పడిపోయింది.

శ్రీలంకతో జనవరి 3 నుంచి జరిగే టీ-20 సిరీస్ లో పోటీపడే భారతజట్టు పగ్గాలను హార్థిక్ పాండ్యాకు టీమ్ మేనేజ్ మెంట్ అప్పజెప్పింది. అయితే శ్రీలంకతో జరిగే తీన్మార్ వన్డే సిరీస్ తో పాటు ఆస్ట్ర్రేలియాతో జరిగే ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ లో సైతం భారతజట్టుకు రోహిత్ నాయకత్వం వహించనున్నాడు.

కొత్తసంవత్సరమైనా కెప్టెన్ గా, ఓపెనర్ గా రోహిత్ కు కలసిరావాలని అభిమానులు కోరుకొంటున్నారు.

First Published:  30 Dec 2022 3:46 AM GMT
Next Story