Telugu Global
Sports

ముంబై ఫుట్ పాత్ నుంచి 5 కోట్ల భవనానికి....!

ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ లో రికార్డుల మోత మోగించిన భారత యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ క్రికెటర్ గా నిలదొక్కుకోడానికి అంతులేని పోరాటమే చేశాడు.

ముంబై ఫుట్ పాత్ నుంచి 5 కోట్ల భవనానికి....!
X

ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ లో రికార్డుల మోత మోగించిన భారత యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ క్రికెటర్ గా నిలదొక్కుకోడానికి అంతులేని పోరాటమే చేశాడు.

ముంబై మహానగరం ఫుట్ పాత్ నుంచి విలాసవంతమైన భవనంలో నివసించే స్థాయికి ఎదిగాడు.

భారత క్రికెట్ పుస్తకంలోని పేజీలను తిరగేస్తే మనకు ఎందరెందరో యోధులు, వీరులు, శూరులు కనిపిస్తారు. ఆ జాబితాలోకి తాజాగా వచ్చి చేరిన ఘనుడే 22 సంవత్సరాల క్రికెటర్ యశస్వి జైశ్వాల్. క్రికెటర్ గా ఎదగటానికి, నిలదొక్కుకోడానికి గొప్పపోరాటం చేసిన యశస్వీ పేదరికాన్ని, ప్రతికూల పరిస్థితులను జయించడం ద్వారా అసలుసిసలు విజేతగా అవతరించాడు.

ఉత్తరప్రదేశ్ నుంచి ముంబై మహానగరానికి....

ఉత్తరప్రదేశ్ లోని బదోహీ జిల్లా సూర్యవంశీ గ్రామంలోని ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన యశస్వి జైశ్వాల్ కు బాల్యం నుంచి క్రికెట్ అంటే పిచ్చి. గొప్ప క్రికెటర్ కావాలని, భారతజట్టుకు ఆడాలని కలలు కన్నాడు. అయితే..బ్యాటు కొనుక్కొనే స్థోమతు లేని యశస్వీ అమ్మానాన్నలకు చెప్పకుండా కట్టుబట్టలతో ముంబై మహానగరానికి తరలి వచ్చాడు. తినడానికి తిండి, తలదాచుకోడానికి ఓ గూడులేక పడరాని పాట్లు పడ్డాడు. ఓ పానీ పూరీ దుకాణంలో పనిచేస్తూ కడుపు నింపుకోడమే కాదు..క్రికెటర్ గా తన తొలి అడుగులు వేశాడు.

తనలో దాగిన అపారప్రతిభాపాటవాలకు క్రికెట్ పట్ల ప్రేమను జోడించి మరీ ఆడుతూ సబ్ -జూనియర్, జూనియర్ స్థాయిలో సత్తా ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

తొలిరోజుల్లో వందా, రెండొందల కోసం ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు ఆడిన యశస్వీ ప్రాక్టీస్‌ చేసే స్టేడియం పక్కనే ఓ చిన్న టెంట్‌లో జీవనం సాగించాడు. తన లక్ష్యాన్ని మాత్రం ఏనాడు మరువకుండా...కన్న ఊరిని, సొంత ఇంటిని విడిచి ముంబైకి వచ్చిన స్పృహనే కొనసాగించాడు. అంచలంచెలుగా ఎదుగుతూ.. తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. దేశవాళీ, రంజీ, లిస్ట్‌-ఏ, అండర్‌-19, ఐపీఎల్‌.. ఇలా అవకాశం వచ్చిన ప్రతిసారి తనను తాను నిరూపించుకున్న ఆ కుర్రాడు ఇప్పుడు భారత టెస్టు జట్టులో స్టార్ ఓపెనర్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

దేశవాళీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు...

గత సీజన్‌ రంజీ విజేత మధ్యప్రదేశ్‌తో జరిగిన ఇరానీ కప్‌ ట్రోఫీ మ్యాచ్ లో రెస్టాఫ్‌ ఇండియా తరఫున బరిలోకి దిగిన యశస్వి రెండు ఇన్నింగ్స్‌ల్లో భారీ స్కోర్ల (213, 144)తో విజృంభించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటి వరకు 80.21 సగటుతో పరుగులు రాబట్టిన జైస్వాల్‌.. ఐపీఎల్‌ 16వ సీజన్‌లోనూ సత్తాచాటాడు. లీగ్‌ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన (13 బంతుల్లో) అర్ధశతకం నమోదు చేసి ఔరా అనిపించాడు. 2023-25 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ సైకిల్‌ను దృష్టిలో పెట్టుకొని సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించడం యశస్వీకి కలసి వచ్చింది.

కరీబియన్ గడ్డపై టెస్టు అరంగేట్రం....

డోమనికాలోని విండ్సర్ పార్క్ వేదికగా...వెస్టిండీస్ ప్రత్యర్థిగా టెస్టు అరంగేట్రం చేసిన యశస్వి మరి వెనుదిరిగి చూసింది లేదు. 21 సంవత్సరాల వయసులో టెస్టు బరిలోకి దిగిన యశస్వి కెప్టెన్ రోహిత్ శర్మతో జంటగా 229 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశాడు. అరంగేట్రం టెస్టులోనే శతకం బాదిన భారత మూడో ఓపెనర్ గా రికార్డుల్లో చేరాడు.

2001 సిరీస్ లో వెస్టిండీస్ ప్రత్యర్థిగా సంజయ్ బంగర్- వీరేంద్ర సెహ్వాగ్ జోడీ మొదటి వికెట్ కు సాధించిన 201 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని 22 సంవత్సరాల విరామం తర్వాత రోహిత్- యశస్వి జోడీ 229 పరుగుల భాగస్వామ్యంతో అధిగమించగలిగారు.

2013 సిరీస్ లో ఆస్ట్ర్రేలియాపై శిఖర్ ధావన్, 2018 సిరీస్ లో వెస్టిండీస్ ప్రత్యర్థిగా పృథ్వీ షా తమ అరంగేట్రం టెస్టుల్లోనే శతకాలు సాధించగా..ప్రస్తుత 2023 సిరీస్ తొలిటెస్టులోనే యశస్వి జైశ్వాల్ సైతం అజేయశతకం బాదడం ద్వారా ఈ ఘనత సాధించిన భారత మూడో ఓపెనర్ గా రికార్డుల్లో చేరాడు.

21 ఏళ్ళ 197 రోజుల వయసులో...

టెస్టు అరంగేట్రం మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన నాలుగో అత్యంత పిన్నవయస్కుడైన బ్యాటర్ గా యశస్వి జైశ్వాల్ రికార్డు నెలకొల్పాడు. 2013లో ఆస్ట్ర్రేలియాపైన శిఖర్ ధావన్ 187 పరుగులు, 2018లో వెస్టిండీస్ పై పృథ్వీ షా 134 పరుగులు సాధించారు. అయితే..యశస్వి జైశ్వాల్ మాత్రం 350 బంతులు ఎదుర్కొని 14 బౌండ్రీలతో 143 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిచాడు.

టెస్టు అరంగేట్రం మ్యాచ్ లోనే సెంచరీ బాదిన భారత 17వ క్రికెటర్ గా యశస్వి జైశ్వాల్ రికార్డుల్లో చేరాడు. యశస్వి కంటే ముందుగా అరంగేట్రం శతకాలు నమోదు చేసిన భారత ప్రముఖ బ్యాటర్లలో లాలా అమర్‌నాథ్‌, గుండప్ప విశ్వనాథ్‌, మహమ్మద్‌ అజారుద్దీన్‌, సౌరవ్‌ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌, సురేశ్‌ రైనా, శిఖర్‌ ధవన్‌, రోహిత్‌ శర్మ, పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు. 2021 సిరీస్ లో కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్ పై శ్రేయస్ అయ్యర్ అరంగేట్రం శతకం సాధించిన తర్వాత..అదే ఘనతను యశస్వి జైశ్వాల్ మాత్రమే దక్కించుకోగలిగాడు.

విదేశీగడ్డపై టెస్టు అరంగేట్రం మ్యాచ్ లోనే శతకం బాదిన భారత 7వ బ్యాటర్ గా, గత 13 సంవత్సరాలలో భారత తొలి క్రికెటర్ గా యశస్వి నిలిచాడు. 2010 సిరీస్ లో శ్రీలంక గడ్డపై సురేశ్ రైనా అరంగేట్రం టెస్టు శతకం నమోదు చేసిన తర్వాత..కరీబియన్ గడ్డపై యశస్వి అదే రికార్డును అందుకోగలిగాడు.

ఇంగ్లండ్ సిరీస్ లో విశ్వరూపం...

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా ఇంగ్లండ్ తో ముగిసిన 5 మ్యాచ్ ల సిరీస్ లో యశస్వీ రెండు ద్విశతకాలతో సహా 712 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకొన్నాడు.ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్న యశస్వీ 22 సంవత్సరాల చిరుప్రాయానికి భారతజట్టు కీలక సభ్యుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

5 కోట్ల ఖరీదైన భవనంలో నివాసం...

ముంబైకి వలస వచ్చిన తొలిరోజుల్లో ఫుట్ పాత్ ల మీద పడుకొని, గుడారాలలో తలదాచుకొన్న యశస్వి అంతర్జాతీయ క్రికెటర్ గా తాను ఆర్జించిన ఆదాయంతో 5 కోట్ల రూపాయల ఖరీదైన విలాసవంతమైన నివాసంలో కుటుంబసభ్యులతో కలసి జీవిస్తున్నాడు.

గత ఆరేళ్లుగా యశస్వీ రాబడి ఏడాదికి సగటున 58 శాతం వంతున పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం యశస్వి ఆస్తుల విలువ 16 కోట్ల రూపాయలు ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.

యశస్వి నెలసరి ఆదాయం సగటున 35 లక్షల రూపాయలుగా ఉంది. ఏడాదికి 4 నుంచి 4 కోట్ల 80 లక్షల రూపాయల వరకూ సంపాదించగలుగుతున్నాడు.

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు సీజన్ కు 4 కోట్ల రూపాయల కాంట్రాక్టు పై ఆడుతున్నయశస్వీ భారత తరపున ఆడిన ఒక్కో టెస్టు మ్యాచ్ కు 15 లక్షల రూపాయలు, వన్డేకి 7 లక్షల రూపాయలు, టీ-20 మ్యాచ్ కు 4 లక్షల రూపాయల చొప్పున మ్యాచ్ ఫీజుగా అందుకొంటున్నాడు.

బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు కింద 3 కోట్ల రూపాయల తరగతిలో యశస్వీకి చోటు దక్కింది.

బూస్ట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ యశస్వీ....

క్రికెటర్ గా మాత్రమే కాదు..బ్రాండ్ అంబాసిడర్ గానూ యశస్వీ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఆర్జిస్తున్నాడు. బూస్ట్, జెబీఎల్, ఇండియా, ఫైర్ బోల్ట్ బ్రాండ్ లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు.

ఉత్తరప్రదేశ్ లోని స్వగ్రామం సూర్యవాన్ లో తల్లిదండ్రులకు ఖరీదైన నివాసాన్ని ఏర్పాటు చేసిన యశస్వీ ముంబై మహానగరంలో ఐదు బెడ్రూమ్ ల విలాసవంతమైన అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశాడు.

యశస్వీ గరాజ్ లో మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ 200, టాటా హారియర్, మహీంద్రా థార్ లాంటి ఖరీదైనకార్లు ఉన్నాయి.

క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకోవాలని భావించే నవతరం ఆటగాళ్లకు యశస్వీ జీవితం, క్రికెటర్ గా ఎదగటానికి చేసినపోరాటం స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతాయి.

First Published:  12 March 2024 9:45 AM GMT
Next Story