Telugu Global
Sports

జాక్ పాట్ ఎవరికో...నేడు మహిళా ఐపీఎల్ వేలం!

మహిళా ఐపీఎల్ రెండో సీజన్ వేలాన్ని ఈరోజు ముంబైలో నిర్వహించనున్నారు. 165 మంది ప్లేయర్ల జాబితా నుంచి ఐదు ఫ్రాంచైజీలు తమకు నచ్చిన ప్లేయర్లను వేలం ద్వారా సొంతం చేసుకోనున్నాయి.

జాక్ పాట్ ఎవరికో...నేడు మహిళా ఐపీఎల్ వేలం!
X

మహిళా ఐపీఎల్ రెండో సీజన్ వేలాన్ని ఈరోజు ముంబైలో నిర్వహించనున్నారు. 165 మంది ప్లేయర్ల జాబితా నుంచి ఐదు ఫ్రాంచైజీలు తమకు నచ్చిన ప్లేయర్లను వేలం ద్వారా సొంతం చేసుకోనున్నాయి....

గత సీజన్లో తొలిసారిగా నిర్వహించిన మహిళా ఐపీఎల్ కు కొనసాగింపుగా 2024 సీజన్ వేలానికి ముంబైలో రంగం సిద్ధమయ్యింది. ఈ రోజు జరిగే వేలం కార్యక్రమాన్ని మహిళా ఆక్షనీర్ మలైకా సాగర్ నిర్వహించనున్నారు. మొత్తం ఐదు ఫ్రాంచైజీల యాజమాన్యాలు 15 కోట్ల రూపాయలకు పైగా మొత్తంతో వేలం బరిలోకి దిగబోతున్నాయి.

2024 ఫిబ్రవరి- మార్చి మాసాలలో జరిగే మహిళా ఐపీఎల్ లో ఐదుజట్ల పోరును దేశంలోని మూడు నగరాలు వేదికలుగా నిర్వహించనున్నారు.

30 స్థానాల కోసం 165 మంది పోటీ!

ఈరోజు జరిగే వేలంలో ఐదుజట్లలోని 30 ఖాళీలు భర్తీ చేయటం కోసం మాత్రమే వేలం నిర్వహించనున్నారు. మొత్తం 104 మంది భారత ప్లేయర్లతో సహా 165 మంది వేలం జాబితాలో చోటు సంపాదించారు.

వేలం జాబితా ద్వారా 61 మంది విదేశీ క్రికెటర్లు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఐసీసీ అనుబంధ దేశాలకు చెందిన 15 మంది ప్లేయర్లతో పాటు..అంతర్జాతీయ మ్యాచ్ ల అనుభవం ఏమాత్రం లేని 56 మంది అన్ కాప్డ్ ప్లేయర్లను జాబితాలో చేర్చారు.

40 లక్షలు బేస్ ప్రైస్ గా...

ఐదుజట్లలోనూ కలిపి విదేశీ ప్లేయర్ల కోటాలో 9 స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. కంగారూ ఆల్ రౌండర్లు అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వార్ హామ్, ఇంగ్లండ్ వికెట్ కీపర్ యామీ జోన్స్, సౌతాఫ్రికా పేసర్ షబ్నం ఇస్మాయిల్ ల కనీస వేలం ధరను 40 లక్షలుగా నిర్ణయించారు.

లీగ్ లో తలపడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు...ప్రారంభ సీజన్లో తమతమ జట్లకు ఆడిన 21 మంది విదేశీ ప్లేయర్లను వరుసగా రెండో సీజన్లోనూ కొనసాగించాలని నిర్ణయించాయి.

జాక్ పాట్ కొట్టేదెవరో?

మొత్తం 5 ప్రాంచైజీలలో గుజరాత్ జెయింట్స్ మాత్రమే అత్యధికంగా 2 కోట్ల 25 లక్షల రూపాయల మొత్తంతో వేలం బరిలోకి దిగుతోంది. మొత్తం 10 స్థానాలను గుజరాత్ భర్తీ చేసుకోనుంది.

డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ 2 కోట్ల 10 లక్షల రూపాయలతో 5 ఖాళీలను, బెంగళూరు 3 కోట్ల 35 లక్షల రూపాయలతో ఏడుగురు ప్లేయర్లను, యూపీ వారియర్స్ 4 కోట్లతో ఐదుగురు ప్లేయర్లను కొనుగోలు చేయాల్సి ఉంది.

శ్రీలంక వెటరన్ బ్యాటర్ చమరీ అటపట్టుకు భారీగా ధర దక్కే అవకాశం ఉంది. థాయ్ లాండ్ ఓపెనర్ నత్తకాన్ చంతామ్, అమెరికా పేసర్ తారా నోరిస్ కు సైతం మంచి ధర దక్కే అవకాశం ఉంది. నెదర్లాండ్స్, స్కాట్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్ దేశాలకు చెందిన క్రికెటర్లు సైతం వేలంబరిలో ఉన్నారు.

ప్రారంభ సీజన్లో టాపర్స్......

ఐపీఎల్ ప్రారంభ (2023 ) సీజన్ వేలంలో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మందన (ఆర్సీబీ) రికార్డుస్థాయిలో అత్యధికంగా 3 కోట్ల 40 లక్షల రూపాయల ధర దక్కించుకొంది.

అంతర్జాతీయ స్టార్లు నటాలియా స్కీవర్‌ (ముంబై), ఆష్లే గార్డ్‌నర్‌ (గుజరాత్‌) చెరో 3.2 కోట్లు దక్కించుకున్నారు. ఫ్రాంచైజీలన్నీ ఆల్‌రౌండర్ల కోసం పోటీపడగా.. దీప్తి శర్మను రూ. 2.6 కోట్లకు యూపీ జట్టు చేజిక్కించుకుంది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అజేయ అర్ధశతకం బాదిన జెమీమా రోడ్రిగ్స్‌ (ఢిల్లీ)కు అనూహ్యంగా 2.2 కోట్లు దక్కగా.. భారత కెప్టెన్‌ను హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ను రూ. 1.8 కోట్లకు ముంబై ఇండియన్స్‌ కైవసం చేసుకుంది. యువ ఓపెనర్‌, అండర్‌-19 ప్రపంచకప్‌ విజేత షఫాలీ వర్మను రూ. 2 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసుకుంది.

యష్తిక భాటియా (ముంబై ఇండియన్స్‌)కు రూ. 1.5 కోట్లు దక్కగా.. పేస్‌ బౌలర్‌ రేణుక సింగ్‌కు రూ. 1.5 కోట్ల ధర పలికింది. ప్రస్తుత సీజన్లో రికార్డు ధర ఎవరికి దక్కుతుందో మరి.

మహిళా ఐపీఎల్ ప్రారంభ సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించడం ద్వారా ముంబై ఇండియన్స్ తొలి విజేతగా నిలిచింది. హేమాహేమీల్లాంటి ప్లేయర్లతో కూడిన జట్టుతో పోటీలోకి దిగిన బెంగళూరు నాలుగోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

First Published:  9 Dec 2023 1:30 AM GMT
Next Story