Telugu Global
Sports

ప్రపంచకప్ కింగ్ విరాట్ కొహ్లీ

టీ-20 ప్రపంచకప్ లో కింగ్ విరాట్ కొహ్లీ తనకుతానే సాటిగా నిలిచాడు. పరుగులు సాధించడంలో తనను మించిన మొనగాడు మరొకరు లేరని నిరూపించాడు. తన ఫేవరెట్ గ్రౌండ్ అడిలైడ్ ఓవల్ వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన నాలుగోరౌండ్ సూపర్ -12 పోరులోనూ అజేయ అర్ధశతకంతో నిలిచాడు.

ప్రపంచకప్ కింగ్ విరాట్ కొహ్లీ
X

టీ-20 ప్రపంచకప్ లో కింగ్ విరాట్ కొహ్లీ తనకుతానే సాటిగా నిలిచాడు. పరుగులు సాధించడంలో తనను మించిన మొనగాడు మరొకరు లేరని నిరూపించాడు. తన ఫేవరెట్ గ్రౌండ్ అడిలైడ్ ఓవల్ వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన నాలుగోరౌండ్ సూపర్ -12 పోరులోనూ అజేయ అర్ధశతకంతో నిలిచాడు. మరో ప్రపంచ రికార్డును తన పేరుతో లిఖించుకొన్నాడు.

ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న 2022 టీ-20 ప్రపంచకప్ లో భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కొహ్లీ పరుగులహోరు, హాఫ్ సెంచరీల జోరు కొనసాగుతోంది. సూపర్ -12 గ్రూప్ -2లో భారత్ ఆడిన నాలుగురౌండ్ల మ్యాచ్ ల్లో మూడు అజేయ అర్ధశతకాలు సాధించడం కేవలం విరాట్ కొహ్లీకే చెల్లింది.

మహేలను మించిన విరాట్..

ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్థనే పేరుతో ఉంది. అయితే...ఆ రికార్డును కింగ్ విరాట్ కొహ్లీ ప్రస్తుత ప్రపంచకప్ నాలుగోరౌండ్ మ్యాచ్ ద్వారా అధిగమించాడు.

మొదటి రెండురౌండ్ల మ్యాచ్ ల్లో పాకిస్థాన్ పై 82 నాటౌట్, నెదర్లాండ్స్ పై 62 పరుగుల నాటౌట్ స్కోర్లతో మ్యాచ్ విన్నర్ గా నిలిచిన విరాట్..సఫారీలతో ముగిసిన ఉత్కంఠభరిత పోరులో మాత్రం 12 పరుగులకే అవుటయ్యాడు. అయితే...తనకు అచ్చొచ్చిన గ్రౌండ్ అడిలైడ్ ఓవల్ వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన పోరులో

విరాట్ 64 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిచాడు. ఈ క్రమంలో ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

5 ప్రపంచకప్ టోర్నీలలో 13 అర్థశతకాలు..

తన కెరియర్ లో ఐదో ప్రపంచకప్ టోర్నీలో పాల్గొంటున్న విరాట్ మొత్తం 23 మ్యాచ్ ల్లో మహేల జయవర్థనే 1016 పరుగుల రికార్డును తెరమరుగు చేయగలిగాడు.

మహేల మొత్తం 31 మ్యాచ్ ల్లో 1016 పరుగులు సాధిస్తే...విరాట్ అంతకంటే ఎనిమిది ఇన్నింగ్స్ తక్కువలోనే ఈ ఘనత సాధించడం విశేషం మహేల జయవర్థనే 134. 74 స్ట్ర్రయిక్ రేట్ తో 39. 07 సగటు సాధించాడు.

దక్షిణాఫ్రికాతో పెర్త్ వేదికగా ముగిసిన మూడోరౌండ్ మ్యాచ్ లో 12 పరుగుల స్కోరు సాధించడం ద్వారా టీ-20 ప్రపంచకప్ లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరిన రెండో బ్యాటర్ గా నిలిచిన విరాట్ ..నాలుగోరౌండ్లో అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డు నెలకొల్పగలిగాడు. ప్రపంచకప్ లో విరాట్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 89 పరుగుల నాటౌట్ గా ఉంది.

ప్రస్తుత ప్రపంచకప్ తో కలసి ఐదుసార్లు ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొన్న విరాట్ ...గత నాలుగు ప్రపంచకప్ టోర్నీలలో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డులు గెలుచుకొన్నాడు. విరాట్ సాధించిన మొత్తం 13 అర్ధశతకాలలో 11సార్లు నాటౌట్ గా మిగలడం విశేషం.

కరీబియన్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ 33 మ్యాచ్ ల్లో 965 పరుగులు, భారత కెప్టెన్ రోహిత్ శర్మ 36 మ్యాచ్ ల్లో 919 పరుగులతో తర్వాతి స్థానాలలో ఉన్నారు.

First Published:  3 Nov 2022 3:51 AM GMT
Next Story