Telugu Global
Sports

నేడు బంగ్లాతో పోరు... నాలుగో విజయానికి భారత్ గురి!

వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో వరుసగా నాలుగో విజయానికి ఆతిథ్య భారత్ గురిపెట్టింది. పూణే వేదికగా ఈరోజు జరిగే నాలుగోరౌండ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడనుంది.

నేడు బంగ్లాతో పోరు... నాలుగో విజయానికి భారత్ గురి!
X

నేడు బంగ్లాతో పోరు... నాలుగో విజయానికి భారత్ గురి!

వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో వరుసగా నాలుగో విజయానికి ఆతిథ్య భారత్ గురిపెట్టింది. పూణే వేదికగా ఈరోజు జరిగే నాలుగోరౌండ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడనుంది...

భారత గడ్డపై నాలుగోసారి జరుగుతున్న 2023- ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో ఓ ఆసక్తికరమైన పోరుకు పూణే లోని మహారాష్ట్ర్ర క్రికెట్ స్టేడియం వేదికగా నిలిచింది.

బంగ్లాకు భారత్, భారత్ కు బంగ్లా టెన్షన్!

పదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో మూడుకు మూడుమ్యాచ్ లు నెగ్గడం ద్వారా దూకుడుమీదున్న భారత్ వరుసగా నాలుగో విజయానికి ఉరకలేస్తుంటే...సంచలనాలకు మరోపేరైన బంగ్లాజట్టు మాత్రం మూడుమ్యాచ్ ల్లో ఓ గెలుపు, రెండు పరాజయాల రికార్డుతో ఉంది.

ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు భారత్ ప్రత్యర్థి బంగ్లాను చూసి లోలోన భయపడుతుంటే...భీకరమైన ఫామ్ లో ఉన్న భారత్ ను చూసి 8వ ర్యాంకర్ బంగ్లాదేశ్ బెంబేలెత్తిపోతోంది.

ఇటు బంగ్లా - అటు భారత్...

రెండుజట్ల బలాబలాలు, ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే..భారత్ తో ఆడిన గత నాలుగు వన్డేలలో బంగ్లాజట్టుకు మూడు విజయాలున్నాయి. అదే ప్రపంచకప్ లో ఈ రెండుజట్లూ నాలుగుసార్లు తలపడితే..భారత్ 3-1 రికార్డుతో ఉంది.

ప్రస్తుత ప్రపంచకప్ లో మాత్రం బంగ్లాతో పోల్చిచూస్తే భారత్ ఎన్నోరెట్లు మెరుగైన, బలమైన జట్టుగా కనిపిస్తోంది. రౌండ్ రాబిన్ లీగ్ మొదటి మూడు రౌండ్లలోనూ ఆస్ట్ర్రేలియా, అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ జట్లను భారత్ చిత్తు చేసిన తీరు చూస్తే మాత్రం..రోహిత్ సేన ధాటికి గ్రీన్ టైగర్స్ జట్టు ఏపాటి తట్టుకోగలదన్నది అనుమానమే.

భారత్ కు స్పిన్నర్ల బెరుకు....

2022 సీజన్ నుంచి భారతజట్టు ఆడిన వన్డేలలో ప్రత్యర్థిజట్లలోని ఎడమచేతి వాటం స్పిన్నర్లకు 42 వికెట్లు, లెగ్ స్పిన్నర్లకు 21 వికెట్లు, ఆఫ్ స్పిన్నర్లకు 24 వికెట్లు సమర్పించుకొంది. పైగా బంగ్లా తురుపుముక్క, లెఫ్టామ్ స్పిన్నర్ షకీబుల్ హసన్ కు విరాట్ కొహ్లీ ప్రత్యర్థిగా కళ్లు చెదిరే రికార్డే ఉంది.

2022 నుంచి భారత్ ఆడిన నాలుగువన్డేలలో షకీబుల్ కు 10 వికెట్లు పడగొట్టిన ఘనత ఉంది. ఇందులో విరాట్ కొహ్లీనే షకీబుల్ నాలుగుసార్లు పడగొట్టడం ద్వారా

భారత్ పాలిట అత్యంత ప్రమాదకరమైన బౌలర్ గా నిలిచాడు. బంగ్లా పేస్ బౌలర్లలో టస్కీన్ అహ్మద్ సైతం భారత టాపార్డర్ కు అసలుసిసలు పరీక్షకానున్నాడు.

బంగ్లాపక్కలో బుమ్రా బల్లెం!

అంతంత మాత్రం ఫామ్ లో ఉన్న బంగ్లాదేశ్ టాపార్డర్ కు భారత ఓపెనింగ్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా నుంచి అసలు ముప్పు పొంచి ఉంది. మిడిల్ ఓవర్లలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను ఎదుర్కొనడం కత్తిమీద సవాలే కానుంది.

మహారాష్ట్ర్ర స్టేడియం వేదికగా ప్రస్తుత ప్రపంచకప్ లో ఇదే తొలిమ్యాచ్ కావడంతో...300కు పైగా స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. మ్యాచ్ జరిగే సమయంలో వాతావరణం చల్లగా ఉంటుందని, అల్పపీడన ప్రభావం అంతో ఇంతో ఉండే అవకాశం లేకపోలేదని వాతావరణశాఖ ప్రకటించింది.

భారతజట్టు ఏవిధమైన మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్ నే కొనసాగించనుంది.

విరాట్ కొహ్లీ నుంచే తమ బౌలర్లకు అసలుసిసలు సవాలు ఎదురుకానుందని బంగ్లా బౌలింగ్ కోచ్ అలెన్ డోనాల్డ్ చెబుతున్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

భారత కాలమాన ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

First Published:  19 Oct 2023 3:11 AM GMT
Next Story