Telugu Global
Sports

వన్డే ప్రపంచకప్ లో భారీగా పెరిగిన ప్రైజ్ మనీ!

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరుగనున్న 2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ విజేతకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రైజ్ మనీ దక్కనుంది.

వన్డే ప్రపంచకప్ లో భారీగా పెరిగిన ప్రైజ్ మనీ!
X

వన్డే ప్రపంచకప్ లో భారీగా పెరిగిన ప్రైజ్ మనీ!

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరుగనున్న 2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ విజేతకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రైజ్ మనీ దక్కనుంది.

భారతగడ్డపై నాలుగోసారి వన్డే ప్రపంచకప్ కు రంగం సిద్ధమయ్యింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకూ దేశంలోని 10 నగరాలు వేదికగా జరుగనున్న ఈ ప్రపంచకప్ సందడిలో 10 దేశాలజట్లు పాలుపంచుకోనున్నాయి.

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం లో అక్టోబర్ 5 న ప్రారంభమై..నవంబర్ 19న నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముగిసే ఈ టోర్నీలో భాగంగా రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ దశలలో మొత్తం 48 మ్యాచ్ లను 46 రోజులపాటు నిర్వహించనున్నారు.

టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుతో పాటు విజయాలు నమోదు చేసిన జట్లకు సైతం భారీగా ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీ విజేత ఆస్ట్ర్రేలియాకు ఇచ్చిన ప్రైజ్ మనీ కంటే..ప్రస్తుత 2023 ప్రపంచకప్ టోర్నీ విన్నర్ కు 40 శాతం అదనంగా ఇవ్వనున్నారు.

83.3 కోట్లకు పెరిగిన ప్రైజ్ మనీ....

ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్ల మంది వీక్షించే ప్రపంచకప్ టోర్నీలో 83 కోట్ల 30 లక్షల రూపాయల ప్రైజ్ మనీని ( 10 మిలియన్ డాలర్లు ) అందచేయనున్నారు. రౌండ్ రాబిన్ లీగ్ దశ మ్యాచ్ ల్లో విజయాలు సాధించిన జట్లకు 40వేల డాలర్లు చొప్పున, సెమీఫైనల్స్ నుంచి జరిగే నాకౌట్ మ్యాచ్ ల్లో విజేతలుగా నిలిచిన జట్లకు లక్ష డాలర్లు చొప్పున నజరానాగా ఇస్తామని ఐసీసీ ప్రకటించింది.

చాంపియన్ గా నిలిచిన జట్టుకు 40 లక్షల డాలర్లు ( 33 కోట్ల 25 లక్షల 84వేల రూపాయలు), రన్నరప్ గా నిలిచిన జట్టుకు 20 లక్షల డాలర్లు ( 16 కోట్ల 62 లక్షల 54వేల 200 రూపాయలు ) ప్రైజ్ మనీగా అందచేస్తారు.

సెమీఫైనల్స్ లో పరాజయం పొందిన రెండు జట్ల కు 6 కోట్ల 65 లక్షల రూపాయల చొప్పున. రౌండ్ రాబిన్ లీగ్ నుంచి నిష్క్ర్రమించిన 6 జట్లకు 83 లక్షల రూపాయల చొప్పున చెల్లిస్తారు. రౌండ్ రాబిన్ లీగ్ దశలో నెగ్గిన ప్రతిమ్యాచ్ లోనూ విజేత జట్టుకు 66 లక్షల రూపాయల చొప్పున ఇస్తారు.

రౌండ్ రాబిన్ లీగ్ దశలో 10 జట్ల సమరం....

ప్రపంచకప్ ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించిన మొత్తం 10 ( భారత్, ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, అఫ్ఘనిస్థాన్, దక్షిణాఫ్రికా ) జట్లు రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో తొమ్మిదేసి మ్యాచ్ లు ఆడనున్నాయి.

10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ దశలో భారత్ తన ప్రారంభమ్యాచ్ ను అక్టోబర్ 8న చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఐదుసార్లు విన్నర్ ఆస్ట్ర్రేలియాతో ఆడనుంది. అక్టోబర్ 11న అప్ఘనిస్థాన్, 14న పాకిస్థాన్, 19న బంగ్లాదేశ్, 22న న్యూజిలాండ్, 29న ఇంగ్లండ్, నవంబర్ 2న శ్రీలంక, 5న దక్షిణాఫ్రికా, నవంబర్ 12న నెదర్లాండ్స్ జట్లతో భారత్ పోటీపడ నుంది.

First Published:  30 Sep 2023 4:30 AM GMT
Next Story