Telugu Global
Sports

ఇంగ్లండ్ నాలుగో ఓటమి, సెమీస్ ఆశలు ఆవిరి!

వన్డే ప్రపంచకప్ లో చాంపియన్ ఇంగ్లండ్ పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగో ఓటమితో సెమీస్ అవకాశాలను చేజార్చుకొంది.

ఇంగ్లండ్ నాలుగో ఓటమి, సెమీస్ ఆశలు ఆవిరి!
X

వన్డే ప్రపంచకప్ లో చాంపియన్ ఇంగ్లండ్ పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగో ఓటమితో సెమీస్ అవకాశాలను చేజార్చుకొంది.

2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఘోరవైఫల్యాలు పతాకస్థాయికి చేరాయి. ఐదురౌండ్లలో నాలుగు పరాజయాలతో లీగ్ టేబుల్ అట్టడుగుకు పడిపోయింది. సెమీఫైనల్స్ నాకౌట్ బెర్త్ కు మరింత దూరమయ్యింది.

5 రౌండ్లలోనూ అదే వైఫల్యం....

ప్రస్తుత ప్రపంచకప్ ప్రారంభానికి ముందు హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా నిలిచిన ఇంగ్లండ్ టైటిల్ నిలుపుకోవాలన్న లక్ష్యంతో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగింది.

అయితే..తొలిరౌండ్లోనే గత టో్ర్నీ రన్నరప్ న్యూజిలాండ్ కొట్టిన దెబ్బతో తేరుకోలేకపోయింది. రెండోరౌండ్లో బంగ్లాదేశ్ పై నెగ్గినా మూడోరౌండ్లో అప్ఘనిస్థాన్, నాలుగోరౌండ్లో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయాలతో కృంగిపోయింది.

ప్రపంచ క్రికెట్లోని డేవిడ్ మలన్, జానీ బెయిర్ స్టో, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, మార్క్ వుడ్, మోయిన్ అలీ, అదీల్ రషీద్ లాంటి మేటి ఆటగాళ్లున్న ఇంగ్లండ్ జట్టు భారత పిచ్ లపైన దారుణంగా విఫలమయ్యింది. మొదటి నాలుగురౌండ్ల మ్యాచ్ ల్లో మూడు పరాజయాలతో ఆత్మవిశ్వాసం కోల్పోయింది.

సెమీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలంటే నెగ్గి తీరాల్సిన ఐదవ రౌండ్ పోరులో సైతం శ్రీలంక చేతిలో 8 వికెట్ల ఓటమితో కుదేలైపోయింది.

బట్లర్ సేనకు శ్రీలంక దెబ్బ!

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఐదవరౌండ్ పోరులో కీలక టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఇంగ్లండ్ 33.2 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది.

ఓపెనర్లు డేవిడ్ మలన్- జానీ బెయిర్ స్టో మొదటి వికెట్ కు 43 పరుగుల భాగస్వామ్యంతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చినా వరుసగా వికెట్లు కోల్పోతూ ఎదురీత మొదలు పెట్టింది.

మిడిలార్డర్లో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచినా 156 పరుగులకే పరిమితం కాక తప్పలేదు.

శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార 35 పరుగులిచ్చి 3 వికెట్లు, ఏంజెలో మాథ్యూస్ 14 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు.

ఇంగ్లండ్ బౌలర్ల వెలవెల....

శ్రీలంక బౌలర్లు చెలరేగిపోయిన పిచ్ పైన ఇంగ్లండ్ బౌలర్లు మాత్రం తేలిపోయారు.మ్యాచ్ నెగ్గాలంటే 50 ఓవర్లలో 157 పరుగులు చేయాల్సిన శ్రీలంకను కట్టడి చేయడంలో విఫలమయ్యారు.

ఓపెనర్ కుశల్ పెరెరా, వన్ డౌన్ కుశల్ మెండిస్ లను ఓపెనింగ్ బౌలర్ డేవిడ్ విల్లే పడగొట్టడంతో శ్రీలంక 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా..మూడో వికెట్ అజేయ భాగస్వామ్యంతో పుంజుకోగలిగింది.

నిస్సంకా 83 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులు, సమరవిక్రమ 54 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్ తో 65 పరుగులతో అజేయంగా నిలిచారు. మూడో వికెట్ కు 137 పరుగుల భాగస్వామ్యంతో 8 వికెట్ల విజయం అందించారు. పేస్ బౌలర్ లాహిరు కుమారకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఇంగ్లండ్ పై వరుసగా ఐదో గెలుపు...

2007 ప్రపంచకప్ నుంచి శ్రీలంక ప్రత్యర్థిగా ఇంగ్లండ్ కు ఇది వరుసగా ఐదో పరాజయం. 2007 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ ను 2 పరుగులతో అధిగమించిన శ్రీలంక 2011లో 10 వికెట్లు, 2015లో 9 వికెట్లు, 2019లో 20 పరుగులు, ప్రస్తుత ప్రపంచకప్ లో 8 వికెట్ల తేడాతో విజయాలు నమోదు చేసింది.

1996 ప్రపంచకప్ తరువాత నుంచి ఇంగ్లండ్ జట్టు వరుసగా మూడు మ్యాచ్ ల్లో పరాజయాలు పొందటం ఇదే మొదటిసారి.

ఈ విజయంతో మొదటి ఐదురౌండ్లలో 4 పాయింట్లు సాధించడం ద్వారా శ్రీలంక పాయింట్ల పట్టిక ఐదోస్థానంలో నిలిచింది. చాంపియన్ ఇంగ్లండ్ మాత్రం 5 రౌండ్లలో

4 పరాజయాలు, ఓ గెలుపుతో 2 పాయింట్లు మాత్రమే సాధించడం ద్వారా..10 జట్ల లీగ్ టేబుల్ ఆఖరి నుంచి రెండోస్థానంలో నిలువగలిగింది.

మిగిలిన నాలుగురౌండ్ల మ్యాచ్ ల్లోనూ ఇంగ్లండ్ భారీవిజయాలు సాధించినా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోడం అనుమానమే.

First Published:  27 Oct 2023 2:45 AM GMT
Next Story