Telugu Global
Sports

మహిళా టీ-20 ప్రపంచకప్ లో భారత్ కు షాక్!

టీ-20 మహిళా ప్రపంచకప్ గ్రూప్ లీగ్ లో భారత్ కు తొలి ఓటమి ఎదురయ్యింది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్ర్రేలియా అలవోకగా చేరుకొంది.

మహిళా టీ-20 ప్రపంచకప్ లో భారత్ కు షాక్!
X

టీ-20 మహిళా ప్రపంచకప్ గ్రూప్ లీగ్ లో భారత్ కు తొలి ఓటమి ఎదురయ్యింది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్ర్రేలియా అలవోకగా చేరుకొంది.

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళా టీ-20 ప్రపంచకప్ గ్రూప్ లీగ్ లో భారత్ కు తొలిదెబ్బ తగిలింది. ప్రారంభ రౌండ్లలో పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లను చిత్తు చేసి సెమీస్ దిశగా సాగుతున్న భారత్ జోరుకు ఇంగ్లండ్ బ్రేక్ వేసింది.

చేజింగ్ లో భారత్ ఫ్లాప్...

గత టీ-20 ప్రపంచకప్ లో భారత్ చేతిలో ఓటమితో ఫైనల్స్ చేరుకోడంలో విఫలమైన ఇంగ్లండ్..ప్రస్తుత ప్రపంచకప్ గ్రూపులీగ్ లో బదులు తీర్చుకొంది. 11 పరుగుల తేడాతో భారత్ ను కంగు తినిపించడం ద్వారా టాపర్ గా నిలిచింది.

కేప్ టౌన్ వేదికగా జరిగిన ఈ పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 151 పరుగులు స్కోరు నమోదు చేసింది.

మిడిలార్డ‌ర్ ప్లేయర్ సీవ‌ర్ బ్రంట్ .. ఫైటింగ్ హాఫ్ సెంచ‌రీ, అమీ జోన్స్ 40 పరుగుల స్కోర్లతో తమజట్టును ఆదుకొన్నారు. అమీ జోన్స్‌(26)తో క‌లిసి సీవ‌ర్‌ ఐదో వికెట్‌కు 38 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేసింది.

భారత స్వింగ్ బౌలర్ రేణుకా సింగ్ పవర్ ప్లే ఓవర్లలో చెలరేగిపోయింది. మూడు టాపార్డర్ వికెట్లు నష్టపోయిన ఇంగ్లండ్ ఆత్మరక్షణలో పడింది. దీంతో నాట్ సీవ‌ర్ బ్రంట్ , హీథర్ నైట్ తమ జ‌ట్టును ఆదుకున్నారు. దూకుడుగా ఆడుతూ స్కోర్‌బోర్డును ప‌రుగులు పెట్టించారు. మ‌రో వికెట్ ప‌డ‌కుండా చూసుకుంటూనే వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా బౌండరీలు బాదారు. మూడో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం జోడించారు. రేణుకా సింగ్ ఐదు వికెట్లు తీసింది.

రేణుక సరికొత్త రికార్డు..

టీ-20 ప్రపంచకప్ లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత పేసర్ గా రేణుకాసింగ్ నిలిచింది. ఇప్పటి వరకూ ప్రియాంకా రాయ్ పేరుతో ఉన్న రికార్డును రేణుక అధిగమించింది. రేణుక తన కోటా నాలుగు ఓవ‌ర్ల‌లో కేవ‌లం 15 ప‌రుగులకే 5 వికెట్లు సాధించింది.

2009 ప్ర‌పంచ‌క‌ప్‌లో ప్రియాంక పాకిస్థాన్‌పై ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. అయితే.. ఆమె 3.5 ఓవ‌ర్ల‌లో 16 ర‌న్స్ ఇచ్చి 5 వికెట్లు తీసింది. 15 ర‌న్స్‌కే ఐదు వికెట్లు తీసిన రేణుక‌, ప్రియాంక రికార్డును బ్రేక్ చేసింది.

ప‌వ‌ర్ ప్లేలో మూడు వికెట్లు ప‌డ‌గొట్టింది. తొలి ఓవ‌ర్ మూడో బంతికి ఓపెన‌ర్ వ్యాట్‌ను ఔట్ చేసింది. అప్పటికే షాక్‌లో ఉన్న ఇంగ్లండ్‌ను త‌న రెండో ఓవ‌ర్‌లో మ‌ళ్లీ దెబ్బ కొట్టింది. క్యాప్సేను బౌల్డ్‌ చేసింది. మూడో ఓవ‌ర్‌లో డంక్లేను బౌల్డ్ చేసి ఆ జట్టును మ‌రింత క‌ష్టాల్లోకి నెట్టింది. 19వ ఓవ‌ర్‌లో నాలుగో బంతికి అమీ జోన్స్‌ను వెన‌క్కి పంపింది. ఆ త‌ర్వాత బంతికే క్యాథెరిన్ సీవ‌ర్ బ్రంట్‌ను ఔట్ చేసి హ్యాట్రిక్‌పై నిలిచింది. అయితే.. చివ‌రి బంతికి బైస్ రూపంలో నాలుగు ప‌రుగులు వ‌చ్చాయి. దాంతో రేణుక హ్యాట్రిక్ మిస్ అయింది.

స్మృతి, రిచా పోరాటం వృథా..

మ్యాచ్ నెగ్గాలంటే 152 పరుగులు చేయాల్సిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల న‌ష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారీ టార్గెట్ ఛేద‌న‌లో డాషింగ్ ఓపెన‌ర్ ష‌ఫాలీ వ‌ర్మ (8) స్వ‌ల్ప స్కోర్‌కే వెనుదిరిగింది. దాంతో 29 ప‌రుగుల వ‌ద్ద ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆ త‌ర్వాత మంధాన జ‌ట్టును గెలిపించే బాధ్య‌త తీసుకుంది. సిక్స‌ర్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ఆమె ఆ త‌ర్వాతి బంతికే ఔట్ అయింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడిన జెమీమా రోడ్రిగ్స్ (13) విఫ‌లం అయింది. కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ (4), దీప్తి శ‌ర్మ (7) నిరాశ ప‌రిచారు.

స్టార్ ఓపెన‌ర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీ సాధించినా ప్రయోజనం లేకపోయింది. జట్టు స్కోర్ 105 వద్ద స్మృతి అవుయ్యింది. అప్పుడే ఇంగ్లండ్ విజ‌యం దాదాపు ఖాయమైపోయింది. అయితే.. రీచా ఘోష్ (47) పోరాడినా తన జట్టును విజేతగా నిలుపలేకపోయింది. ఇంగ్లండ్ బౌలర‌ల్లో సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ బెల్ త‌లా ఒక వికెట్ తీశారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన నాట్ సీవ‌ర్ బ్రంట్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

ప్రపంచకప్ లో భారత్ పై ఇంగ్లండ్ కు ఇది ఆరో విజ‌యం. గ్రూప్ లీగ్ లో వ‌రుస‌గా మూడు విజ‌యాల‌తో ఇంగ్లండ్ టాపర్ గా సెమీస్ లో చోటు ఖాయం చేసుకోగలిగింది.

భారత్ తన ఆఖరి గ్రూప్ లీగ్ పోరులో ఐర్లాండ్ ను భారీతేడాతో ఓడించగలిగితే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగలుగుతుంది.

సెమీస్ లో ఆస్ట్ర్రేలియా....

డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్ర్రేలియా గ్రూప్ -1 లీగ్ నుంచి సెమీస్ కు చేరుకొంది. గ్రూపు లీగ్ లో వరుసగా మూడో విజయంతో నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.

సెయింట్ జార్జి పార్క్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడోరౌండ్ పోరులో మరో 21 బంతులు మిగిలి ఉండగానే టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా 6 వికెట్ల విజయం నమోదు చేసింది.

125 పరుగుల విజయలక్ష్యా్న్ని ఆస్ట్ర్రేలియా 4 వికెట్ల నష్టానికే సాధించగలిగింది. ఒక దశలో 40 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లు నష్టపోయిన ఆస్ట్రేలియాను

తహ్లియా మెక్ గ్రాత్- యాష్లీగా గార్డర్ 81 పరుగుల కీలక భాగస్వామ్యంతో ఆదుకొన్నారు.

తహ్లియా మెక్ గ్రాత్ 33 బాల్స్ లో 57 పరుగుల స్కోరు సాధించింది. 29 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసింది. ఆల్ రౌండర్ గార్డ్నర్ 29 బంతుల్లో 28 పరుగులతో అజేయంగా నిలిచింది.

వరుసగా మూడో విజయంతో ఆస్ట్ర్రేలియా సెమీస్ చేరుకోగా..ఆతిథ్య దక్షిణాఫ్రికా మూడురౌండ్లలో రెండో ఓటమి పొంది..సెమీస్ బెర్త్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకొంది.

ఆఖరి రౌండ్లో బంగ్లాదేశ్ ను ఓడించగలిగితేనే సెమీస్ చేరే అవకాశాలుంటాయి.

Next Story