Telugu Global
Sports

నేడే ప్రపంచకప్ సెమీస్ సమరం, ఫైనల్ కు భారత్ గురి!

2023 ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ నాకౌట్ పోరుకు కేప్ టౌన్ లోని న్యూల్యాండ్ స్టేడియం వేదికగా కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఈ రోజు జరిగే తొలి సెమీఫైనల్లో గత టోర్నీ విన్నర్ ఆస్ట్రేలియా, రన్నరప్ భారత్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.

నేడే ప్రపంచకప్ సెమీస్ సమరం, ఫైనల్ కు భారత్ గురి!
X

ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ ఫైనల్లో చోటు కోసం టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్ర్లేలియాతో నాలుగో ర్యాంకర్ భారత్ పోటీపడుతోంది. కేప్ టౌన్ వేదికగా ఈ రోజు జరిగే నాకౌట్ పోరులో డార్క్ హార్స్ హోదాలో భారత్ బరిలోకి దిగుతోంది...

2023 ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ నాకౌట్ పోరుకు కేప్ టౌన్ లోని న్యూల్యాండ్ స్టేడియం వేదికగా కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఈ రోజు జరిగే తొలి సెమీఫైనల్లో గత టోర్నీ విన్నర్ ఆస్ట్రేలియా, రన్నరప్ భారత్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.

హాట్ ఫేవరెట్ గా కంగారూ టీమ్...

మహిళా టీ-20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధికసార్లు విజేతగా నిలవడంతో పాటు టాప్ ర్యాంక్ జట్టుగా ఉన్న ఆస్ట్ర్రేలియా ఈరోజు భారత్ తో జరిగే తొలిసెమీస్ లో హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది.

గ్రూప్-1 లీగ్ లో నాలుగుకు నాలుగుమ్యాచ్ లు నెగ్గడం ద్వారా సెమీస్ లో అడుగుపెట్టిన కంగారూ టీమ్..పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ తో భీకరంగా కనిపిస్తోంది.

ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, నలుగురు స్పిన్నర్లు, నలుగురు పేస్ బౌలర్లతో అత్యంత సమతూకంతో ఉంది.

మరోవైపు.. గ్రూప్‌-2 లీగ్ లో మూడు విజయాలతో రెండో స్థానంలో నిలవడం ద్వారా గతటోర్నీ రన్నరప్ భారత్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. లీగ్‌ దశలో పాకిస్థాన్‌, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌పై విజయాలు సాధించినా..బ్యాటింగ్ వైఫల్యంతో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి చవిచూడక తప్పలేదు.

వరుసగా మూడోసారి సెమీస్ లో భారత్..

గత మూడు ప్రపంచకప్ టోర్నీలలో వరుసగా మూడుసార్లు సెమీస్ చేరి..ఓసారి ఫైనల్స్ కు అర్హత సాధించిన భారతజట్టులో ఓపెనింగ్ జోడీ షెఫాలీవర్మ, స్మృతి మందన,

రిచా ఘోష్, జెమీమా రోడ్రిగేజ్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ఆల్ రౌండర్ దీప్తి శర్మ పూర్తిస్థాయిలో రాణించగలిగితేనే..ఆస్ట్ర్రేలియాకు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది.

బర్మింగ్ హామ్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ లో ఆస్ట్ర్రేలియా చేతిలో కంగు తిన్న భారత్..ఆ తర్వాత జరిగిన ఐదుమ్యాచ్ ల సిరీస్ లో సైతం 1-4 తో పరాజయం చవిచూడాల్సి వచ్చింది.

గత ఐదేళ్లుగా అంతర్జాతీయ టీ-20 క్రికెట్లో తిరుగులేని జట్టుగా పేరున్న ఆస్ట్ర్రేలియా..భారత్ ప్రత్యర్థిగా పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డు చూస్తే.. ఇప్పటి వరకు జరిగిన 30 టీ-20 మ్యాచ్‌ల్లో కంగారూలు 22 మ్యాచ్‌లు నెగ్గగా.. భారత్ ఆరు విజయాలు మాత్రమే నమోదు చేయగలిగింది.

ఆస్ట్ర్రేలియా 22-6 రికార్డుతో మరోసారి భారత్ ను ఎదుర్కొనబోతోంది.

అప్పుడూ..ఇప్పుడూ...

2022 టీ-20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్ర్రేలియాతో తలపడిన భారతజట్టులోని ఎనిమిది మంది సభ్యులు..ప్రస్తుత 2023 జట్టులో సైతం కొనసాగటం సానుకూల అంశంగా కనిపిస్తోంది.

షెఫాలీ, రిచా అప్పుడు జూనియర్లు కాగా.. ప్రస్తుత భారతజట్టులో కీలక బ్యాటర్లుగా ఉన్నారు. అప్పుడు కెప్టెన్ గా వ్యవహరించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ప్రస్తుత జట్టుకు సైతం నాయకత్వం వహిస్తోంది. వైస్‌ కెప్టెన్‌ స్మృతి మందనపైన భారీ అంచనాలున్నాయి.

సెమీస్‌ పోరు కోసం తగిన వ్యూహాలతో సిద్ధంగా ఉన్నామని భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ ప్రకటించింది. మొదట బ్యాటింగ్‌ చేసే అవకాశం వస్తే 180కి పైగా స్కోరు సాధించడం ద్వారా కంగారూలపై ఒత్తిడి పెంచుతూ స్పిన్ బౌలింగ్ తో దాడి చేస్తామని తెలిపింది.

అయితే..ఆస్ట్ర్రేలియాజట్టులో బ్యాటింగ్ ఆర్డర్లోని మొదటి పదిమంది ధాటిగా ఆడగల సత్తా ఉన్నవారేనని గుర్తు చేసింది. ముందుగా బౌలింగ్ చేసే అవకాశం వస్తే మాత్రం..కంగారూలను 140-150 పరుగుల మధ్య కట్టడి చేస్తే మ్యాచ్‌ సొంతమైనట్లేనని ధీమాగా చెబుతోంది.

గత ఐదుసంవత్సరాలలో ప్రత్యర్థికి ఆస్ట్రేలియా 8 సార్లు మాత్రమే 160 కి పైగా స్కోర్లు చేసే అవకాశమిచ్చింది. అందులో భారతజట్టు మాత్రమే ఐదుసార్లు 160కి పైగా స్క్రోర్లు సాధించిన ఏకైకజట్టుగా నిలిచింది.

2021 ఏప్రిల్ నుంచి ఆస్ట్ర్రేలియా ఆడిన 21 టీ-20 మ్యాచ్ ల్లో ఓడిన ఒకే ఒక్కమ్యాచ్ భారత్ చేతిలోనే కావడం విశేషం. 2016 టీ-20 ప్రపంచకప్ నుంచి ఆస్ట్ర్రేలియాపై రెండు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీలలో నెగ్గిన జట్టుగా భారత్ నిలిచింది. 2018, 2020 ప్రపంచకప్ గ్రూప్ లీగ్ దశలో కంగారూలను కంగు తినిపించిన ఘనత భారత్ కు మాత్రమే దక్కుతుంది.

భారత్ ప్రమాదకరమైన ప్రత్యర్థి- లానింగ్

భారత్ పై ఫేస్ టు ఫేస్ రికార్డుల్లో తమదే పైచేయిగా కనిపిస్తున్నా అత్యంత ప్రమాదకరమైన ప్రత్యర్థిగా పరిగణిస్తున్నట్లు ఆస్ట్ర్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ చెప్పింది.

భారత బ్యాటింగ్ ఆర్డర్ గతంలో కంటే బలంగా కనిపిస్తోందని, తమ బౌలర్లకు చేతినిండాపనేనని కంగారూ కెప్టెన్ తెలిపింది.

స్పిన్ బౌలింగ్ కు అనువుగా ఉండే న్యూల్యాండ్స్ పిచ్ పైన 160 నుంచి 180 స్కోర్లు సాధించినజట్టుకే విజయావకాశాలు ఉంటాయని వివరించింది.

ఆల్ రౌండర్ ఎల్సీ పెర్రీ, మేఘాన్ షుట్ ఆస్ట్ర్రేలియా బౌలింగ్ ఎటాక్ కు కీలకం కానున్నారు.

ఆస్ట్ర్రేలియా లాంటి పవర్ ఫుల్ జట్టును అధిగమించాలంటే హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు సర్వశక్తులూ కూడదీసుకొని..బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అంశాలలో అత్య్తుత్తమంగా రాణించక తప్పదు. లేదంటే ..భారతజట్టు మరోసారి పెద్దజట్టలో చిన్నజట్టుగా..చిన్నజట్లలో పెద్దజట్టుగా మిగిలిపోక తప్పదు.

First Published:  23 Feb 2023 5:37 AM GMT
Next Story