Telugu Global
Sports

హేలీ పరుగుల కేళీ..బెంగళూరు నాలుగో ఓటమి!

మహిళా ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వరుసగా నాలుగో ఓటమి చవిచూసింది.

హేలీ పరుగుల కేళీ..బెంగళూరు నాలుగో ఓటమి!
X

మహిళా ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వరుసగా నాలుగో ఓటమి చవిచూసింది. యూపీ వారియర్స్ 10 వికెట్ల తేడాతో బెంగళూరును మట్టి కరిపించింది...

ప్రారంభ మహిళా ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ లో స్మృతి మందన నాయకత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఐదుజట్ల లీగ్ లో ఆడిన నాలుగుకు నాలుగుమ్యాచ్ ల్లోనూ ఓడి..లీగ్ టేబుల్ ఆఖరిస్థానానికి పడిపోయింది.

ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరిగిన ఏకపక్ష పోరులో ముందుగా టాస్ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకొన్న బెంగళూరు జట్టు 19.3 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది.

అత్యంత ఖరీదైన ప్లేయర్, బెంగళూరు కెప్టెన్ స్మృతి మందన కేవలం 4 పరుగులకే వెనుదిరిగింది. టాపార్డర్ బ్యాటర్లు సోఫియా డివైన్‌ (36), ఆల్ రౌండర్ఎలీసా పెర్రీ (39 బంతుల్లో 52; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకం సాధించడం మినహా మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు.

యూపీ స్పిన్ జోడీ షో...

యూపీ వారియర్స్ స్పిన్ బౌలర్ల జోడీ సోఫియా ఎకెల్‌స్టోన్‌ , దీప్తి శర్మలను బెంగళూరు బ్యాటర్లు దీటుగా ఎదుర్కొనడంలో విఫలమయ్యారు. లెఫ్టామ్ స్పిన్నర్ సోఫియా తన కోటా 4 ఓవర్లలో 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం ద్వారా బెంగళూరును ఆలౌట్ చేయడంలో ప్రధానపాత్ర వహించింది.మరో స్పిన్నర్ దీప్తి శర్మ 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 3మూడు వికెట్లు సాధించింది. చివరకు బెంగళూరు ఇన్నింగ్స్ 138 పరుగులకే ముగిసింది.

అలీసా హేలీ ధూమ్ ధామ్ బ్యాటింగ్...

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 139 పరుగులు చేయాల్సిన యూపీ వారియర్స్ కు ఓపెనింగ్ జోడీ అజేయ సెంచరీ భాగస్వామ్యంతో కేవలం 13 ఓవర్లలోనే 10 వికెట్ల విజయం అందించారు.

యూపీ కెప్టెన్ అలీసా హేలీ 46 బంతుల్లో 18 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 96 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచింది. సెంచరీకి 4 పరుగుల దూరంలో నిలిచింది. ప్రస్తుత మహిళా ఐపీఎల్ లో అలీసా సాధించిన 96 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.

ఇన్నింగ్స్ మొదటి 6 ఓవర్లలోనే యూపీ ఓపెనింగ్ జోడీ 55 పరుగులు దండుకోగలిగారు. బెంగళూరు ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ తన రెండు ఓవర్లలో 24 పరుగులు, మీడియం పేసర్ కోమల్ జాన్ జాద్ 2 ఓవర్లలో 22 పరుగులు ఇవ్వడంతో యూపీ పరుగుల వేట మెరుపువేగంతో సాగిపోయింది. బెంగళూరు బౌలర్లలో ఏ ఒక్కరూ ప్రభావం చూపలేకపోయారు.

ప్రస్తుత టోర్నీ మొదటి మూడుమ్యాచ్ ల్లో బెంగళూరు బౌలర్లు ప్రత్యర్థిజట్లకు 200కు పైగా స్కోర్లు సాధించే అవకాశమివ్వడం ద్వారా అత్య్తంత చెత్త బౌలింగ్ జట్టుగా అపప్రదను మూటగట్టుకొన్నారు.

చివరకు స్టార్ మీడియం పేసర్ ఎలీసా పెర్రీ సైతం చేష్టలుడిగిపోడం విశేషం.

యూపీ మరో ఓపెనర్ దేవిక వైద్య 5 బౌండ్రీలతో 36 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచింది. యూపీ విజయంలో ప్రధానపాత్ర వహించిన కెప్టెన్ హేలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ప్రస్తుత రౌండ్ రాబిన్ లీగ్ లో యూపీ వారియర్స్‌ కు ఇది రెండో గెలుపు కాగా..బెంగళూరుకు వరుసగా నాలుగో ఓటమి.

ఓటమికి నాదే బాధ్యత- స్మృతి మందన...

ప్రస్తుత టోర్నీలో తమకు ఏదీ కలసి రావడంలేదని, సమతూకంతో కూడిన జట్టు కోసం ఎన్ని మార్పులు చేసినా తగిన ఫలితం కనిపించడం లేదంటూ..నాలుగో ఓటమి అనంతరం బెంగళూరు కెప్టెన్ స్మృతి మందన వాపోయింది.

మహిళా ఐపీఎల్ వేలంలో అత్యధికంగా 3 కోట్ల 40 లక్షల రూపాయల రికార్డు ధరతో పాటు బెంగళూరుజట్టు పగ్గాలు అందుకొన్న స్మృతి మందన..ఓపెనర్ గాను విఫలం కావడం జట్టు అవకాశాలను దెబ్బతీస్తోంది.

జట్టు విజేతగా నిలవాలంటే ఓపెనర్లు ఇచ్చే ఆరంభం అత్యంత కీలకమని, ఓపెనర్ గా తాను సైతం విఫలంకావడం నిరాశను కలిగిస్తోందని, వరుసగా నాలుగు పరాజయాలకు బాధ్యత తనదేనని ప్రకటించింది.

First Published:  11 March 2023 3:45 AM GMT
Next Story