Telugu Global
Sports

భారత్ కు ఆరేళ్ల తర్వాత పాక్ షాక్!

మహిళా టీ-20 ఆసియాకప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ కు అనుకోని పరాజయం ఎదురయ్యింది. గత ఆరేళ్లలో తొలిసారిగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమి చవిచూసింది.

భారత్ కు ఆరేళ్ల తర్వాత పాక్ షాక్!
X

మహిళా టీ-20 ఆసియాకప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ కు అనుకోని పరాజయం ఎదురయ్యింది. గత ఆరేళ్లలో తొలిసారిగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమి చవిచూసింది....

బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న 2022 మహిళా ఆసియాకప్ టీ-20 టోర్నీలో సంచలనాల పరంపర కొనసాగుతోంది. ఆరుజట్ల ఈ రౌండ్ రాబిన్ లీగ్ పోరులో పాకిస్థాన్ పై పసికూన థాయ్ లాండ్ సంచలన విజయం సాధించిన కొద్ది గంటల వ్యవధిలోనే సిల్హౌట్ వేదికగా జరిగిన మరోపోరులో హాట్ ఫేవరెట్ భారత్ ను పాకిస్థాన్ కంగు తినిపించింది.

Advertisement

ప్రయోగాలతోచేతులు కాల్చుకొన్న భారత్...

ప్రస్తుత ఆసియాకప్ టోర్నీలో హాట్ ఫేవెరట్ గా బరిలోకి దిగిన హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో...ప్రయోగాలకు పోయి చేజేతులా ఓటమి కొనితెచ్చుకొంది.

ప్రారంభ రౌండ్లలో శ్రీలంక, మలేసియాజట్లను చిత్తు చేసిన భారత్..లీగ్ మూడోమ్యాచ్ లో మాత్రం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో అనూహ్య పరాజయం చవిచూడాల్సి వచ్చింది.

Advertisement

ప్రత్యర్థి పాకిస్థాన్ కంటే ఎన్నో రెట్లు బలమైన జట్టుగా పేరుపొందిన భారత్ నిర్లక్ష్యం, మితిమీరిన ఆత్మవిశ్వాసాలకు తగిన మూల్యమే చెల్లించింది. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయటం, సీనియర్ ప్లేయర్లు నిర్లక్ష్యపు షాట్లు ఆడటం భారత్ పరాజయానికి కారణాలుగా నిలిచాయి.

2016 తర్వాత ఇదే తొలి ఓటమి....

మహిళా క్రికెట్లో పాకిస్థాన్ ప్రత్యర్థిగా 2016 తర్వాత నుంచి ఓటమి అంటే ఏమిటో తెలియని భారత్ 2022 ఆసియాకప్ టోర్నీలో మాత్రం 13 పరుగుల పరాజయంత కంగుతినాల్సి వచ్చింది.

ఈమ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగుల స్కోరు సాధించింది. నిదా దర్ 37 బాల్స్ లో 56 పరుగుల నాటౌట్ తో టాప్ స్కోరర్ గా నిలిచింది.కెప్టెన్ బిస్మా మారూఫ్ 35 బాల్స్ లో 32 పరుగులతో కీలక భాగస్వామ్యం నమోదు చేసింది.

138 పరుగుల స్వల్పలక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్ 19.4 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూలింది. ఒకదశలో 65 పరుగులకే 6 టాపార్డర్ వికెట్లు కోల్పోయిన భారత్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా 19 బాల్స్ లో 17 పరుగులకే ఓ చెత్తషాట్ తో తన వికెట్ ను అప్పజెప్పింది.

ఆల్ రౌండర్ పూజా వస్త్రకర్ రనౌట్ కావడంతో భారత్ విజయావకాశాలు అడుగంటిపోయాయి.

న్యూఢిల్లీ వేదికగా ముగిసిన 2016 ప్రపంచకప్ పోరులో భారత్ ను కంగుతినిపించిన పాక్ జట్టు..మరో విజయం కోసం 2022 ఆసియాకప్ వరకూ వేచిచూడాల్సి వచ్చింది.

హేమలత 22 బాల్స్ లో 20 పరుగులతో జోరుగా ఆడినా ప్రయోజనం లేకపోయింది. బ్యాటింగ్ ఆర్డర్ 7వ స్థానంలో వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తక్కువ స్కోరుకే అవుట్ కావడం జట్టు విజయావకాశాలను మరింతగా దెబ్బతీసింది.

ప్రయోగాలతో దెబ్బతిన్నాం...హర్మన్..

పాకిస్థాన్ చేతిలో ఈ అనూహ్య ఓటమికి తాము బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన ప్రయోగాలే ప్రధాన కారణమని పరాజయం అనంతరం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వాపోయింది.

జట్టులోని యువబ్యాటర్లకు తగిన అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేశామని..అయితే..పాక్ ప్రత్యర్థిగా ఒత్తిడిని ఎదుర్కొనలేకపోయారని చెప్పింది.

ఆఖరి ఆరు ఓవర్లలో 61 పరుగులు చేయాల్సిన తమజట్టు లక్ష్యం చేరుకోలేకపోయిందని వివరించింది. రిచా ఘోష్ 13 బాల్స్ లో 26 పరుగులు చేసినా విఫలం కాక తప్పలేదు.

పాకిస్థాన్ ప్రత్యర్థిగా 10 విజయాలు 2 పరాజయాల రికార్డుతో ఉన్న భారత్..ఆసియాకప్ మిగిలిన మ్యాచ్ ల్లో దూకుడుగా ఆడటం ద్వారా విజేతగా నిలువగలమన్న ధీమాతో ఉంది.

Next Story