Telugu Global
Sports

మహిళా ఐపీఎల్ తో బీసీసీఐకి డబ్బేడబ్బు!

బీసీసీఐ రొట్టెవిరిగి మరోసారి నేతిలో పడింది. మహిళా ఐపీఎల్ ఫ్రాంచైజీల వేలం ద్వారా 4 వేల 669 కోట్ల రూపాయల మొత్తం ఆర్జించింది.

మహిళా ఐపీఎల్ తో బీసీసీఐకి డబ్బేడబ్బు!
X

బీసీసీఐ రొట్టెవిరిగి మరోసారి నేతిలో పడింది. మహిళా ఐపీఎల్ ఫ్రాంచైజీల వేలం ద్వారా 4 వేల 669 కోట్ల రూపాయల మొత్తం ఆర్జించింది.

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు..ఐపీఎల్ షోతో వేల కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. భారత క్రికెట్ నిత్యకల్యాణం పచ్చతోరణంలా వెలిగిపోతోంది.

గత 15 సీజన్లుగా ఐపీఎల్ ను అత్యంత విజయవంతంగా నిర్వహించడం ద్వారా క్రికెటర్లను కుబేరులుగా మార్చిన బీసీసీఐ..మహిళా క్రికెటర్ల జీవితాలను సైతం మార్చేయాలని నిర్ణయించింది.

అందులో భాగంగా..2023 మహిళా ఐపీఎల్ ప్రారంభ సీజన్ కోసం నగారా మోగించింది. ప్రసారహక్కులు, ఫ్రాంచైజీల బిడ్ల ద్వారా కళ్లు చెదిరే మొత్తాలను సంపాదించింది.

మొత్తం ఐదు ఫ్రాంచైజీల ( అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో ) వేలం కోసం సీల్డ్ కవర్ బిడ్లను ఆహ్వానించిన ఐపీఎల్ బోర్డుకు ఊహించనంత ఆదాయం వచ్చింది.

మొత్తం ఐదు జట్ల కోసం ఐదేళ్లకు గాను 4వేల 669. 99 కోట్ల రూపాయల ధరపలికింది. రకరకాల వ్యాపారాల నుంచి మీడియా సంస్థల వరకూ తన ధనబలంతో కబళిస్తూ వస్తున్న అదానీగ్రూపు కన్ను చివరకు మహిళా ఐపీఎల్ పైనా పడింది.

అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కోసం అదానీ స్పోర్ట్స్ లైన్ సంస్థ రికార్డుస్థాయిలో 1289 కోట్ల రూపాయలతో బిడ్ వేసి విజేతగా నిలిచింది. ముంబై ఫ్రాంచైజీ హక్కులను ఇండియావిన్ సంస్థ 912.99 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొంది.

రాయల్ చాలెంజర్స్ సంస్థ బెంగళూరు ఫ్రాంచైజీ కోసం 901 కోట్ల రూపాయలు, ఢిల్లీ , లక్నో ఫ్రాంచైజీల కోసం 810 కోట్ల రూపాయలు, 757 కోట్ల రూపాయలు ధరపలికింది.

బెంగళూరు ఫ్రాంచైజీ యజమానిగా రాయల్ చాలెంజర్స్ ప్రయివేట్ లిమిటెడ్, ఢిల్లీ ఫ్రాంచైజీ ఓనర్ గా జెఎస్ డబ్లు జిఎమ్మార్ క్రికెట్ ప్రయివేట్ లిమిటెడ్, లక్నో ఫ్రాంచైజీకి కాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్ వ్యవహరిస్తాయి.

2008 నుంచి 2023 వరకూ..

2008లో పురుషులకు ఐపీఎల్ ను ప్రారంభించిన బీసీసీఐ..గత 15 సీజన్లుగా కాసుల పంట పండించుకొంటూనే వస్తోంది. 8 జట్ల నుంచి 10 జట్లకు ఐపీఎల్ ను విస్తరించింది.

అంతటితో ఆగకుండా మహిళలకూ ఐపీఎల్ ను నిర్వహించాలన్న నిర్ణయం జాక్ పాట్ లా మారింది. వచ్చే ఐదు సంవత్సరాలకు ఫ్రాంచైజీల హక్కుల విక్రయం ద్వారా

4వేల 699. 99 కోట్లు ఆర్జించిన బోర్డు..ప్రసారహక్కుల విక్రయం ద్వారానూ గణనీయంగానే సంపాదించింది.

ప్రసారహక్కుల ద్వారా...

మ‌హిళా ఐపీఎల్ మీడియా హ‌క్కుల‌ను ముఖేశ్ అంబానీకి చెందిన వైకొమ్ 18 మీడియా సంస్థ ద‌క్కించుకుంది. వ‌చ్చే ఐదేళ్ల కాలానికి ఈ సంస్థ మీడియా ప్ర‌సార హ‌క్కుల‌ను రూ.951 కోట్ల ధరకు కైవసం చేసుకొంది. ఒక్కో మ్యాచ్‌కు రూ.7.09 కోట్లు చెల్లించ‌నుంది. పురుషుల జ‌ట్టుతో స‌మాన వేతనం త‌ర్వాత‌.. మ‌హిళ‌ల క్రికెట్‌కు మ‌హర్ద‌శ‌కు ఇదే అతిపెద్ద, కీల‌క‌మైన అడుగు.

2023-2027 వ‌ర‌కు మ‌హిళ‌ల ఐపీఎల్ హ‌క్కులను బీసీసీఐ, వైకొమ్ సంస్థ‌కు క‌ట్ట‌బెట్ట‌నుంది. మార్చి 5 నుంచి 23వ‌ర‌కు మ‌హిళ‌ల ఐపీఎల్ తొలి సీజ‌న్ జ‌ర‌గ‌నుంది. సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ఉన్న మ‌హిళా క్రికెట‌ర్ల‌కు రూ. 50 లక్ష‌లు, రూ. 40 ల‌క్ష‌లు, రూ.30 ల‌క్ష‌ల బేస్ ప్రైజ్, మిగ‌తావాళ్ల‌కు రూ. 20 ల‌క్ష‌లు, రూ. 10 ల‌క్ష‌లు క‌నీస ధ‌రను బీసీసీఐ ప్ర‌క‌టించింది.

త్వరలోనే క్రికెటర్ల వేలం కార్యక్రమం సైతం జరుగనుంది.Next Story