Telugu Global
Sports

సంజు శాంసన్ కు ఆసియాకప్ బెర్త్ దక్కేనా?

ఆసియాకప్ లో పాల్గొనే భారతజట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కు చోటు దక్కడం గాల్లో దీపంలా మారింది. కెఎల్ రాహుల్ ఫిట్ నెస్ పైనే సంజు ఎంపిక ఆధారపడి ఉంది.

సంజు శాంసన్ కు ఆసియాకప్ బెర్త్ దక్కేనా?
X

ఆసియాకప్ లో పాల్గొనే భారతజట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కు చోటు దక్కడం గాల్లో దీపంలా మారింది. కెఎల్ రాహుల్ ఫిట్ నెస్ పైనే సంజు ఎంపిక ఆధారపడి ఉంది.

ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహకంగా ఆగస్టు 30నుంచి జరిగే 2023 ఆసియాకప్ కు భారతజట్టు ఎంపికపై ఊహాగానాలు జోరుగాసాగిపోతున్నాయి. క్రికెట్ విశ్లేషకులు, భారత మాజీ క్రికెట్ దిగ్గజాలు ఎవరికి తోచినరీతిలో వారు తమతమ జట్లను ప్రకటించడం ద్వారా గందరగోళం సృష్టిస్తున్నారు.

పాకిస్థాన్, శ్రీలంక దేశాల సంయుక్త ఆతిథ్యంలో ఈనెల ఆఖరివారం నుంచి జరుగనున్న ఆసియాకప్ ను తిరిగి వన్డే ఫార్మాట్లో నిర్వహించబోతున్నారు. ఇప్పటికే పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ తమజట్లను ప్రకటించగా...భారత్, శ్రీలంక తమజట్లను ప్రకటించాల్సి ఉంది.

ఆగస్టు 20న భారతజట్టు ఎంపిక...

ఆసియాకప్ లో పాల్గొనే రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టును ఆగస్టు 20న బీసీసీఐ ఎంపిక సంఘం ఎంపిక చేయనుంది. వెన్నెముక గాయాలతో గత కొద్దిమాసాలుగా జట్టుకు దూరమైన పేసర్ జస్ ప్రీత్ బుమ్రా, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తో పాటు కాలిమడమ గాయంతో దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ సైతం పూర్తిగా కోలుకొని జట్టుకు అందుబాటులోకి వచ్చారు.

ఐర్లాండ్ తో శుక్రవారం ప్రారంభంకానున్న తీన్మార్ టీ-20 సిరీస్ లో భారతజట్టుకు నాయకత్వం వహిస్తున్న ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా..ఆసియాకప్ లో పాల్గొనే భారతజట్టులో చోటు దక్కించుకోడం ఖాయమైపోయింది.

అయితే..వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మాత్రం మ్యాచ్ ఫిట్ నెస్ ను చాటుకోవాల్సి ఉంది.

రాహుల్ ఫిట్టయితే సంజూ అవుట్...

భారత ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్ గా రాహుల్ పూర్తి ఫిట్ నెస్ తో జట్టుకు అందుబాటులోకి వస్తే సంజు శాంసన్ ఆసియాకప్ ఆశలు ఆవిరైపోయినట్లే. దానికి తోడు..వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆడిన రెండువన్డేలు, మూడు టీ-20 మ్యాచ్ ల్లో సంజు స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు.

వెస్టిండీస్ తో ఆడిన రెండువన్డేలలో సంజు 9, 51 స్కోర్లు సాధించగా..టీ-20 సిరీస్ లో మాత్రం 12, 7, 13 స్కోర్లతో తేలిపోయాడు.

భారత్ తరపున ఆడిన 13 వన్డేలలో సంజు శాంసన్ కు 55.71 సగటు ఉన్నా భారతజట్టులో చోటుకు మాత్రం గ్యారెంటీ లేకుండా పోయింది. రాహుల్ అందుబాటులోకి వస్తే..బ్యాకప్ వికెట్ కీపర్ బ్యాటర్ గా ఇషాన్ కిషన్ ఎంపిక ఖాయమని చెప్పాల్సిన పనిలేదు. దీంతో సంజు శాంసన్ కు జట్టులో చోటుకు అవకాశమే కనిపించడం లేదు.

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు 2023 ఆసియాకప్ లో తన ప్రారంభమ్యాచ్ ను సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఆడాల్సి ఉంది.

First Published:  17 Aug 2023 5:45 AM GMT
Next Story