Telugu Global
Sports

శుభ్ మన్ గిల్ కోసం కెప్టెన్ రోహిత్ త్యాగం చేయక తప్పదా?

గిల్ స్థాయికి తగ్గట్టుగా రాణించాలంటే కెప్టెన్ రోహిత్ శర్మ పెద్దమనసుతో త్యాగం చేయక తప్పదని క్రికెట్ పండితులు అంటున్నారు.

శుభ్ మన్ గిల్ కోసం కెప్టెన్ రోహిత్ త్యాగం చేయక తప్పదా?
X

యువబ్యాటర్ శుభ్ మన్ గిల్ వరుస వైఫల్యాలు భారత విజయావకాశాలను దెబ్బతీస్తూ వస్తున్నాయి. గిల్ స్థాయికి తగ్గట్టుగా రాణించాలంటే కెప్టెన్ రోహిత్ శర్మ పెద్దమనసుతో త్యాగం చేయక తప్పదని క్రికెట్ పండితులు అంటున్నారు.

శుభ్ మన్ గిల్..అంతర్జాతీయ క్రికెట్లోనే అత్యంత ప్రతిభావంతులైన యువబ్యాటర్ల వరుసలో అందరికంటే ముందు వరుసలో ఉండే ఆటగాడు. గిల్ లోని అపారప్రతిభను

గుర్తించిన బీసీసీఐ పదేపదే అవకాశాలూ ఇస్తూ వస్తోంది.

కుర్రాడు..కుర్రాడు అనిచూస్తే.....

వన్డే ఫార్మాట్ లో పరుగులు, సెంచరీల మోత మోగిస్తున్న శుభ్ మన్ గిల్ ను...మూడు ఫార్మాట్లోనూ రాణించే దమ్మున్న క్రికెటర్ గా టీమ్ మేనేజ్ మెంట్ గుర్తించి నెత్తిన పెట్టుకొంటూ వస్తోంది. వన్డే, టెస్టు, టీ-20 ఫార్మాట్లలో తగిన అవకాశాలు కల్పిస్తూ వస్తోంది.

అయితే..గత ఏడాది కాలంగా సాంప్రదాయ టెస్టు ఫార్మాట్లో శుభ్ మన్ వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. కుర్రాడు కుర్రాడంటే ఏదో చేశాడన్న సామెతను 23 సంవత్సరాల శుభ్ మన్ గిల్ నిజం చేసి జట్టుకే భారంగా మారాడు.

21 టెస్టుల్లో 1063 పరుగులు...

శుభ్ మన్ గిల్ తన టెస్టు కెరియర్ ను ఓపెనర్ గా మొదలు పెట్టాడు. ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన గిల్ 16 టెస్టుల్లో 871 పరుగులతో 32.37 సగటు నమోదు చేశాడు.

టెస్టుజట్టులోకి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ చేరికతో గిల్ వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగాల్సి వస్తోంది. అయితే..వన్ డౌన్ స్థానం గిల్ కు పెద్దగా అచ్చివచ్చినట్లు కనిపించడం లేదు. వరుస వైఫల్యాలతో తాను ఉక్కిరిబిక్కిరవుతూ టీమ్ మేనేజ్ మెంట్ సహనానికే పరీక్షగా నిలిచాడు.

మొత్తం 21 టెస్టుల్లో 1063 పరుగులు సాధించిన గిల్...హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్ తో ముగిసిన తొలిటెస్టు రెండుఇన్నింగ్స్ లోనూ దారుణంగా విఫలమయ్యాడు.

వన్ డౌన్ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన గిల్ మొదటి ఇన్నింగ్స్ లో 23 పరుగులు సాధించినా...కీలక రెండో ఇన్నింగ్స్ లో డకౌట్ గా వెనుదిరగడం భారత పరాజయానికి కారణాలలో ఒకటిగా నిలిచింది.

చెత్త షాట్లు ఆడుతూ తనకుతానుగా అవుటవుతున్నాడంటూ గవాస్కర్ లాంటి సీనియర్ కామెంటీటర్లు గిల్ పైన మండి పడుతున్నారు. మరోవైపు టెస్టు జట్టు నుంచి గిల్ ను పక్కన పెట్టాలంటూ సెలెక్టర్లతో పాటు టీమ్ మేనేజ్ మెంట్ పైన సైతం ఒత్తిడి పెరిగిపోతూ వస్తోంది.

రోహిత్ చేతిలో గిల్ భవిష్యత్....

గాడితప్పిన శుభ్ మన్ గిల్ కెరియర్ తిరిగి దారిలోకి రావాలంటే ..కెప్టెన్ రోహిత్ శర్మ పెద్దమనసుతో ముందుకు రావాలని, త్యాగం చేయటానికి సిద్ధం కావాలని మరో క్రికెట్ వ్యాఖ్యాత వాసిం జాఫర్ పిలుపునిచ్చాడు.

రోహిత్ తన ఓపెనింగ్ స్థానాన్ని గిల్ కు ఇచ్చి తాను వన్ డౌన్ స్థానంలో బ్యాటింగ్ కు దిగితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని సలహా ఇచ్చాడు. వన్ డౌన్ స్థానంలో గిల్ ఎందుకో అసౌకర్యంగా కనిపిస్తున్నాడని, ఎంతగా ప్రయత్నించినా పాదుకోలేకపోతున్నాడంటూ జాఫర్ విశ్లేషించారు.

గిల్ తనదైన శైలిలో బ్యాట్ చేయాలంటే ఓపెనర్ గానే బరిలోకి దిగటం అనివార్యమని తేల్చి చెప్పాడు. అపారఅనుభవం కలిగిన రోహిత్ కు వన్ డౌన్ స్థానంలో బ్యాట్ చేయటం ఏమంత కష్టంకాబోదని వివరించాడు.

మరి..వాసిం జాఫర్ మాటను భారత టీమ్ మేనేజ్ మెంట్ తో పాటు..కెప్టెన్ రోహిత్ శర్మ మన్నించి..పెద్దమనసుతో తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేస్తాడా..? వేచిచూడాల్సిందే.

First Published:  30 Jan 2024 10:00 AM GMT
Next Story