Telugu Global
Sports

బుమ్రా దుమ్మురేపుతాడా..? సంజు నిల‌దొక్కుకుంటాడా..?

ముఖ్యంగా బుమ్రా, సంజు శాంస‌న్ లాంటి ఆట‌గాళ్లు స్థాయికి తగ్గ‌ట్టు ఆడితే ఐర్లాండ్‌ను చిత‌క్కొట్టేయవ‌చ్చు. అదే ఊపు ఆసియా క‌ప్‌లో కంటిన్యూ చూస్తే వ‌రల్డ్‌క‌ప్‌కి కాన్ఫిడెంట్‌గా వెళ్లొచ్చు.

బుమ్రా దుమ్మురేపుతాడా..? సంజు నిల‌దొక్కుకుంటాడా..?
X

వ‌న్డే ఇంట‌ర్నేష‌న‌ల్ ప్ర‌పంచ‌క‌ప్ ప‌ట్టుమ‌ని 50 రోజులు కూడా లేదు. అదీ స్వ‌దేశంలోనే. ఇంత‌కుముందు లాగా శ్రీ‌లంక‌, పాకిస్తాన్ వంటి దేశాల‌తో కలిసి కాకుండా పూర్తిస్థాయిలో ఇండియానే ఆతిథ్య‌మిస్తున్న తొలి వ‌ర‌ల్డ్‌క‌ప్ ఇది. కాబ‌ట్టి ఇక్క‌డ క‌ప్ గెల‌వ‌డం మ‌నకు చాలా ప్ర‌తిష్టాత్మ‌కం. ఇంత‌కీ మ‌న‌కు ప్ర‌పంచ‌క‌ప్ గెలిచే స‌త్తా ఎంత వ‌ర‌కు ఉంద‌ని విశ్లేషిస్తే ముందుగా అధిగ‌మించాల్సిన అడ్డంకులు చాలానే క‌నిపిస్తున్నాయి.

ఇక్క‌డ గాడిన‌ప‌డి.. ఆసియాక‌ప్‌లో చెల‌రేగాలి

మొన్న వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో నెత్తి బొప్పి క‌ట్టింది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ కు అర్హ‌త సాధించలేక‌పోయిన వెస్టిండీస్‌ను త‌క్కువ అంచనా వేసి, కోహ్లీ, రోహిత్‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి.. పాండ్యా నేతృత్వంలో టీమ్‌ను పంపిస్తే 3-2 తేడాతో ఓడిపోయి ఇంటికొచ్చింది. అయితే అవి టీ20లు, అందులో అనుకూలించిన రోజున ఏ టీమ్ అయినా గెలుస్తుంది.. ధ‌నాధ‌న్ ఆట‌తీరుకు మారుపేరైన టీమిండియా వెస్టిండీస్‌తో జ‌రిగిన‌ టీ20ల్లో ఓడిపోవాల్సిన సిరీస్ కానే కాదు. అందుకే ఐర్లాండ్ సిరీస్‌లో జ‌ట్టు గాడిన‌ప‌డి, ముఖ్యంగా బుమ్రా, సంజు శాంస‌న్ లాంటి ఆట‌గాళ్లు స్థాయికి తగ్గ‌ట్టు ఆడితే ఐర్లాండ్‌ను చిత‌క్కొట్టేయవ‌చ్చు. అదే ఊపు ఆసియా క‌ప్‌లో కంటిన్యూ చూస్తే వ‌రల్డ్‌క‌ప్‌కి కాన్ఫిడెంట్‌గా వెళ్లొచ్చు.

వీళ్ల ప్ర‌ద‌ర్శ‌న కీల‌కం

11 నెల‌ల త‌ర్వాత అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి పున‌రాగ‌మ‌నం చేసిన స్పీడ్‌స్ట‌ర్ జస్ప్రీత్ బుమ్రా ఐర్లాండ్‌తో సిరీస్‌కు కెప్టెన్‌గా బ‌రిలోకి దిగుతున్నాడు. అత‌ను ఘ‌నంగా పున‌రాగ‌మ‌నం చాటుకోవాలి. ఆసియాక‌ప్‌, ఆ త‌ర్వాత ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వాలంటే మ‌న అమ్ముల‌పొదిలోని ప్ర‌ధానాస్త్రాల్లో బుమ్రా ఒక‌డు. అత‌నే మ‌న బౌలింగ్ ద‌ళానికి నాయ‌కుడు కూడా. కాబ‌ట్టి ఐర్లాండ్‌తో సిరీస్‌లో అత‌ను ల‌య దొర‌క‌బుచ్చుకుంటే చాలు చెల‌రేగిపోతాడ‌ని భావిస్తున్నారు. ఇక కీప‌ర్‌గా సంజు శాంస‌న్‌కు ఇది ఓ ర‌కంగా చివ‌రి అవకాశం. ప్ర‌త్యామ్నాయంగా జితేశ్ శ‌ర్మను ఎంపిక చేసినా సంజుకే ఈ సిరీస్‌లో అవ‌కాశం ఇస్తారు. వెస్టిండీస్ సిరీస్ మొత్తం అట్ట‌ర్‌ఫ్లాఫ్ అయిన సంజు ఇక్క‌డ క్లిక్ అవ‌క‌పోతే వ‌రల్డ్ క‌ప్‌కు కాదు క‌దా ఆసియా క‌ప్‌కు కూడా ఆశ‌పెట్టుకోన‌క్క‌ర్లేదు.

తిల‌క్ వ‌ర్మ చెల‌రేగితే..

మ‌రోవైపు వెస్టిండీస్‌తో సిరీస్‌లో స‌త్తాచాటిన తెలుగు కుర్రాడు తిల‌క్‌వ‌ర్మ మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మ‌న్‌గా భార‌త జ‌ట్టులో చోటు సుస్థిరం చేసుకోవ‌డానికి ఐర్లాండ్‌తో సిరీస్ సువ‌ర్ణావ‌కాశం. కేఎల్ రాహుల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ టీంలోకి వ‌స్తే తిల‌క్‌కు చోటు ఉండ‌క‌పోవ‌చ్చు కానీ, వాళ్లింకా ఫిట్‌నెస్ సాధించారా అన్న‌ది మ్యాచ్ ఆడాకే తెలుస్తుంది. కాబ‌ట్టి తిల‌క్ వర్మ కష్ట‌ప‌డితే అదృష్టం.. అత‌నికి ప్ర‌పంచ‌క‌ప్‌లో చోటు క‌లిసిరావ‌చ్చు.

First Published:  18 Aug 2023 5:44 AM GMT
Next Story