Telugu Global
Sports

పూజారాను బలిపశువుని చేస్తారా: గవాస్కర్ ఆగ్రహం!

వెస్టిండీస్ తో రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు భారతజట్టును ఎంపిక చేసిన తీరుపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పూజారాను బలిపశువుని చేస్తారా: గవాస్కర్ ఆగ్రహం!
X

పూజారాను బలిపశువుని చేస్తారా: గవాస్కర్ ఆగ్రహం!

వెస్టిండీస్ తో రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు భారతజట్టును ఎంపిక చేసిన తీరుపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొహ్లీతో సహా అందరూ విఫలమైతే కేవలం పూజారానే ఎందుకు పక్కనపెట్టారంటూ గవాస్కర్ నిలదీశారు.

ఐసీసీ టెస్టు లీగ్ ( 2023- 2025 ) లో భాగంగా వెస్టిండీస్ తో జరిగే రెండుమ్యాచ్ ల సిరీస్ కోసం 16 మంది సభ్యుల భారతజట్టును ఎంపిక చేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

భారత మాజీ కెప్టెన్, విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్ తో పాటు ..టెస్టు మాజీ ప్లేయర్లు ఆకాశ్ చోప్రా, వసీం జాఫర్ సైతం ఎంపిక విధానాన్ని, సెలెక్టర్లను తప్పుపట్టారు.

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు నుంచి ఎవర్ డిపెండబుల్ చతేశ్వర్ పూజారా, సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ లను పక్కనపెట్టడంతో పాటు..మరో సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి విశ్రాంతినిచ్చారు.

అపారఅనుభవం కలిగిన చతేశ్వర్ పూజారాను తప్పించి..యువఆటగాడు యశస్వి జైశ్వాల్ కు జట్టులో చోటు కల్పించారు. ఐపీఎల్ లో చెన్నై ఓపెనర్ రితురాజ్ గయక్వాడ్ కు సైతం అనూహ్యంగా టెస్టుజట్టులో చోటు దక్కింది.

పూజారా అంటే అంతఅలుసా?

భారతజట్టు కోసం గత దశాబ్దకాలంగా అంకితభావంతో ఆడుతూ వస్తున్న నయావాల్ చతేశ్వర్ పూజారాను గత ఆరుమాసాలలో రెండోసారి పక్కనపెట్టడాన్ని విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్ తీవ్రమైన తప్పిదంగా పేర్కొన్నారు.

ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ కు భారతజట్టు రెండుసార్లు ఫైనల్స్ చేరుకోడంలో చతేశ్వర్ పూజారా కీలకపాత్ర పోషించిన వాస్తవాన్ని అందరూ మరచిపోయారా అంటూ నిలదీశారు. అసలు పూజారా చేసిన తప్పేంటని ఎంపిక సంఘాన్ని ప్రశ్నించారు.

టెస్టులీగ్ ఫైనల్లో అజింక్యా రహానే మినహా మిగిలిన బ్యాటర్లంతా విఫలమైతే కేవలం పూజారానే ఎందుకు బలిపశువును చేశారంటూ గవాస్కర్ మండిపడ్డారు. భారతజట్టు కోసం ఐపీఎల్ కు దూరమై..ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో ఆడుతున్నందుకు పూజారాను శిక్షిస్తారా? పూజారా లాంటి నిజాయితీ పరుడైన ఆటగాడిని ఇలా అవమానించడం తగదని హితవు చెప్పారు.

ఓవల్ వేదికగా జరిగిన టెస్టు లీగ్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్ లో 14, రెండో ఇన్నింగ్స్ లో 27 పరుగుల స్కోర్లను పూజారా సాధించాడు. ఇదే టెస్టులో భారత్ 209 పరుగుల ఘోరపరాజయం చవిచూడటంతో..వయసును సాకుగా చూపడం ద్వారా పూజారాను జట్టు నుంచి తప్పించారు.

వయసు అవరోధమే కాదు....

చురుకుగా క్రికెట్ ఆడుతూ..పరుగులు సాధిస్తున్నంతకాలం పూజారా లాంటి బ్యాటర్లకు వయసు ఏమాత్రం ప్రతిబంధకం కాబోదని గవాస్కర్ తేల్చి చెప్పారు. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో 39 నుంచి 40 సంవత్సరాల వయసు వచ్చే వరకూ వివిధ దేశాల క్రికెటర్లు టెస్టుమ్యాచ్ లు ఆడుతున్న విషయాన్ని గవాస్కర్ గుర్తు చేశారు.

ఓవల్ టెస్టులో భారత బ్యాటర్లంతా సమష్టిగా విఫలమైతే..పూజారాను మాత్రమే ఎందుకు జట్టు నుంచి తప్పించారంటూ ప్రశ్నించారు.

మరోవైపు..వెస్టిండీస్ తో సిరీస్ కు తనను ఎంపిక చేయకపోడంతో ఈ నెల 28 నుంచి జరిగే దేశవాళీ ( దిలీప్ ట్రోఫీ ) జోనల్ క్రికెట్ పోటీలలో పాల్గొనాలని చతేశ్వర్ పూజారా నిర్ణయించాడు.

మొత్తం ఎనిమిది జోనల్ జట్లు తలపడుతున్న ఈ టోర్నీలో పూజారాతో పాటు టీ-20 తురుపుముక్క సూర్యకుమార్ యాదవ్ సైతం వెస్ట్ జోన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు.

సర్ఫ్ర్జాజ్ ఖాన్ కు ఇంత అన్యాయమా?

దేశవాళీ రంజీట్రోఫీలో గత మూడుసీజన్లుగా టన్నులకొద్దీ పరుగులు సాధిస్తున్న మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫ్ర్జాజ్ ఖాన్ ను మరోసారి పట్టించుకోకుండా పక్కనపెట్టడాన్ని భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తప్పుపట్టాడు.

ఐపీఎల్ లో..అదీ వైట్ బాల్ క్రికెట్లో రాణించిన ఆటగాళ్లకే జట్టులో పెద్దపీట వేస్తారా అంటూ ఎంపిక సంఘాన్ని నిలదీశారు. రెడ్ బాల్ క్రికెట్లో రాణిస్తున్న సర్ఫ్ర్జాజ్ ఖాన్ ను పట్టించుకోకుండా రితురాజ్ గయక్వాడ్ ను ఎందుకు ఎంపిక చేశారంటూ ప్రశ్నించారు.

సునీల్ గవాస్కర్ సైతం..ముంబై మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫ్ర్జాజ్ ఖాన్ కు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపారు. దేశవాళీ క్రికెట్లో..అదీ రంజీట్రోఫీలో వరుసగా మూడేళ్లపాటు రాణిస్తున్నా ఖాతరు చేయకపోతే..ఆ బ్యాటర్ ఏంచేయాలంటూ మండిపడ్డారు. రంజీట్రోఫీలో ఇక పాల్గొనవద్దని సర్ఫ్ర్జాజ్ ఖాన్ కు చెప్పడంటూ సెలెక్టర్లకు చురకలంటించారు.

25 సంవత్సరాల సర్ఫ్ర్జాజ్ ఖాన్ కు ఇప్పటి వరకూ ఆడిన 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 13 శతకాలతో సహా 3వేల 505 పరుగులు సాధించిన రికార్డు ఉంది. 2021-22 రంజీ సీజన్లో 4 సెంచరీలతో సహా 982 పరుగులు, 2022- 23 సీజన్లో 3 శతకాలతో 556 పరుగులు సాధించాడు. 100కు పైగా సగటుతో ఉన్న సర్ఫ్ర్జాజ్ ఖాన్ కు భారత టెస్టు జట్టు మిడిలార్డర్లో చోటు దక్కాల్సి ఉంది.

First Published:  24 Jun 2023 11:30 AM GMT
Next Story