Telugu Global
Sports

మూడురోజుల్లో రెండుసార్లు హార్థిక్ పాండ్యా పెళ్లి!

భారత డాషింగ్ ఆల్ రౌండర్, టీ-20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యా..మూడేళ్ల కుమారుడు సాక్షిగా మూడురోజుల్లో రెండుసార్లు వివాహం చేసుకొని సంచలనం సృష్టించాడు.

మూడురోజుల్లో రెండుసార్లు హార్థిక్ పాండ్యా పెళ్లి!
X

మూడురోజుల్లో రెండుసార్లు హార్థిక్ పాండ్యా పెళ్లి!

భారత టీ-20 కెప్టెన్ హార్థిక్ పాండ్యా ఏది చేసినా సంచలనమే. చివరకు తన పెళ్లిని సైతం సంచలనంగా మార్చి సరికొత్త ట్రెండ్ సృష్టించాడు....

భారత డాషింగ్ ఆల్ రౌండర్, టీ-20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యా..మూడేళ్ల కుమారుడు సాక్షిగా మూడురోజుల్లో రెండుసార్లు వివాహం చేసుకొని సంచలనం సృష్టించాడు.

భారత క్రికెట్ చరిత్రలోనే కొడుకు పుట్టిన మూడేళ్లకు తన జీవితభాగస్వామిని రెండు సాంప్రదాయాల ప్రకారం మనువాడిన తొలి క్రికెటర్ గా నిలిచాడు.

హార్ధిక్ పాండ్యా స్టయిలే వేరు...

భారత క్రికెటర్లు కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ఇటీవలే తాము ఏడాది క్రితం నిశ్చితార్థం చేసుకొన్న తమ ప్రియురాళ్లను వివాహం చేసుకొని ఓ ఇంటివారయ్యారు. అయితే..వైట్ బాల్ క్రికెట్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా మాత్రం..తన స్టయిలే వేరన్నట్లుగా..గత ఐదుసంవత్సరాలుగా క్రోయేషియా నటి నటాషా స్టాన్ కోవిచ్ తో సహజీవనం చేస్తూ..ఓ బిడ్డకు తండ్రిగా మారిన మూడేళ్లకు గానీ తన బంధాన్ని వివాహబంధంగా మార్చుకోలేకపోయాడు.

ముందు సంపారం, ఆ తర్వాతే పెళ్లి...

కాలం మారిపోయింది. ముందువెనుకలు సైతం మారిపోయాయి. గతంలో ముందుగా పెళ్లి చేసుకొని ఆ తర్వాత సంసారం మొదలు పెట్టేవారు. అయితే..ప్రపంచీకరణ పుణ్యమా అంటూ అదికాస్త ఇప్పుడు రివర్స్ అయ్యింది.

ముందుగా సంసారం, ఆ తర్వాతే ..అదీ తీరిక చిక్కినప్పుడు, బుద్దిపుట్టినప్పుడు మాత్రమే పెళ్లి అన్న సాంప్రదాయానికి హార్థిక్ పాండ్యా శ్రీకారం చుట్టాడు. హార్థిక్ పాండ్యా ప్రేమికురాలు నటాషా మూడు గత ఐదేళ్లుగా హార్థిక్ తో సహజీవనం చేస్తూ వచ్చింది. మూడేళ్ల క్రితమే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ కుమారుడు ఆగస్త్యకు మూడేఏడు వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాలని అనిపించింది.

ఉదయ్ పూర్ లో పెళ్లి వేడుకలు...

స్టార్ ఆల్ రౌండర్ గా, భారత క్రికెటర్ గా ఇప్పటికే వందల కోట్ల రూపాయలు ఆర్జించిన హార్థిక్ పాండ్యా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వేదికగా మూడురోజుల వ్యవధిలో రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహం వేడుకగా జరుపుకొన్నాడు.

వలెంటీన్ డే రోజున ముందుగా నటాషా కోరిక మేరకు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొన్నాడు. ఈ పెళ్లి వేడుకల్లో తన తల్లిదండ్రుల కంటే మూడేళ్ల బుడతడు

అగస్త్య పాండ్యానే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

ఆ తర్వాత రెండురోజుల వ్యవధిలో మరోమారు తన కుటుంబసభ్యుల కోసం హార్థిక్ పాండ్యా రెండోసారి హిందూసాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొన్నాడు.

సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ గా ఉండే హార్ధిక్ పాండ్యా, నటాషా తమ వివాహవేడుకల చిత్రాలను అభిమానులతో పంచుకొని మరీ మురిసిపోయారు.

ఐపీఎల్ విజేత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా సీజన్ కు 15 కోట్ల రూపాయలకు పైగా వేతనం అందుకొంటున్నాడు. ఇది కాక బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు ద్వారా ఏడాదికి 6 నుంచి 7 కోట్ల రూపాయలు, ఆడిన ప్రతి టీ-20 మ్యాచ్ కు 4 లక్షలు, వన్డే మ్యాచ్ కు 7 లక్షలు, టెస్టుమ్యాచ్ కు 15 లక్షల రూపాయలు మ్యాచ్ ఫీజులు అందుకొంటూ..అవీ చాలవన్నట్లుగా ఎండార్స్ మెంట్ల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.

అన్నట్లు..నిరుపేద కుటుంబం నుంచి ..అష్టకష్టాలు పడి అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగిన హార్థిక్ కు విలాసవంతంగా జీవించడం అన్నా..కోట్ల రూపాయల ఖరీదు చేసే వాచీలు, సూట్లు ధరించడం అన్నా ఎంతో మక్కువ.

First Published:  17 Feb 2023 8:20 AM GMT
Next Story