Telugu Global
Sports

అందుకే వైసీపీకి రాయుడి రాజీనామా..!

భారత మాజీ క్రికెటర్, తెలుగుతేజం అంబటి రాయుడి రాజకీయ అరంగేట్రం తొమ్మిదిరోజుల ముచ్చటగా మిగిలింది.

అందుకే వైసీపీకి రాయుడి రాజీనామా !
X

భారత మాజీ క్రికెటర్, తెలుగుతేజం అంబటి రాయుడి రాజకీయ అరంగేట్రం తొమ్మిదిరోజుల ముచ్చటగా మిగిలింది. వైసీపీ నుంచి తాను వైదొలగటానికి అసలు కారణమేంటో రాయుడు బయటపెట్టాడు. తెలుగుతేజం, భారత మాజీ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు ఏదీ చేసినా అందులో ఓ ట్విస్టు ఉండితీరుతుంది. చివరకు రాజకీయ అరంగేట్రంలోనూ అదే జరిగింది.

తొమ్మిదిరోజుల ముచ్చటగా..!

క్రికెట్ నుంచి పూర్తి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత అంబటి రాయుడు తన రాజకీయ అరంగేట్రం కోసం ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీని ఎంచుకొన్నాడు. రిటైర్మెంట్ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయాలని భావించాడు. దానికి తగిన వేదిక వైసీపీనే అని నిర్ణయించుకొనే తొమ్మిదిరోజుల క్రితమే సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నాడు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై శాసనసభ లేదా లోక్ సభ బరిలోకి దిగటం ఖాయమన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే.. వైసీపీ తీర్థం పుచ్చుకొన్న తొమ్మిదిరోజులకే తాను పార్టీని వీడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

రాజీనామాకు అసలు కారణం..?

ఐపీఎల్ చాంపియన్ ప్లేయర్ రాయుడి రాజకీయ ఇన్నింగ్స్ కేవలం తొమ్మిదిరోజుల ముచ్చటగా ముగిసిపోడంపై జోరుగా పలురకాల ఊహాగానాలు చెలరేగాయి. అయితే.. తన రాజీనామాకు అసలు కారణం ఏంటో రాయుడు సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు. రాజకీయాలకు మరికొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించిన కారణంగానే తాను వైసీపీ నుంచి వైదొలిగానని, గల్ఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్ లో తాను ముంబై ఇండియన్స్ తరపున ఆడే అవకాశం రావడంతోనే రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించినట్లు వివరించాడు.

క్రికెట్ ఆడుతూ రాజకీయాలలో కొనసాగలేమని, రెండు పడవలపై కాళ్ళు వేయటం తనకు ఇష్టం లేదని చెప్పాడు. తనకు వైసీపీలో చేరే అవకాశం ఇచ్చిన పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపాడు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్, డీప్యూటీ సీఎం నారాయణ స్వామి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిల సమక్షంలో వైసీపీ కండువా కప్పుకొన్న సంగతి తెలిసిందే.

భారత్ తరపున 55 వన్డేలు..

అండర్ -19 ప్రపంచకప్ లో భారత్ కు నాయకత్వం వహించిన అంబటి రాయుడులో అపార ప్రతిభ ఉన్నా సీనియర్ ప్రపంచకప్ లో పాల్గొనే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోడంతో ఐఫీఎల్ మినహా మిగిలిన క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. 2014- 2019 మధ్యకాలంలో భారత్ తరపున 55 వన్డేలు, 6 టీ-20 మ్యాచ్ ల్లో మాత్రమే పాల్గొనే అవకాశం రాయుడికి దక్కింది. 2019లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రాయుడికి ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకడిగా పేరుంది. ముంబై తరపున, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ ట్రోఫీలు, పతకాలు సాధించిన అరుదైన రికార్డు రాయుడికి ఉంది. తన ఐపీఎల్ కెరియర్ లో 204 మ్యాచ్ లు ఆడి 4348 పరుగుల ఘనత సైతం రాయుడికి మాత్రమే సొంతం.

2023 సీజన్లో చివరిసారిగా ఐపీఎల్ లో పాల్గొన్న రాయుడు.. ఆ తరువాత కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొని కేవలం 3 మ్యాచ్ లకే పరిమితమయ్యాడు. దుబాయ్ వేదికగా జనవరి 20 నుంచి జరగనున్న ఇంటర్నేషనల్ టీ-20 లీగ్ లో ముంబై ఇండియన్స్ తరపున రీఎంట్రీ చేయనున్నాడు.

*

First Published:  8 Jan 2024 6:02 AM GMT
Next Story